మింగేశారు | 50 crores scam in farmers subsidy | Sakshi
Sakshi News home page

మింగేశారు

Published Tue, Jul 29 2014 2:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

మింగేశారు - Sakshi

మింగేశారు

వ్యవసాయ యంత్రాల అమ్మకాల్లో గోల్‌మాల్
 అధికారులు, కంపెనీ డీలర్ల కుమ్మక్కు
సబ్సిడీ పేరుతో    మార్కెట్ ధరలకే రైతుకు విక్రయం
కొన్నిచోట్ల కాగితాలపైనే అమ్మకాలు.. సబ్సిడీ మొత్తం జేబుల్లోకే
గత ఏడాది పక్కదారి పట్టిన సొమ్ము రూ. 50 కోట్లు?
ఈ ఏడాది స్వాహాకు రంగం సిద్ధం
టెండర్ల దశ నుంచే అక్రమాలకు ప్రణాళికలు
 
 సాక్షి, హైదరాబాద్:అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీ పక్కదారి పడుతోంది. దీంతో వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తెచ్చి ఆధునిక సాగు పద్ధతులను రైతుల దరికి చేర్చాలన్న ప్రభుత్వ యత్నాలు నీరుగారిపోతున్నాయి. దాదాపు సగం ధరకే అందాల్సిన వ్యవసాయ పనిముట్లు అసలు గ్రామాలకే చేరడం లేదు. కానీ వాటి పేరు మీద విడుదలవుతున్న వందల కోట్ల రూపాయల సబ్సిడీ మాత్రం వ్యవసాయ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు, ప్రైవేటు కంపెనీల డీలర్ల జేబుల్లోకి వెళుతోంది. ఇక కొద్దోగొప్పో యంత్రాలను విక్రయిస్తున్నప్పటికీ వాటిని ఎక్కువ ధరకు కోట్ చేసి.. సబ్సిడీ పేరుతో మార్కెట్ ధరకే రైతుకు అంటగడుతున్నారు. రైతులు పెద్దగా కొనుగోలు చేయని భారీ స్థాయి యంత్రాల విషయంలోనే అసలు గోల్‌మాల్ చోటుచేసుకుంటోంది. వాటిని రైతులు కొన్నట్లుగా కాగితాలపై రాసి... కంపెనీ నుంచి రైతుకు సరఫరా చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు.

 

అంతేకాదు సరఫరా చేసిన వాటిలో అనేకం నాసిరకానివి కూడా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది తెలంగాణలో 60 వేల యంత్రాలను వ్యవసాయ శాఖ ద్వారా కంపెనీలు రైతులకు విక్రయించాయి. వాటికి రూ. 99 కోట్ల మేర ప్రభుత్వ సబ్సిడీ లభించింది. అయితే ఇందులో కనీసం రూ. 50 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు అంచనా. ఈ స్వాహా పర్వమంతా పక్కా ప్రణాళికతో మొదలవుతుంది.
 
 ముందుగా కంపెనీల నుంచి వ్యవసాయ శాఖ కొటేషన్లు ఆహ్వానిస్తుంది. వ్యవసాయ యంత్రాలకు ఎంతెంత కొటేషన్లు ఇవ్వాలి? ఏమేరకు సబ్సిడీ వస్తుంది? ఎంతెంత నొక్కొచ్చో అధికారులు, కంపెనీల ప్రతినిధులు కలసి కూర్చొని అంచనాలు వేసుకుంటారు. ఒకే రకపు యంత్రాలపై వివిధ కంపెనీల నుంచి కొటేషన్లు తీసుకొని వాటిలో కొన్నింటిని ఎంపికచేయాలి. అలా కాకుండా లెక్కకు మిక్కిలి కంపెనీల నుంచి సబ్సిడీపై పలు యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందాన్ని ఖరారు చేస్తారు. వ్యవసాయ శాఖ ఇలా సబ్సిడీ ఇస్తున్నట్లు తయారు చేసే యంత్రాల లిస్టే చిన్న పుస్తకంలా ఉంటుందంటే ఎన్నెన్ని కంపెనీలకు ఇలా దోచి పెడుతున్నారో అర్థమవుతుంది. ఇలా ఏ కంపెనీని వదలకుండా అన్నింటి ద్వారా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినట్లు కాగితాలు సృష్టిస్తారు. ఆయా కంపెనీలకు దోచిపెట్టడమే కాకుండా తద్వారా అధికారులూ తమ జేబులో కొంత వేసుకుంటారు.
 
 ఇవి మచ్చుకు కొన్ని...
 
 పంజాబ్‌కు చెందిన ఒక ఆగ్రో కంపెనీ నుంచి వివిధ వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు గతేడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం వరి, బహుళ పంటల కోత యంత్రం ధరను ప్రభుత్వం, కంపెనీ కలసి రూ. 20.50 లక్షలుగా నిర్ణయించాయి. అందులో రూ. 5 లక్షలను రైతులకిచ్చే సబ్సిడీగా నిర్ధారించాయి. అంటే రైతుకు రూ. 15.50 లక్షలకే ఆ యంత్రం దొరుతుందన్నమాట. అయితే అదే యంత్రం గతేడాది మార్కెట్లో రూ. 16.50 లక్షలకే అందుబాటులో ఉంది. అంటే మార్కెట్ రేటుకు, ఆ కంపెనీతో వ్యవసాయశాఖకు కుదిరిన ఒప్పందం రేటుకు తేడా రూ. 4 లక్షలు. అధిక ధర చెప్పి ఒక్కో యంత్రంపై రూ. 4 లక్షలను అటు అధికారులు, ఇటు కంపెనీ డీలర్లు నొక్కేశారు.
 
 ఇక 9 పళ్ల నాగలి(యంత్రం) ధర గతేడాది రూ. 21,730గా నిర్ధారించారు. దానికి రూ. 9 వేలను సబ్సిడీగా ప్రకటించారు. కానీ దాన్ని బహిరంగ మార్కెట్లోనే రూ. 15,500కు కంపెనీలు విక్రయించాయి. 11 పళ్ల నాగలి(యంత్రం) ధర మార్కెట్లో రూ. 22,755 ఉంటే.. దానికి ప్రభుత్వం రూ. 10 వేలు సబ్సిడీ ఇచ్చింది. అదే నాగలి బహిరంగ మార్కెట్లో రూ. 15 వేలకే దొరికింది.
 రెండు దుక్కుల నాగలి ధరను రూ. 32,288గా నిర్ధారించారు. దానికి రూ. 11 వేలు సబ్సిడీ ఇచ్చారు. అదే నాగలిని బహిరంగ మార్కెట్లో రూ. 18,500కే అమ్మారు. అంటే ఇచ్చిన సబ్సిడీ కంటే కూడా దాని ధరను ఎక్కువ చేసి రైతులకు అంటగట్టారు.
 
 రెండు పళ్ల నాగలిని రూ. 25,113గా నిర్ధారించి రూ. 8,750 సబ్సిడీగా ప్రకటించారు. కానీ అదే నాగలి మార్కెట్లో రూ. 14,520కే లభ్యమైంది. కానీ సబ్సిడీ పేరుతో రైతులకు అధిక రేటు వేసి రూ. 16,363కు అంటగట్టారు. సబ్సిడీ కాదు కదా కనీసం మార్కెట్ రేటుకు కూడా అమ్మలేదు.
 
 వరి పొలం దున్నడానికి రొటోవేటర్ యంత్రాన్ని రూ. 85 వేలుగా నిర్ధారించారు. దానికి సగం సబ్సిడీ ఇచ్చారు. అది మార్కెట్లో రూ. 60 వేలకే అందుబాటులో ఉంది. తైవాన్ స్ప్రేయర్‌ను రైతులు అధికంగా ఉపయోగిస్తుంటారు. దానికి రూ. 14 వేలుగా ధర నిర్ధారించి... 50 శాతం సబ్సిడీతో రూ. 7 వేలకు రైతులకు అంటగట్టారు. అదే స్ప్రేయర్ బయటి మార్కెట్లో రూ. 6 వేలకే అందుబాటులో ఉండటం గమనార్హం.  
 
 వరి నాటే యంత్రం (రైస్ ట్రాన్స్‌ప్లాంటర్) ధరను రూ. 17.76 లక్షలుగా నిర్ధారించారు. దానికి రూ. 8.75 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. అయితే అది మార్కెట్లో రూ. 8.75 లక్షలకే అందుబాటులో ఉంది. ఎంత లూటీ జరిగిందంటే సబ్సిడీని నొక్కేయడమే కాదు.. వాస్తవ ధరను రెండింతలు చేసి అందులోనూ నొక్కేశారు. రైతుకు యంత్రాలను అమ్మకుండానే అమ్మినట్లు కాగితాల్లో చూపెట్టారు. అంతేకాదు కొన్నిచోట్ల కంపెనీల లేబుళ్లను మార్చి నాసిరకం యంత్రాలను అంటగట్టారు. అనధికారిక సమాచారం ప్రకారం యంత్రాలపై 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనంగా రేట్లు వేశారు. సబ్సిడీ పేరుతో విక్రయించినట్లు చెబుతున్న యంత్రాల్లో దాదాపు 50 శాతం వరకు కాగితాలపై జరిగిన కొనుగోళ్లు, అమ్మకాలేనని తద్వారా మొత్తం సబ్సిడీలో సగం స్వాహా అయినట్లేనని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంతేకాదు ఒకే కంపెనీ రెండు మూడు పేర ్లతో టెండర్లలో పాల్గొని నాసిరకం యంత్రాలను కూడా అంటగట్టింది.
 
 వ్యవసాయ యంత్రాల సబ్సిడీ వ్యవహారంతో ఏటా అధికారులకు, కంపెనీ డీలర్లకు పండగే పండుగ. అసలు ఏడాదికోసారి టెండర్లు పిలవడం ఏమేరకు సమంజసం అన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా సబ్సిడీని పెద్ద ఎత్తున కాజేసేందుకు ధరలు పెంచి దోచుకునేందుకు జరుగుతున్న తంతేనన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇంకో వారం పది రోజుల్లో మార్గదర్శకాలు తయారు చేసి ధరను నిర్ణయించి సబ్సిడీని ప్రకటిస్తారు. దీన్ని స్వాహా చేసేందుకు కంపెనీలు, కొందరు అధికారులు కలసి అప్పుడే రంగం సిద్ధం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement