అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథుకు ఆహ్వానం అందింది. వీరిలో మత గురువులు, సినీ తారలు, రాజకీయనేతలు ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేతల్లో ఎవరికి ఆహ్వానం అందిందనే విషయంపై స్పష్టత లేదు. విపక్ష నేతల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్, సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ఎంపీ అధిర్ రంజన్ చైదరీలకు మాత్రం ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. మరి సోనియా ఈ కార్యక్రమానికి వెళ్తారా.. లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.
తాజాగా సోనియా అయోధ్య రామలయ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. సోనియా ఆయోద్య రామలయానికి వెళ్తారా లేదా అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. తగిన సమయంలో తెలియజేస్తాం’ అని ఆపార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ వెల్లడించారు. అయితే రాజకీయంగా సున్నితమైనటువంటి ఈ అంశంపై మిత్రపక్షాలతో విస్తృత చర్చల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా జనవరి 16 నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవం జనవరి 22న రామ్ లాలా విగ్రహ ప్రతిష్టతో ముగుస్తుంది. ఈ వేడుక దేశవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామమందిర ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం రాజకీయ వివాదాన్ని రేపింది.
చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు
రామమందిర ఆలయ ప్రారంభోత్సవాన్ని కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల పావుగా వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో తమను ఆహ్వానించలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని చెప్పారు. ఇక ఆహ్వానం అందిన పలువురు విపక్ష నేతలు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
మరోవైపు మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రామ మందిరం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందో, వ్యాపారం చేస్తుందో వారికే తెలియాలని విమర్శిస్తున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా, రాజకీయ ఎజెండాగా ఉపయోగించడం సరికాదని హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment