రాజంపేట: ఆస్తికోసం కన్న తండ్రినే కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులు (80)కు ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు 25 సంవత్సరాల క్రితమే మరణించాడు. మొదటి భార్య తనని సక్రమంగా చూడకపోవడంతో ఆంజనేయులు 20 సంవత్సరాల క్రితం బాలమణిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆంజనేయులుకు నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండగా గ్రామంలో నివసిస్తున్న రెండో కూతురు లీలావతి పేరిట ఇదివరకే రెండెకరాలు పట్టా చేయించాడు. కూతురు లీలావతి, మొదటి భార్య లక్ష్మి తరచూ ఆంజనేయులుతో ఆస్తికోసం గొడవపడేవారు. మిగిలిన రెండెకరాల భూమి తనకే చెందాలని లీలావతి, ఆమె కొడుకు భానుప్రసాద్ కలసి ఆంజనేయులును వేధింపులకు గురిచేసేవారు.
ఆదివారం ఉదయం లీలావతి, తన పెద్ద సోదరి లక్ష్మీ నర్సవ్వ, కొడుకు భానుప్రసాద్‌తో కలసి పథకం ప్రకారం ఆంజనేయులును ఇంట్లోనే చంపేసింది. అనంతరం తమ చెల్లెలు గంగమణి కూతురు విందు కార్యక్రమానికి హాజరై రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తిరిగివచ్చారు. తర్వాత ఆంజనేయులు ఉంటున్న ఇంటిని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు.
సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, నిందితులను శిక్షించే వరకూ ఊరుకునేది లేదని రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో సీఐ తిరుపయ్య, డీఎస్పీ సురేశ్ పరిస్థితిని నియంత్రించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుని అన్న కొడుకు కొప్పుల పెద్ద స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment