న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యల ఫలితంగా దేశంలో కోవిడ్ వ్యాప్తి వేగంగా జరగలేదని, ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలోనే ఉందని కేంద్రం తెలిపింది. కోవిడ్–19 కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కోవిడ్ మరణాల రేటు దేశంలో 2.82 శాతం కాగా, ప్రపంచ దేశాల సరాసరి 6.13 శాతంగా ఉంది.
అదేవిధంగా, ప్రతి లక్ష మంది బాధితుల్లో దేశంలో 0.41 శాతం మంది మృతి చెందగా ప్రపంచవ్యాప్తంగా ఇది 4.9 శాతంగా ఉంది’అని ఆయన అన్నారు. దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందిందంటూ కొందరు పరిశోధకులు చెప్పడంపై ఆయన స్పందిస్తూ..‘కేసుల సంఖ్య రీత్యా ప్రపంచంలో ఏడో స్థానంలో ఉన్నాం. అయితే, 14 దేశాల మొత్తం జనాభా భారత్‌తో సమానం కాగా ఆయా దేశాల్లో భారత్ కంటే 55.2 శాతం ఎక్కువ కోవిడ్–19 మరణాలు సంభవించాయి. వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’అని ఆయన చెప్పారు.
8,171 కేసులు..204 మరణాలు
దేశంలో మంగళవారం ఒక్క రోజే కోవిడ్–19తో మరో 204 మంది మరణించడంతో మృతుల సంఖ్య 5,598కు చేరుకుంది. అదేవిధంగా, కొత్తగా 8,171 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 1.98 లక్షలకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 97,581కు చేరుకున్నాయనీ, ఇప్పటి వరకు 95,526 మంది కోవిడ్ బాధితులు కోలుకోవడంతో రికవరీ రేటు 48.07 శాతం వరకు ఉందని తెలిపింది. దేశంలో మొత్తం కోవిడ్–19 కేసులు 1,98,706కు పెరగడంతో అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ తర్వాత 7వ స్థానంలో భారత్ ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment