కోట్లాదిమందికి వ్యాక్సినేషన్‌ ఎలా? | Vaccinating 130Cr people with injectable Covaxin a challenge | Sakshi
Sakshi News home page

కోట్లాదిమందికి వ్యాక్సినేషన్‌ ఎలా?

Published Thu, Dec 3 2020 4:09 AM | Last Updated on Thu, Dec 3 2020 5:34 AM

Vaccinating 130Cr people with injectable Covaxin a challenge - Sakshi

న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది వేసవికి ముందే వస్తుందనే అంచనాలున్నాయి.
వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే వాటి పంపిణీ ఎలా ?   130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో అందరికీ వ్యాక్సినేషన్‌ ఎలా జరుగుతుంది ?


కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వచ్చే ఏడాది వేసవినాటికి 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనాలున్నాయి. ఈ రేసులో ఫైజర్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ముందున్నాయి. ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, సామర్థ్యంగా పని చేస్తాయని తేలితే భారత్‌లో 130 కోట్లకు పైగా ప్రజలకి వ్యాక్సినేషన్‌ చేయడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్‌. ఈ సవాళ్లను అధిగమించడానికి చాలా రోజులుగా కేంద్రం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.

బ్లాక్‌ మార్కెట్లు  
కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూస్తూ ఉండడంతో దీనికి చాలా డిమాండ్‌ ఉంటుంది. దీంతో బ్లాక్‌ మార్కెట్లు విజృంభిస్తున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇచ్చే టీకా చుట్టూ వ్యాపారం జరక్కుండా కేంద్రం చర్యలు తీసుకోవడం అతి పెద్ద సమస్య. వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా, పంపిణీలో అవినీతికి తావు లేకుండా చూడడం అతి పెద్ద సవాలని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

కోల్డ్‌ స్టోరేజీలు
ప్రపంచదేశాల్లో టీకా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించే దేశం మనదే. టీకా పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది.  భారత్‌లో 27 వేల కోల్డ్‌ స్టోరేజీ చైన్లు ఉన్నాయి. కానీ కోట్లాది మందికి వ్యాక్సినేషన్‌ కోసం ఈ కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాలు సరిపోవు. అందులోనూ మోడెర్నా వ్యాక్సిన్‌ మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, ఫైజర్‌ వ్యాక్సిన్‌ను మైనస్‌ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాలి. మన దేశంలో వ్యాక్సిన్‌లను 2 నుంచి 8 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ వద్ద నిల్వ చేస్తూ ఉంటాం. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, దేశీయంగా తయారయ్యే భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌లను సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ నిల్వ చేస్తే సరిపోతుంది. అందుకే ప్రభుత్వం ఈ రెండు వ్యాక్సిన్‌లపైనే దృష్టి సారించింది.

టీకా ప్రాధాన్యాలు 
టీకా అందుబాటులోకి వస్తే తొలుత ఎవరికివ్వాలి అన్న సవాల్‌ ఎదుర్కోవడం అత్యంత సంక్లిష్టమైనది. ప్రాణాలను పణంగా పెట్టి అహరహం శ్రమిస్తున్న  ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు తొలి ప్రాధాన్యమని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఆ తర్వాత 50–65 ఏళ్ల మధ్య వయసున్నవారికి, ఆ తర్వాత 50 ఏళ్లలోపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కానీ వీరి జాబితా తయారు చేయడం శక్తికి మించిన పని. అందుకే ఎవరికి ముందు టీకా ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించడానికి నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. టీకా ఇవ్వడంలో వివక్ష చూపించారన్న విమర్శలు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది.  

ఆర్థిక ఇబ్బందులు
కరోనా వ్యాక్సినేషన్‌కి అవసరమయ్యే ఆర్థిక వనరులు మన ముందున్న అతి పెద్ద సవాల్‌. కరోనా వ్యాక్సిన్‌ ఏ సంస్థదైనా నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు డోసులకి కలిపి భారత్‌లో వెయ్యి రూపాయలుగా ధర నిర్ణయించినట్టుగా ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ –ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. మరి ప్రభుత్వమే ఈ టీకాలను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందా ? లేదంటే రాయితీపై అందిస్తుందా అన్నది అది పెద్ద ప్రశ్న. టీకాపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం ప్రభుత్వానికి శక్తికి మించిన భారమే. అందుకే భారత్‌లో రూ.50 లోపు టీకా ధర నిర్ణయించి, ఒక్క డోసు ఇచ్చేలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆరోగ్యరంగ నిపుణుడు గగన్‌దీప్‌ అభిప్రాయపడుతున్నారు.  

ఆశలు రేపుతున్న వ్యాక్సిన్లు ఇవే..!
► అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌ 95% సురక్షితంగా పనిచేస్తోంది
► ఫైజర్‌ కంపెనీ వ్యాక్సిన్‌ 95% సురక్షితమని తేలింది. దీనికి బ్రిటన్‌ ప్రభుత్వం ఓకే చెప్పింది.
► యూకేకి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వృద్ధుల్లో కూడా బాగా పని చేస్తోంది.  
► రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది.  
► భారత్‌ బయోటెక్, ఐసీఎంఆర్‌ కొవాగ్జిన్‌ పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ ప్రయోగాల్లో ఉంది
► యూకేకి చెందిన నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మొదట్లోనే  ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. అమెరికా కూడా ఈ వ్యాక్సిన్‌ కోసం నిధులు అందిస్తోంది.  
► అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్‌ వ్యాక్సిన్‌ కూడా ఆశాజనక ఫలితాలు ఇస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఈ వ్యాక్సిన్‌ కోసం నిధులు సమకూరుస్తోంది.  


No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement