అహ్మదాబాద్‌లో డ్రోన్‌తో నిఘా
న్యూఢిల్లీ: ఏప్రిల్ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు అదొక్కటే మార్గమని తెలంగాణ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం ఆ దిశగా సమాలోచనలు చేస్తోందని తెలిపాయి. అయితే, లాక్‌డౌన్ కొనసాగింపునకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఊహాగానాలు చేయొద్దని సూచించారు. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థన స్థలాల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనే మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం సిఫారసు చేసింది.
ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా లేక కొనసాగించినా ఈ నిర్ణయాలను అమలు చేయాలని సూచించింది. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు ముగిసే ఏప్రిల్ 14 తరువాత నెలకొనే పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ఆ జీఓఎం చర్చించింది. హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర మంత్రులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది.
మత ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. ఎలాగూ వేసవి సెలవులు ఉంటాయి కనుక జూన్ చివరి వరకు విద్యా సంస్థలను మూసేయడమే సరైన నిర్ణయమని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాపై తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలు ఇచ్చే సమాచారమే కీలకమని జీఓఎం పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా భేటీలో చర్చించారని, దేశంలో ఎక్కడా వాటి రవాణాకు అడ్డంకులు ఏర్పడలేదని సంబంధిత మంత్రి వివరించారని అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితిపై లోతైన చర్చ జరిపామని జీఓఎం భేటీ అనంతరం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
40 కోట్ల మంది మరింత పేదరికంలోకి..
కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో మార్చ్ 25 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా భారత్‌లో 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు మరింత పేదరికంలోకి వెళ్లే ప్రమాదముం దని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. మరోవైపు, ఆల్కహాల్ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment