గుంటూరులో గోడౌన్లులు, కోల్డ్ స్టోరేజీల్లో జరుగుతున్న క్రయవిక్రయాలు
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా నిలుస్తోంది. కరోనా, వేసవి కారణంగా మిర్చి యార్డుకు ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది కాలువలకు ఏప్రిల్ వరకు నీరు విడుదల చేయడంతో మిరప దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. యార్డుకు సెలవులు ఇచ్చే సమయానికి రైతుల వద్ద చివరికోత కాయలు మిగిలాయి. పంట దిగుబడి అధికంగా రావడంతో ఇంకా మంచి ధరలు వస్తాయని రైతులు క్వాలిటీ సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 90 శాతం కోల్డ్‌స్టోరేజీలు నిండిపోయాయి. మిగతా జిల్లాలో సైతం 80 శాతం మేర నిండాయి. కల్లాల్లో 15 లక్షల టిక్కీలపైగా సరుకు ఉండిపోయింది.
ఈ సరుకును నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజీలు సైతం ఖాళీగా లేకపోవడంతో రైతులకు ఇబ్బంది ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులు భరోసా ఇచ్చింది. తమ సరుకు అమ్ముకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల పరిధిలో గోడౌన్‌లు, కోల్డ్‌స్టోరేజీల్లో క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో రోజుకు 50 వేల టిక్కీలపైగా మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ధరలు సైతం నిలడకగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలో అతిపెద్దదైన మిర్చి యార్డు కావడంతో తెలంగాణ, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సరుకు గుంటూరుకు వస్తోంది.
కోల్డ్‌స్టోరేజీల్లో భారీగా నిల్వలు
గుంటూరు జిల్లాలోని 130 కోల్డ్‌స్టోరేజీల్లో 1.10 కోట్ల టిక్కీల నిల్వ సామర్థ్యం ఉంది. ఇప్పటికే 90 శాతం నిల్వలున్నాయి. ప్రకాశం జిల్లాలోని 72 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 20 లక్షల టిక్కీలు. కర్నూలు జిల్లాలోని 12 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 8 లక్షల టిక్కీలు. ఈ రెండు జిల్లాల్లో 80 శాతం నిండిపోయాయి. కృష్ణాజిల్లాలోని 26 కోల్డ్ స్టోరేజీల నిల్వ సామర్థ్యం 18 లక్షల టిక్కీలు. వీటిలో 60% నిల్వలు చేరాయి.
ప్రభుత్వానికి ధన్యవాదాలు
కరోనా కష్టకాలంలో సైతం యార్డు మూతపడినా మా సరుకును అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేను 50 బస్తాల సరుకు తెచ్చాను. చివరికోత కాయ అయినా రేట్లు బాగానే ఉన్నాయి. 334 నాటు రకం మిర్చి క్వింటా రూ.9 వేలకు పైగా అమ్మాను. సరుకు నిల్వ చేసుకొందామనుకున్నా కోల్డ్ స్టోరేజీల్లో ఖాళీ లేదు. ఈ తరుణంలో గోడౌన్‌లు, కోల్డ్ స్టోరేజీల వద్ద కొనుగోళ్లు జరపడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– తిరుపతయ్య, మేడికొండూరు, గుంటూరు జిల్లా
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
మార్కెట్ యార్డు మూతపడినా రైతులకు ఇబ్బంది లేకుండా మిర్చి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. రోజులు 50 వేల టిక్కీలకు పైగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. యార్డు మూతబడినప్పటి నుంచి ఇప్పటివరకు బయట 3.05 లక్షల టిక్కీల క్రయవిక్రయాలు జరిగాయి. రూ.122.06 కోట్ల వ్యాపారం జరిగింది. చివరికోత మిర్చి రైతుల వద్ద ఉంది. ఆ సరుకును అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధరలు స్థిరంగా ఉన్నాయి.
– వెంకటేశ్వరరెడ్డి, ఉన్నతశ్రేణి సెక్రటరీ, గుంటూరు మార్కెట్ యార్డు
మార్కెట్‌లో గిరాకీ ఉంది
చైనాతోపాటు, శ్రీలంక ఇతర దేశాలకు మిర్చి ఎగుమతులకు ఆర్డర్లు బాగానే వస్తున్నాయి. లోకల్‌లో సైతం డిమాండ్ ఉంది. కరోనా సమయంలో కూడా మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉన్నాయి. క్వాలిటీ సరుకుకు మంచి ధర వస్తోంది. తేజ రకం క్వింటా ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది. చివరికోత కాయలు కావడంతో సరుకు నాణ్యత బట్టి ధర ఉంటోంది.
– కొత్తూరు సుధాకర్, ఎగుమతి వ్యాపారి
కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు
జిల్లాలో 130 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ ఏడాది పంట దిగుబడుల అధికంగా రా>వడంతో, నాణ్యమైన సరుకును రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతంపైగా కోల్డ్ స్టోరేజీలు నిండాయి. రెండేళ్లుగా కోల్డ్‌స్టోరేజీలు నిండుతున్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా అందుబాటు ధరలో, మిర్చి నిల్వ చేస్తున్నాం.
– పి.సురేంద్రబాబు, సెక్రటరీ, ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment