Mirchi Purchases
-
కొనసాగుతున్న మిర్చి కొనుగోళ్లు
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా నిలుస్తోంది. కరోనా, వేసవి కారణంగా మిర్చి యార్డుకు ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది కాలువలకు ఏప్రిల్ వరకు నీరు విడుదల చేయడంతో మిరప దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. యార్డుకు సెలవులు ఇచ్చే సమయానికి రైతుల వద్ద చివరికోత కాయలు మిగిలాయి. పంట దిగుబడి అధికంగా రావడంతో ఇంకా మంచి ధరలు వస్తాయని రైతులు క్వాలిటీ సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 90 శాతం కోల్డ్‌స్టోరేజీలు నిండిపోయాయి. మిగతా జిల్లాలో సైతం 80 శాతం మేర నిండాయి. కల్లాల్లో 15 లక్షల టిక్కీలపైగా సరుకు ఉండిపోయింది. ఈ సరుకును నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజీలు సైతం ఖాళీగా లేకపోవడంతో రైతులకు ఇబ్బంది ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులు భరోసా ఇచ్చింది. తమ సరుకు అమ్ముకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల పరిధిలో గోడౌన్లు, కోల్డ్‌స్టోరేజీల్లో క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో రోజుకు 50 వేల టిక్కీలపైగా మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ధరలు సైతం నిలడకగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలో అతిపెద్దదైన మిర్చి యార్డు కావడంతో తెలంగాణ, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సరుకు గుంటూరుకు వస్తోంది. కోల్డ్‌స్టోరేజీల్లో భారీగా నిల్వలు గుంటూరు జిల్లాలోని 130 కోల్డ్‌స్టోరేజీల్లో 1.10 కోట్ల టిక్కీల నిల్వ సామర్థ్యం ఉంది. ఇప్పటికే 90 శాతం నిల్వలున్నాయి. ప్రకాశం జిల్లాలోని 72 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 20 లక్షల టిక్కీలు. కర్నూలు జిల్లాలోని 12 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 8 లక్షల టిక్కీలు. ఈ రెండు జిల్లాల్లో 80 శాతం నిండిపోయాయి. కృష్ణాజిల్లాలోని 26 కోల్డ్ స్టోరేజీల నిల్వ సామర్థ్యం 18 లక్షల టిక్కీలు. వీటిలో 60% నిల్వలు చేరాయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు కరోనా కష్టకాలంలో సైతం యార్డు మూతపడినా మా సరుకును అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేను 50 బస్తాల సరుకు తెచ్చాను. చివరికోత కాయ అయినా రేట్లు బాగానే ఉన్నాయి. 334 నాటు రకం మిర్చి క్వింటా రూ.9 వేలకు పైగా అమ్మాను. సరుకు నిల్వ చేసుకొందామనుకున్నా కోల్డ్ స్టోరేజీల్లో ఖాళీ లేదు. ఈ తరుణంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల వద్ద కొనుగోళ్లు జరపడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – తిరుపతయ్య, మేడికొండూరు, గుంటూరు జిల్లా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు మార్కెట్ యార్డు మూతపడినా రైతులకు ఇబ్బంది లేకుండా మిర్చి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. రోజులు 50 వేల టిక్కీలకు పైగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. యార్డు మూతబడినప్పటి నుంచి ఇప్పటివరకు బయట 3.05 లక్షల టిక్కీల క్రయవిక్రయాలు జరిగాయి. రూ.122.06 కోట్ల వ్యాపారం జరిగింది. చివరికోత మిర్చి రైతుల వద్ద ఉంది. ఆ సరుకును అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధరలు స్థిరంగా ఉన్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నతశ్రేణి సెక్రటరీ, గుంటూరు మార్కెట్ యార్డు మార్కెట్లో గిరాకీ ఉంది చైనాతోపాటు, శ్రీలంక ఇతర దేశాలకు మిర్చి ఎగుమతులకు ఆర్డర్లు బాగానే వస్తున్నాయి. లోకల్లో సైతం డిమాండ్ ఉంది. కరోనా సమయంలో కూడా మార్కెట్లో ధరలు నిలకడగా ఉన్నాయి. క్వాలిటీ సరుకుకు మంచి ధర వస్తోంది. తేజ రకం క్వింటా ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది. చివరికోత కాయలు కావడంతో సరుకు నాణ్యత బట్టి ధర ఉంటోంది. – కొత్తూరు సుధాకర్, ఎగుమతి వ్యాపారి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు జిల్లాలో 130 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ ఏడాది పంట దిగుబడుల అధికంగా రా>వడంతో, నాణ్యమైన సరుకును రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతంపైగా కోల్డ్ స్టోరేజీలు నిండాయి. రెండేళ్లుగా కోల్డ్‌స్టోరేజీలు నిండుతున్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా అందుబాటు ధరలో, మిర్చి నిల్వ చేస్తున్నాం. – పి.సురేంద్రబాబు, సెక్రటరీ, ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
ఇదేం‘ధరో’!
ఖమ్మం వ్యవసాయం: ఏకమయ్యారు.. రైతన్నను దగా చేస్తున్నారు.. ఆరుగాలం శ్రమించి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పండించిన పంటను మార్కెట్లో అమ్మకానికి తెస్తే.. నిలువు దోపిడీ చేస్తున్నారు.. కఠిన నిబంధనలు, పారదర్శకంగా మార్కెట్ నిర్వహణ అని ప్రభుత్వం చెబుతున్నా.. అవి మాటలు, కాగితాలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు, దడవాయిలు, కార్మికులు, మార్కెట్ ఉద్యోగులు సిండికేట్‌గా మారి మోసానికి ఒడిగడుతున్నారు. ఇది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిత్య తంతులా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సరుకు అమ్మకానికి తెచ్చిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేయాల్సిన ఉద్యోగులు కక్కుర్తిపడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం మిర్చికి ఉన్న ధర ప్రకారం కూడా కొనుగోళ్లు చేయకుండా సిండికేట్‌గా ఏర్పడి రైతులను దగా చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి క్వింటాల్ ధర రూ.9వేలకు పైగా ఉండగా.. ఖమ్మం మార్కెట్లో ఒకటి, రెండు లాట్లకు ఆ ధర పెడుతూ.. మిగిలిన లాట్లకు రూ.8వేలకు మించి ధర పెట్టడం లేదు. సరుకు నాణ్యత లేదని, తేమగా ఉందని పేర్కొంటూ రూ.6వేలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. గురువారం రఘునాథపాలెం మండలం పడమటితండాకు చెందిన మహిళా రైతు మాలోత్ బుల్లెమ్మ 8 బస్తాల మిర్చిని విక్రయానికి తెచ్చింది. ఆ సరుకును కమీషన్దారు పలువురు ఖరీదుదారులకు చూపించారు. పీకేఆర్ పేరుతో ఉన్న ఖరీదుదారుడు క్వింటాల్‌కు రూ.8,700 ధర నిర్ణయించాడు. అదే ధర వస్తుందనుకున్న బుల్లెమ్మకు వ్యాపారి, కమీషన్ వ్యాపారి, అక్కడున్న మార్కెట్ ఉద్యోగి పెద్ద షాక్ ఇచ్చాడు. మార్కెట్లో ధర నిర్ణయించిన తర్వాత యార్డు గేటు వద్ద ఉన్న సూపర్వైజర్ లాట్ నంబర్‌తో నిర్ణయించిన ధరను పేర్కొంటూ.. సరుకును కాంటా పెట్టి సంబంధిత వ్యాపారికి అప్పగించాలని దడవాయిలకు బాధ్యత అప్పగిస్తాడు. నిరక్షరాస్యురాలైన బుల్లెమ్మ మిర్చికి మార్కెట్ ఉద్యోగి క్వింటాల్‌కు రూ.7వేలుగా పేర్కొంటూ దడవాయిని సరుకు కాంటాకు పంపించారు. దీంతో రైతు బుల్లెమ్మ మరో రైతుకు తన పంటకు ఎంత ధర పడిందో చూడమని చిట్టీ ఇచ్చింది. అందులో రూ.7వేల ధరగా ఉంది. దీంతో ఆమె లబోదిబోమంటూ యార్డు గేటు వద్దకు చేరి తనకు అన్యాయం చేశారని బోరున విలపించింది. ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న మార్కెట్ సూపర్వైజర్ అక్కడి నుంచి జారుకున్నారు. దడవాయిలు తమ తప్పు లేదని ఆమెకు చెప్పారు. ఇదిలా ఉండగా, సరుకు కాంటా, తరలింపు కూడా జరిగిపోయింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరుతున్న క్రమంలో కొందరు ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లి తొలుత నిర్ణయించిన ధర ఇప్పిస్తామని చెప్పారు. క్వింటాల్‌కు ఏకంగా రూ.1,700 తేడాతో రైతుకు దాదాపు రూ.7వేల నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి ఘటనలు మార్కెట్లో నిత్యం చోటు చేసకుంటున్నాయి. ఏకమై దగా.. పంట మార్కెట్‌కు వచ్చింది మొదలు అడుగడుగునా రైతు అన్యాయానికి గురవుతూనే ఉన్నాడు. పంటకు ధర నిర్ణయించే ఖరీదుదారులంతా సిండికేట్‌గా ఏర్పడి ధర పెడుతున్నారు. ఇక కమీషన్ వ్యాపారులు కూడా ఖరీదుదారులతో కూడపలుక్కొని ధర పెట్టిస్తారు. ఈ తతంగమంతా తెలిసిన మార్కెట్ ఉద్యోగులకు ఆమ్యామ్యాలు ముట్టజెబుతూ అక్రమాలను మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. కాగా.. పంట పరిశీలనలో ఓ ధరను నిర్ణయిస్తూ.. తీరా కాంటా సమయంలో సరుకు నాణ్యతగా లేదని చెబుతూ ధరలో కోత పెడుతున్నారు. క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు కోత పెడుతున్నా.. అధికారులు నియంత్రించలేకపోతున్నారు. వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఉద్యోగులు పంట విక్రయంలో తమకు అన్యాయం జరిగిందని రైతులు మొరపెట్టుకున్నా మార్కెట్ ఉద్యోగులు మాత్రం వ్యాపారులకే కొమ్మకాస్తున్నారు. సరుకు నాణ్యత లేనందునే ధర తగ్గించారని, ఆ ధరకే అమ్మాలని వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. బదిలీ అయినా.. ఖమ్మం మార్కెట్లో బదిలీలు జరిగినప్పటికీ కొందరు అక్రమాలకు రుచిమరిగి ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తూ.. అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి పొంది కొత్తగూడెం బదిలీ అయిన ఓ ఉద్యోగి గురువారం ఖమ్మం మార్కెట్ మిర్చి యార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. మీరు బదిలీ అయ్యారుగా అని ప్రశ్నిస్తే.. అవునని, పని ఉండి వచ్చానని బుకాయించాడు. కాగా.. రైతు బుల్లెమ్మకు ధరలో అన్యాయం జరిగిన సమయంలో ఈ అధికారే మిర్చిగేటు వద్ద ఉన్నాడు. పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం.. రైతుల పంటకు తగిన ధర కల్పించటంలో ఎటువంటి చర్యకైనా వెనకాడం. పంటకు ధర నిర్ణయించి.. తిరిగి తగ్గిస్తే సహించేది లేదు. ఇటువంటి ఘటనలపై నిఘా పెంచాం. రైతు బుల్లెమ్మకు జరిగిన అన్యాయంపై సమాచారం ఉంది. సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం. – రత్నం సంతోష్‌కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ -
మందగించిన మిర్చి కొనుగోళ్లు...
ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు సగానికిపైగా తగ్గిన రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మందగించాయి. ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మార్కెట్లకు తరలివచ్చే మిర్చి సాధారణ రోజుల కంటే సగానికి తగ్గినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5వేలకు కొనుగోలు చేస్తా మని ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేలు చేయా లని లేఖ రాయడం తెలిసిందే. దీంతో కేంద్రం ధర పెంచుతుందన్న ఆశతోనే రైతులు తమ మిర్చిని మార్కెట్‌కు తీసుకురావడంలేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు విశ్లేషి స్తున్నాయి. అంతేగాకుండా ఆయా జిల్లాల యంత్రాంగం కూడా మిర్చి అధికంగా మార్కెట్లకు రాకుండా కొంతమే రకు నియంత్రించింది. సాధారణంగా ఖమ్మం మార్కెట్‌కు రోజుకు 80వేల నుంచి లక్ష బస్తాల వరకు మిర్చి వచ్చేది. శుక్రవారం 40వేల బస్తాలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. వరంగల్ మార్కెట్‌కు 70 వేల బస్తాలొచ్చే లోడు... 22 వేల బస్తాలకు పడిపోయిం దన్నారు. దీంతో ఖమ్మం మార్కెట్లో శుక్రవారం కాస్తంత ధర పెరిగింది.