రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రామమందిర క్షేత్రమైన అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్థానిక పరిస్థితులు చెపుతున్నాయి. రామాలయ అంశంలో తప్ప చాలా విషయాల్లో బీజేపీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి.
ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ మళ్లీ బరిలో నిలపగా, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని బరిలో దించింది. 2012లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను ఓడించిన తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేకు టికెటిచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడూ వదిలి పెట్టలేదనే సానుకూలత ఈసారి కూడా కాషాయదళానికి కలిసి రానుంది.
బీజేపీ, ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామమందిర సమస్యను తమ పక్షాన పరిష్కరించలేకపోయేవారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి గుప్తాపై మాత్రం ఇక్కడి వాళ్లలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆయన మరోసారి మోది, సీఎం యోగి ఇమేజీనే నమ్ముకుని ప్రచారం చేశారు. ఫ్రీ రేషన్, గృహ నిర్మాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, మోదీ, యోగీ పాలనపైనే ఓట్లడిగారు. కానీ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధేమీ లేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది. బీఎస్పీ మ్రాతం అయోధ్యలో కులసమీకరణలపై గట్టిగా దృష్టి పెట్టింది.
సమాజ్‌వాదీకి అండగా నిలిచే యాదవులు, ముస్లింలు కలిపి అయోధ్యలో 92 వేల మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ ఎత్తుగడతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి ఉంటాయని, ఇది ఎస్పీకి ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐదో దశలో భాగంగా గత ఆదివారం ఇక్కడ పోలింగ్ జరిగింది. ఎస్పీ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందన్నది ఈ నెల 10న కౌంటింగ్‌లో తేలనుంది. కాంగ్రెస్, ఆప్ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రంగానే కన్పిస్తోంది.
కూల్చివేతలపై గుర్రు
అయోధ్య పట్టణానికి చుట్టుపక్కల వేల దుకాణాలను రోడ్ల వెడల్పు పేరుతో కూలగొట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్తున్నా తరతరాలుగా ఈ దుకాణాలను నడుపుకుంటున్న దుకాణదారులు మాత్రం అధికార బీజేపీపై కోపంగానే ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి గుప్తా 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఇక్కడ 1991 నుంచీ బీజేపీనే గెలుస్తోంది. 2012లో మాత్రం ఎస్పీ నుంచి పాండే కేవలం 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రామమందిరంతో పాటు బ్రాహ్మణ, యాదవ, ముస్లిం కులాల సమీకరణలు, జాతీయ స్థాయిలో మోదీ పాలన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చిన యోగి హయాంలో నెలకొన్న సుస్థిరత తదితరాలు అయోధ్యలో ఈసారి కీలక పాత్ర పోషించాయి.
ఐదు దశలపై అంతటా ఆసక్తి
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఐదు దశల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 6, 7 దశల్లో మిగతా 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఏడో తేదీతో పోలింగ్ ప్రకియ ముగుస్తుంది. మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో పోలింగ్ ముగియడంతో వీటిలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కనున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ పూర్తయిన 292 స్థానాల్లో బీజేపీ, సమాజ్ వాది–ఆర్‌ఎల్డీ కూటమి దాదాపు సమానంగా పంచుకోవచ్చని సర్వే పండితులు చెపుతున్నారు. మెజారిటీ ఎవరికి దక్కేదీ ఆరు, ఏడు దశల్లోనే తేలవచ్చని జోస్యం చెప్తున్నారు.
ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన 292 సీట్లలో బీజేపీ కాస్త ముందున్నట్టు కన్పిస్తున్నా ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి అనూహ్య విజయాలు సాధిస్తుందని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా లక్నో అసోసియేట్ ఎడిటర్ సంపత్ పాండే అంచనా వేశారు. మొత్తంమీద ఏడో దశ పోలింగే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేదని ఆయన విశ్లేషించారు. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమికి సానుకూలత బాగా వ్యక్తమైందని ఓ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తర్వాతి మూడు దశల్లో కూటమికి, బీజేపీకి పోటీ రసవత్తరంగా సాగిందని విశ్లేషించింది.
ఇక పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి ఆశించిన స్థాయిలో కాకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలవనుందని యూపీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం అంచనా వేసింది. ‘‘తొలి మూడు దశల పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మేం ఒకటికి రెండుసార్లు పోస్టు పోల్ సర్వే చేయించాం. ఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమికి స్వల్పంగా స్థానాలు పెరుగుతున్నాయి. మా అంచనా మేరకు చివరి నాలుగు దశల పోలింగే మెజారిటీ ఎవరికన్నది తేల్చనుంది’’ అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో చెప్పారు.
కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: అయోధ్య (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment