ఐక్యరాజ్యసమితి: కరోనాపై పోరాటంలో సరైన సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని ప్రపంచ దేశాలకు పంపిణీ చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి వేదికగా భారత్‌కు వివిధ దేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. సెప్టెంబర్ 21–27 వరకు జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలు భారత్‌కు ధన్యవాదాలు చెప్పారు. టీకా డోసులు ఎగుమతితో పాటు, ఇతర అత్యవసర మందులు కూడా పంపిణీ చేసినందుకు భారత్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. నైజీరియా, ఘనా, ఫిజి, డొమినికా, నేపాల్, భూటాన్ తదితర దేశాలకు చెందిన నాయకులు భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాగ్జ్ కార్యక్రమంలో భాగంగా భారత్ 100కిపైగా దేశాలకు 6.6 కోట్ల టీకా డోసుల్ని ఎగుమతి చేసింది. ఏప్రిల్‌లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఎగుమతుల్ని నిలిపి వేసింది. మళ్లీ అక్టోబర్ నుంచి ఎగుమతుల్ని ప్రారం భిస్తామని క్వాడ్ సదస్సు వేదికగా తెలిపింది. భారత్ సహకారం లేనిదే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్రమంగా జరిగేది కాదని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి ప్రశంసిం చారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను యూకే గుర్తించకపోవడాన్ని కూడా పలు దేశాధినేతలు తప్పు పట్టారు. మరోవైపు భారత్ టీకా ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని అమెరికాలో రిపబ్లికన్ పార్టీ సెనెటర్ స్వాగతించారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచాలని సెనేటర్ జిర్ రిస్చ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment