లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, పీఎం ఇద్దరు ఒకే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం జరగలేదని ఆరోపించారు. యూపీని మూడు దశాబ‍్దాల పాటు పాలించిన ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధిని మరచిపోయారని తీవ్ర విమర్శలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ.. బలరాంపూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు కులం, మతంపై రాజకీయాలు చేయడంతో యూపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మూడు పార్టీలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ నేతలు యూపీకి వచ్చి పాకిస్తాన్, ఉగ్రవాదం, మతం గురించి మాట్లాడతారు తప్ప ఇక్కడి ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. మీ పిల్లలకు సరైన విద్య, ఉద్యోగాలు రాకపోయినా ఓటర్లు మాత్రం అనవసరమైన భావోద్వేగాలకు లోనై వారికి ఓట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. యూపీలో ఐదో దశలో ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరుగనుంది. మార్చి 3న ఆరో దశలో, మార్చి 7న ఏడో దశలో పోలింగ్ కొనసాగనుండగా.. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment