narsavva
-
కన్న బిడ్డలే కడతేర్చారు!
రాజంపేట: ఆస్తికోసం కన్న తండ్రినే కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులు (80)కు ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు 25 సంవత్సరాల క్రితమే మరణించాడు. మొదటి భార్య తనని సక్రమంగా చూడకపోవడంతో ఆంజనేయులు 20 సంవత్సరాల క్రితం బాలమణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులుకు నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండగా గ్రామంలో నివసిస్తున్న రెండో కూతురు లీలావతి పేరిట ఇదివరకే రెండెకరాలు పట్టా చేయించాడు. కూతురు లీలావతి, మొదటి భార్య లక్ష్మి తరచూ ఆంజనేయులుతో ఆస్తికోసం గొడవపడేవారు. మిగిలిన రెండెకరాల భూమి తనకే చెందాలని లీలావతి, ఆమె కొడుకు భానుప్రసాద్ కలసి ఆంజనేయులును వేధింపులకు గురిచేసేవారు. ఆదివారం ఉదయం లీలావతి, తన పెద్ద సోదరి లక్ష్మీ నర్సవ్వ, కొడుకు భానుప్రసాద్‌తో కలసి పథకం ప్రకారం ఆంజనేయులును ఇంట్లోనే చంపేసింది. అనంతరం తమ చెల్లెలు గంగమణి కూతురు విందు కార్యక్రమానికి హాజరై రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తిరిగివచ్చారు. తర్వాత ఆంజనేయులు ఉంటున్న ఇంటిని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, నిందితులను శిక్షించే వరకూ ఊరుకునేది లేదని రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో సీఐ తిరుపయ్య, డీఎస్పీ సురేశ్ పరిస్థితిని నియంత్రించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుని అన్న కొడుకు కొప్పుల పెద్ద స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వానరాల దాడిలో వృద్ధురాలి మృతి
రామారెడ్డి (ఎల్లారెడ్డి) : ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేయడంతో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చాతరబోయిన నర్సవ్వ (70) ఇంట్లో అన్నం గిన్నెలను శుభ్రం చేస్తుండగా.. సుమారు 20 వరకు కోతులు దాడి చేశాయి. ఆ సమయంలో ఆమె ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల మహిళలు భయంతో కోతులను తరిమే ప్రయత్నం చేయక ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నర్సవ్వ ఛాతీ, వీపు, నడుముపై కోతులు తీవ్రంగా కరిచాయి. పెళ్లికని కామారెడ్డికి ఆమె కూతురు సుగుణ 20 నిమిషాల తర్వాత వచ్చి.. తల్లిని కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సవ్వ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లుండగా, ఇద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం చిన్న కూతురితో కలిసి ఉంటోంది. నర్సవ్య అంత్యక్రియలను చిన్న కుమార్తె పూర్తి చేసింది. -
కష్టమే ఇష్టంగా.. ఓ మట్టిమనిషి
గాలికి గలగలా నవ్వుతున్నట్లు ఊగుతున్న ఆ పసుపు పంటను అలా చూస్తూ నర్సవ్వ మురిసిపోతోంది. ‘ఏందవ్వ.. అట్ల చూస్తున్నవ్’ అని అడిగితే.. ‘తొమ్మిది నెలలు కడుపుల బిడ్డను మోసినట్లే.. ఈ పంటనూ కాపాడాలే బిడ్డా..’ అని చెబుతూనే పొలంగట్టు మీద వడివడిగా ముందుకు నడుస్తోంది. పక్కన మడిలో విరిసిన గులాబీలు తల్లి తమ చెంతకు వస్తోందన్న ఆనందంతో ఆమెనే చూస్తున్నట్టు కనిపించాయి. వాటిని ఆమె చేతితో తడుముతుంటే అవి మరింత విచ్చుకున్నట్లు అనిపించాయి. వాటిని దాటుకుంటూ నల్లని భూమిలో నుంచి వెలికి వచ్చిన ఉల్లి నారు, పచ్చగా విచ్చుకున్న గోబీపువ్వు, వాసన చూడు తల్లీ.. అని పిలుస్తున్నట్లున్న పుదీనా కనిపించింది. గాలికి ఎగురుతున్న తన వెండి వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ.. కంటి అద్దాలను సరిచేసుకుంటూ.. ‘కూసో బిడ్డ..’ అని పంపుసెట్టు మూలమలుపు ఒడ్డుమీద కూర్చుంది. ‘చెప్పు బిడ్డా ఎటచ్చిండ్రు..’ అని ఆప్యాయంగా అడిగింది. ‘ఏం లేదవ్వ..’ అంటూనే ఒక్కో ప్రశ్న అడుగుతూ పోతుంటే.. గలగలా మాట్లాడుతూ.. తన కథను కళ్లకు కట్టించింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సోపతి (దోస్తానా) చేస్తున్న ఆ భూమాతకున్నంత ఓపిక నర్సవ్వలోనూ కనిపించింది. అరవైమూడేళ్లు ఉన్న ఆమెలో కష్టం తాలూకు చాయలు ఇసుమంతైనా కనిపించలేదు. ఆ మట్టిమనిషి చెప్పిన కథలో కష్టాలున్నయ్.. కన్నీళ్లున్నయ్.. కొండంత బాధ్యతలున్నయ్.. నాయకత్వ లక్షణాలున్నయ్.. ఈ తరానికి కావల్సినన్ని ఆదర్శాలూ ఉన్నయ్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల లక్ష్మీబాయి, నర్సారెడ్డికి ఇద్దరు కూతుళ్లు, నలుగురు కుమారులు. ఆరుగురిలో నర్సవ్వ పెద్దది. నర్సారెడ్డి సొంతూరు శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టులో ముంపునకు గురైన పాత బొప్పారం. ఊరు మునిగిపోతే నర్సారెడ్డి తన కుటుంబంతో సిర్గాపూర్ వచ్చాడు. ఇక్కడ భూమి కొని సాగు మొదలుపెట్టాడు. అలా తెలిసీ తెలియని వయసులో తండ్రి వెంట వచ్చిన నర్సవ్వ కష్టాలను చూస్తూ పెరిగింది. ఆ జమానాలోనే ఐదో తరగతి వరకు చదివింది. చిన్నతనంలోనే పెళ్లి ఇంటికి పెద్దదైన నర్సవ్వకు తండ్రి నర్సారెడ్డి అప్పటి ఆచారాలకు తగ్గట్లు బాల్య వివాహం చేశాడు. కొన్ని కారణాంతరాల వల్ల పెరిగి పెద్దదైనా నర్సవ్వ తన అత్తారింటికి వెళ్లలేదు. తండ్రితోనే పొలం పనులకు వెళ్లడం ప్రారంభించింది. నాన్నకు నడకగా మారింది. ఇంటికి పెద్దదిక్కుగా.. తండ్రి నర్సారెడ్డి కాలంచేయడంతో నర్సవ్వే ఇంటికి పెద్దదిక్కయ్యింది. తానే ముందుండి తమ్ముళ్లు, చెల్లెళ్లకు పెళ్లి చేసింది. శ్రీరాంసాగర్‌లో ముంపునకు గురైన పాతబొప్పారం గ్రామస్తులకు సోన్ మండలంలోని కొత్త బొప్పారంలో భూములు ఇచ్చారు. అక్కడ వచ్చిన భూమిని ఇద్దరు తమ్ముళ్లకు.. సిర్గాపూర్‌లోని భూమిని మరో ఇద్దరికి ఇచ్చింది. నర్సవ్వ కాయకష్టం చేసి సొంతంగా నాలుగున్నర ఎకరాలు కొనుక్కుని అందులోనే పంటలు పండించుకుంటూ.. ఎనభయ్యేళ్లు దాటిన తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి కొడుకు నర్సన్న బాగోగులు చూస్తోంది. పొద్దుపొడవక ముందే.. బారెడు పొద్దెక్కేదాకా లేవని ఈ జమానాలోనూ సూరీడు రాకముందే నర్సవ్వ దినచర్య ప్రారంభమవుతుంది. ముందురోజే కోసి, కట్టలు కట్టిన కూరగాయల మూటలను తానే ఆటో లేదా బస్సులో వేసుకుని ఆరుగంటలకే నిర్మల్ జిల్లాకేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు చేరుతుంది. వాటిని హోల్‌సేల్‌గా అమ్ముకుని ఎనిమిది గంటలకల్లా ఇంటికి చేరుతుంది. తొమ్మిదింటికల్లా మళ్లీ చేలోకి వెళ్తుంది. రోజంతా భూమితోనే ఆమె దోస్తానా. అక్కడి పంటలే ఆమె ఆత్మీయనేస్తాలు. ఎరువులు, మందులు, ఇతర విత్తనాలు ఇలా ఏది అవసరం పడినా తానే స్వయంగా వెళ్లి తెచ్చుకుంటుంది. సొంత బిడ్డల్లా చూసుకుంటున్నందుకేనేమో.. ఆ పంటలూ మంచి దిగుబడిని ఇస్తున్నాయి. అసలు.. నర్సవ్వ చేసే పని, ఆమె పాజిటివ్ థింకింగ్, చలాకీ మాటలు చూస్తుంటే.. ఆమె అరవయేళ్లు దాటిన అవ్వేనా.. అనిపించకమానదు. అరగంట కష్టపడకుండా.. అరక్షణమైనా ఆలోచించే తీరికలేని నేటితరం నర్సవ్వను చూసి నేర్చుకోవలసింది చాలానే ఉందనిపిస్తుంది. కష్టాన్నే నమ్ముకున్న చిన్నప్పటి నుంచి కష్టం చూసుకుంటనే పెరిగిన. నాన్నపోయిన తర్వాత ఇల్లు చూసుకుంట.. తోడబుట్టినోళ్ల పెళ్లిళ్లు చేసుకుంట వచ్చిన. నాలుగున్నర ఎకరాలను నమ్ముకుంటేనే ఇయ్యాల రోజులు గడుస్తున్నయ్. సొంతంగా ఇల్లు కట్టుకున్న. తల్లి లక్ష్మీబాయి, అల్లుడు నర్సారెడ్డిని చూసుకుంటున్న. పంట భూమి తప్ప వేరే సోపతి నాకు లేదు. – కొప్పుల నర్సవ్వ – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ ఫొటోలు: బాతూరి కైలాష్ -
అవ్వ దాచిన అపురూప చీర
చీనీ చీనాంబరాలు, పట్టు పీతాంబరాలు అనే మాట విని ఉంటాం. కానీ పీతాంబరాలను ఈ తరం చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే దాదాపు అంతరించిపోయాయి. అయితే వందేళ్ల కిందటి ఆ భారతీయ వస్త్ర కళావైభవానికి ఒక్క ఆనవాలు అయినా దొరక్కపోతుందా అనే ఆశ. దొరుకుతుందిలే అనే ఓ నమ్మకం. చివరికి ఆ నమ్మకమే గెలిచింది. తెలంగాణ జిల్లాలన్నింటినీ దుర్భిణీ వేసి గాలించగా జనగామ్‌లో దొరికిందా పీతాంబరం. ఆ పీతాంబరధారి చింతకింది నర్సవ్వ. నర్సవ్వ పుట్టింది పెరిగింది జనగామ్‌లో. అత్తగారిల్లు కూడా అదే. వాళ్లది ఒక మోస్తరు సంపన్న కుటుంబమే. నర్సవ్వకు ఎదురింట్లో ఉన్న ఉప్పలయ్యతో పెళ్లైంది. నర్సవ్వ మామగారు ఆగయ్య.. కోడలికి పెళ్లికి పీతాంబరం చీర పెట్టాడు. పట్టుదారం, వెండి జరీతో తయారు చేసిన చీర ఇది. నర్సవ్వ పెళ్లి జరిగింది 1953లో. అప్పటికి నర్సవ్వ వయసు పదకొండేళ్లు. అంటే 67 ఏళ్ల కిందటిది ఈ పీతాంబరం చీర. చీర బరువు ఎంతో తెలుసా? ఒక కిలో ఆరు వందల గ్రాములు. అప్పుడు ఈ చీర ధర నలభై రూపాయలు. చీరలో 650 గ్రాముల వెండి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజంపేట నేతకారుల నైపుణ్యానికి ప్రతీక ఈ చీర. ‘నా మామ ఆగయ్య అప్పట్లో కౌన్సిలర్, పద్మసాలి సంఘం జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో జిల్లాలో ఎక్కడ ఎలాంటి పనితనం ఉందో ఆయనకు బాగా తెలుసు. అందుకే నా పెళ్లికి అంత గొప్ప చీరను తెప్పించాడ’ని చెప్పింది నర్సవ్వ. ఉతకు లేదు.. ఇస్త్రీ లేదు పీతాంబరాన్ని ఇన్నేళ్లుగా నీటిలో ముంచలేదని చెప్పింది నర్సవ్వ. ‘‘చీర కట్టుకుని తీసిన తర్వాత ఒక రోజంతా గాలికి ఆరవేయాలి. చక్కగా చేత్తో సాపు చేసి, మెత్తటి నూలు గుడ్డలో చుట్టి పెట్టెలో పెట్టేదాన్ని. లోపల ధోవతి కట్టుకుని, పైన చీరకట్టే టోళ్లం. చీరను ఇస్త్రీ కూడా చేయలేదు. అయినా సరే ఎక్కడా ముడత పడలేదింత వరకు. నా పెద్ద కూతురు ఈ చీరిమ్మని అడిగింది. కానీ ‘నేనివ్వ’ అని చెప్పా. కావాలంటే కట్టుకోండి.. మళ్లీ తెచ్చి నా పెట్టెలో పెట్టండి. అంతే తప్ప ఎవరికీ ఇచ్చుడు లేదు. నా పానం పోయిన తర్వాత నా మీద ఈ చీరనే కప్పాలి అని గట్టిగా చెప్పాను. మా పెద్ద కోడలు ఒకసారి బతుకమ్మ ఆడడానికి ఈ చీర కట్టుకున్నది. ‘ఇంత బరువు నా వల్ల కాద’ని మళ్లీ ఆ చీరను ముట్టుకోలే. కోడళ్లు, కూతుళ్లలో ముగ్గురు కట్టిన్రు. ఇక ఇద్దరు కట్టుకోవాలె. నా కళ్ల ముందే కట్టుకుని చూపించండంటే వాళ్లకు పట్టడమే లేదు’’ అని చెప్పింది నర్సవ్వ. తెలంగాణ సంస్కృతిలో భాగం ఈ పీతాంబరం. ధర ఎక్కువ కావడంతో సంపన్న కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ చీర ప్రస్థానం పెళ్లితో మొదలై అంత్యక్రియలతో ముగుస్తుంది. అందువల్లనే ఈ చీరలు ఆనవాలుకు కూడా మిగలకుండా అంతరించి పోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఆ చీరలను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకుంది. ఆ ప్రయత్నంలో నర్సవ్వ పీతాంబరం చీర వెలుగు చూసింది. – వాకా మంజులారెడ్డి పల్లకీలో ఊరేగాను నా పెళ్లికి మా మామ పెట్టిన ఇరవై తులాల బంగారు నగలు ధరించి, ఈ పీతాంబరం చీర కట్టుకుని నా భర్తతో కలిసి పల్లకీలో ఊరేగాను. ఆ తరవాత నోములకు, బంధువుల పెళ్లిళ్లకు కట్టుకునేదాన్ని. నా ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డల (కూతుళ్లు) పెళ్లిళ్లకూ కట్టుకున్నాను. ఈ చీరతో ఎక్కడికి వెళ్లినా అందరూ చీర గురించి మాట్లాడుడే. మా ఆయనతోపాటు అన్ని వేడుకల్లోనూ దంపతుల గౌరవాన్ని అందుకున్నది ఈ చీరతోనే. ఆయన పోయి ఇరవై మూడేళ్లయింది. ఇక ఆ చీరను ముట్టనేలేదు. ఇప్పుడు మళ్లీ సర్కారోళ్లు వచ్చి ఇలాంటి పీతాంబరాల్ని మళ్లీ నేయిస్తామని చీరను ఓసారి నాకు కట్టబెట్టి, పట్టుకెళ్లారు. కేసీఆరు, కేటీఆరు గిట్లంటి వాటిని చేయించమని పట్టుపడుతున్నరంట. – నర్సవ్వ ఈ సంస్కృతి తమిళనాడులోనూ ఉంది సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లోని నేతకారులు వెండిజరీ చీరలను ఎక్కువగా నేసేవారు. అవి బనాసర్ చీరల్లాగ ఉంటాయి. ముదురు గులాబీరంగులోనే నేసేవారు. సుమంగళిగా పోయినప్పుడు ఆ మహిళకు అంతిమ సంస్కారాలను కూడా ఆ చీరతోనే నిర్వహించేవారు. ఈ సంస్కృతి ఉత్తర తెలంగాణతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. అక్కడ కూడా ఇదే రంగు చీరను తొమ్మిది గజాల్లో నేస్తారు. ఇక్కడ ఉన్నట్లే తమిళనాడులో కూడా పెళ్లి చీరతోనే కర్మకాండలు నిర్వహించే ఆచారం ఉంది. మేమిప్పుడు పీతాంబరం చీరతోపాటు హిమ్రూ వస్త్రాలను పునరుద్ధరించడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాం. హిమ్రూ వస్త్రాలు రెండు వైపులా ఒకే రకంగా ఉంటాయి. వీటి నేతకు ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. వస్త్రాలను నిజాం కాలంలో రాజులు, రాజ కుటుంబీకులు ధరించేవారు. ఔరంగాబాద్‌లో నేసేవారు. మన దగ్గర వరంగల్‌లో కార్పెట్ తయారీదారులకు ఈ హిమ్రూ నేతలో శిక్షణనిప్పిస్తున్నాం. ఇక హిమ్రూ వస్త్రాలను మన దగ్గరే తయారు చేయిస్తాం. – శైలజా రామయ్యర్, ఐఏఎస్, డైరెక్టర్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అండ్ అపారెల్ ఎక్స్పోర్ట్ పార్క్స్ (ఎఫ్ఏసీ) -
అత్తను చంపిన అల్లుడు
పెగడపల్లి: భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడే అత్తను చంపిన సంఘటన పెగడపల్లి మండలం లింగాపూర్‌లో ఆదివారం జరిగింది. లింగాపూర్‌కు చెందిన శనగరపు నర్సవ్వ(70) అల్లుడు దుంపటి కొమురయ్య తన భార్య గంగవ్వను కాపురానికి పంపడం లేదని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్ తెలిపిన వివరాలు. నర్సవ్వ భర్త మల్లయ్య చనిపోయాడు. తన కూతురు గంగవ్వ వివాహం మండలంలోని సుద్దపల్లికి చెందిన దుంపటి కొమురయ్యతో 25 ఏళ్ల క్రితం జరిపించింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. కొమురయ్య భార్య గంగవ్వ, కూతుళ్లను వేధిస్తుండడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టుకుని పదేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో తిరిగి ఐదేళ్ల క్రితం భార్యభర్తలు కలిసి ఉంటూ వారి కూతుళ్లకు వివాహాలు కూడా చేశారు. కొంతకాలంగా గంగవ్వను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిగారి ఊరు లింగాపూర్‌కు వచ్చి తల్లి నర్సవ్వతో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన కొమురయ్య తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉన్నాడు. భార్యను కాపురానికి పంపకుంటే చంపుతానని బెదిరించేవాడు. ప్రాణభయం ఉందనే భయంతో గంగవ్వ బంధువుల ఇంట్లో నిద్రిస్తుంది. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి వచ్చిన కొమురయ్య నిద్రిస్తున్న అత్త నర్సవ్వ తలపై రోకలిబండతో బాది హత్య చేశాడు. హత్యా జరిగిన ప్రదేశాన్ని జగిత్యాల డీఎస్పీ భధ్రయ్య సందర్శించి, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు జరిపించారు. మృతురాలి కూతురు గంగవ్వ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేందర్ తెలిపారు. పెగడపల్లి ఎస్సై జీవన్ ఉన్నారు. -
తల్లిని చంపిన తనయుడు
కరీంనగర్: బీర్పూర్ మండలం రేకులపల్లిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సవ్వను ఆమె కుమారుడు రాజలింగం హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సవ్వ నాలుగో కుమారుడు రాజలింగం ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. కొంత కాలంగా ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉండకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని కుమారుడికి నర్సవ్వ అనడంతో ఆగ్రహం తెచ్చుకున్న రాజలింగం తన తల్లిని బండరాయికేసి మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి నర్సవ్వ(80) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రాజలింగాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.