డిమాండ్‌ను బట్టి ..పుంజుకుంటున్న ధర   | Mirchi Rate Hiking | Sakshi
Sakshi News home page

డిమాండ్‌ను బట్టి ..పుంజుకుంటున్న ధర  

Published Sat, Dec 8 2018 3:11 PM | Last Updated on Sat, Dec 8 2018 3:11 PM

Mirchi Rate Hiking - Sakshi

ఖమ్మంవ్యవసాయం : పెరుగుతున్న డిమాండ్‌తో మిర్చి ధర పుంజుకుంటోంది. కొత్త మిర్చి ధర రూ.10వేల అంచుకు చేరింది. గత ఏడాది పంటకు ధర లేకపోవడంతో రైతులు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేయగా.. ప్రస్తుతం ఆ పంట రూ.11వేలు పలుకుతోంది. ఇక్కడ పండించిన ‘తేజా’ రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్‌ పెరుగుతుండడంతో ధర పెరుగుతోంది. తేజా మిర్చికి చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కూడా డిమాండ్‌ ఉంటుంది. దీనికి ఘాటు.. కారం కూడా ఎక్కువే. దీంతో ఈ మిర్చిని విదేశాల్లో వివిధ రకాలుగా వినియోగిస్తుంటారు. కొందరు వ్యాపారులు కొనుగోలు చేసి తొడిమలు తీయించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ రకం మిర్చి ఆధారంగా చైనీయులు జిల్లాలోని ముదిగొండ మండలంలో ఓ ఫ్యాక్టరీని కూడా నెలకొల్పారు. మిల్లు ద్వారా పెద్ద ఎత్తున తేజా రకం మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నాయి.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేజా రకం మిర్చిని రైతులు సాగు చేస్తున్నారు. దీనికి విదేశాల్లో డిమాండ్‌ ఉండడంతో రైతులు ఈ రకం మిర్చి సాగుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఏడాది ఈ పంటకు రైతులు ఆశించిన స్థాయిలో ధర పలకలేదు. క్వింటాల్‌కు సగటున రూ.7వేలకు మించి ధర పలకలేదు. అయినప్పటికీ రైతులు మిర్చి సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 80వేల ఎకరాల్లో పంట సాగు చేసినప్పటికీ ఆది నుంచి పంటకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఆరంభంలో అధిక వర్షాలు కురవడం ఓ ప్రతికూల అంశం కాగా.. ఆ తర్వాత అసలు వర్షాలు లేకుండా పోయాయి. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. దీనికి తోడు వాతావరణంలో వచ్చిన మార్పులతో చీడపీడలు ఆశించాయి. ప్రధానంగా జెమినీ వైరస్‌ ప్రభావం అధికంగా ఉండడంతో దిగుబడులపై ప్రభావం చూపుతోంది.

ముందుగా వేసిన మిరప తోటల నుంచి ఉత్పత్తి కొంత మేరకు వస్తోంది. తొలి దశలో వచ్చే పంట ఉత్పత్తి మైలకాయను రైతులు నిల్వ ఉంచరు. దీనిని కోసిన వెంటనే విక్రయిస్తారు. ఈ పంటకు మార్కెట్‌లో కొంత మేరకు ధర పలుకుతోంది. కాయ నాణ్యత సామాన్యంగా ఉన్నా.. ధర మాత్రం రూ.9,500 నుంచి రూ.9,800 వరకు పలుకుతోంది. ధర రూ.10వేల అంచుకు చేరడంతో రైతులు కోసిన పంటను వెంటనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. గడిచిన 10 రోజులుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్త మిర్చి విక్రయానికి వస్తోంది. ఆశించిన స్థాయిలో మిరప తోటలు లేవని గుర్తించిన వ్యాపారులు, చైనా ఫ్యాక్టరీ యాజమాన్యం మార్కెట్‌కు విక్రయానికి వచ్చే పంటకు ధర పెడుతున్నారు. తొలితీత మైలకాయకే రూ.10వేల వరకు ధర పలుకుతుండడంతో రెండోతీత కాయకు మరింత డిమాండ్‌ ఉండే అవకాశాలు ఉన్నాయని రైతులు ఎంతో ఆశగా ఉన్నాయి. గత ఏడాది రూ.7వేల నుంచి రూ.8వేల వరకు కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చికి మంచి రోజులొచ్చాయి.

ఒక దశలో ఈ మిర్చి ధర రూ.6వేల వరకు కూడా పడిపోయింది. దీంతో కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన వ్యాపారులు, çరైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం మిర్చి ధర బాగా పుంజుకుంది. క్వింటాల్‌కు ఏకంగా రూ.11వేలకు చేరింది. జిల్లాలో ఉన్న 33 కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉన్న మొత్తం బయటకు వస్తోంది. ఒక్కో కోల్డ్‌ స్టోరేజీలో కెపాసిటీనిబట్టి లక్ష క్వింటాళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఆ సరుకంతా ఇప్పుడు విక్రయిస్తున్నారు. అధిక మొత్తంలో వ్యాపారుల సరుకే ఎక్కువగా ఉంది. సరుకు నిల్వ చేసిన వ్యాపారులకు మాత్రం మంచి లాభాలు వస్తున్నాయి. అయితే కోల్డ్‌ స్టోరేజీలతోపాటు రైతులు పండించిన పంట ఒక్కసారిగా విక్రయానికి వస్తే మాత్రం ధర మందగించే ప్రమాదం కూడా లేకపోలేదని రైతు ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మిర్చి ధర కొంత మేరకు ఆశాజనకంగానే ఉందని.. మరికొంత పుంజుకుంటే ప్రస్తుత పంట పరిస్థితికి కనీసం పెట్టుబడులు పూడే అవకాశం ఉందని అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement