లక్నో: ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శల వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా, యూపీలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలపై పరోక్షంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తాను, ఆయన తల్లి (హీరాబెన్ మోదీ) వ్యాక్సిన్ తీసుకున్నామన్నారు. ఆమెకు 100 ఏండ్లు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని చెప్పారు. ఆమె వంతు వచ్చినప్పుడే వాక్సిన్ తీసుకున్నట్టు మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆమె బూస్టర్ డోసును కూడా తీసుకోలేదని వెల్లడించారు.
అనంతరం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. వారిని పరోక్షంగా రాజవంశీకులతో పోల్చి.. వారైతే నిబంధనలు పాటించుకుండా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం ముందు వరుసలో ఉండే వారని విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే వ్యాక్సిన్లను అమ్ముకునేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూపీలో ఫిబ్రవరి 27న ఐదో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment