bhanuprasad
-
కన్న బిడ్డలే కడతేర్చారు!
రాజంపేట: ఆస్తికోసం కన్న తండ్రినే కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులు (80)కు ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు 25 సంవత్సరాల క్రితమే మరణించాడు. మొదటి భార్య తనని సక్రమంగా చూడకపోవడంతో ఆంజనేయులు 20 సంవత్సరాల క్రితం బాలమణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులుకు నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండగా గ్రామంలో నివసిస్తున్న రెండో కూతురు లీలావతి పేరిట ఇదివరకే రెండెకరాలు పట్టా చేయించాడు. కూతురు లీలావతి, మొదటి భార్య లక్ష్మి తరచూ ఆంజనేయులుతో ఆస్తికోసం గొడవపడేవారు. మిగిలిన రెండెకరాల భూమి తనకే చెందాలని లీలావతి, ఆమె కొడుకు భానుప్రసాద్ కలసి ఆంజనేయులును వేధింపులకు గురిచేసేవారు. ఆదివారం ఉదయం లీలావతి, తన పెద్ద సోదరి లక్ష్మీ నర్సవ్వ, కొడుకు భానుప్రసాద్‌తో కలసి పథకం ప్రకారం ఆంజనేయులును ఇంట్లోనే చంపేసింది. అనంతరం తమ చెల్లెలు గంగమణి కూతురు విందు కార్యక్రమానికి హాజరై రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తిరిగివచ్చారు. తర్వాత ఆంజనేయులు ఉంటున్న ఇంటిని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, నిందితులను శిక్షించే వరకూ ఊరుకునేది లేదని రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో సీఐ తిరుపయ్య, డీఎస్పీ సురేశ్ పరిస్థితిని నియంత్రించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుని అన్న కొడుకు కొప్పుల పెద్ద స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడారు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ఏదో ఉద్ధరించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తే జనాలు బీజేపీని నమ్మేవారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఇప్పుడున్న 5 స్థానాలు గెలిస్తే చాలు’అని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తానిపర్తి భానుప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. అప్పుడప్పుడు అమిత్ షా రాష్ట్రానికి వస్తే తప్ప ఇక్కడ బీజేపీ ఉందని తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ ఎలా ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. మరోవైపు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఎన్నికల భయం పట్టుకుందని, ఎన్నికల తర్వాత ఆయన గడ్డం పెంచి హిమాలయాలకు పోవాల్సిందేనన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర ఉత్తమ్ మోకరిల్లుతున్నారని, రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల్లో వాటాలు అడగమని బాబుతో హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలే సెటిలర్లలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారికి భరోసా ఇవ్వడానికే మంత్రి కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
పాపం పసివాడు..!
పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కొడుకు పుట్టాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు ఆరోగ్యం కోసం మొక్కని దేవుడంటూ లేడు. చిన్న వయస్సులో బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కన్నవాళ్లు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కూలీ చేసుకుంటేనే నాలుగేళ్లు నోట్లోకి వెళ్లే దుస్థితి వారిది. కొడుకు ఆరోగ్యం కోసం ఇప్పటికే లక్షలాది రూపాయల అప్పులు చేసి సహాయం కోసం పేద దంపతులు ఎదురు చూస్తున్నారు. జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాగం బాల్‌రాజు, రమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు భానుప్రసాద్ గ్రామంలోనే 4వ తరగతి, కూతురు నందిని 1వ రతగతి చదువుతుంది. చిన్న కూతురు ఇంటి దగ్గరనే ఉంటోంది. వీరికి గల ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులు నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బతుకుబండి సాఫీగా కొనసాగుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కొడుకు ఉన్నట్టుండి అనారోగ్యంబారిన పడ్డాడు. తల్లిదండ్రులు కొడుకు భానుప్రసాద్‌కు హైదరాబాద్‌లోని లోటస్ ప్రైవేట్ దవాఖానలో ఇటీవల వైద్య పరీక్షలు చేయించారు. బాబుకు బ్రెయిన్‌ట్యూమర్ ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే వైద్యుల సూచనల మేరకు సికిందరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోని వైద్యం కోసం వెళ్లారు. బాబుకు వైద్యం పరీక్షలు నిర్వహించిన అనంతరం సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు చెప్పారు. వెంటనే తల్లిదండ్రులు కొంత డబ్బు చెల్లించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. మా బాబుకు ప్రాణం పోయండి.. మా బాబు భానుప్రసాద్‌కు ప్రాణభిక్ష పెట్టండి... అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమకు ఎకరం భూమి మాత్రమే ఉందని, బాబు వైద్యం కోసం ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించాం. గ్రామంలోనే తెలిసివాళ్ల దగ్గర అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాం. ఇంకా ఐదారు లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు. సహాయం అందించి బాబుకు ప్రాణభిక్ష పెట్టండి.. అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
చిన్నమండ్యం: వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. భానుప్రసాద్, వెంకటేశ్, అశోక్ అనే ముగ్గురు విద్యార్థులు చిన్నమండ్యం నుంచి ద్విచక్రవాహనంలో రాయచోటి వైపు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ సంఘటనలో భానుప్రసాద్, వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు ముగ్గురు అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నారు. వినాయకచవితి పండుగకు ఇంటికి వచ్చిన తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భానుప్రసాద్ చిన్నమండెం మండలం పడమటికోన గ్రామానికి చెందినవాడు కాగా వెంకటేశ్ గాలివీడు మండలం గుంటిమడుగు గ్రామానికి చెందినవారు. -
‘మహా’ ఒప్పందం చరిత్రాత్మకం
సుల్తానాబాద్ : రాష్ట్రంలో నిర్మించనున్న ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరాలు రాకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేయించడం సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అవగాహనలేక మాట్లాడుతున్నాయని, రైతులు, ప్రజల అవసరాలు తెలియడం లేదని తెలిపారు. జిల్లాల పెంపు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల నిర్ణయాన్ని విపక్షాలు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందిస్తున్నాయని గుర్తుచేశారు. జిల్లాల ఏర్పాటుతో ఆర్థికంగా, రాజకీయంగా పరిపాలన సులభమవుతుందన్నారు. రామగుండం జిల్లాకు ప్రతిపాదన చేయగా.. వ్యతిరేకించడంతోనే పెద్దపల్లిని జిల్లాగా సీఎం కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటుతో సింగరేణి, ఎఫ్‌సీఐ, ఎన్టీపీసీ, సిమెంట్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతోపాటు వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందని వివరించారు. సమావేశంలో సర్పంచ్ కొంజర్ల వెంకన్న, నాయకులు కాంపెల్లి నారాయణ, సర్వర్, పల్లా సురేష్, జూపల్లి రాజేశ్వర్‌రావు, ఫకీర్ యాదవ్, కోడం అజయ్, పర్శరాములు గౌడ్, రాజయ్య యాదవ్ సహపలువురు ఉన్నారు. రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జూలపల్లి : కాళేశ్వరం వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంపై టీఆర్ఎస్ నేత రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. మండలకేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం జూలపల్లి నుంచి కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మిత స్థలం వరకు చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. జూలపల్లి, ఎలిగేడ్, మంథని మండలాలు, మంథని నియోజకవర్గం నుంచి 2వేల మంది రైతులతో వెళ్లి మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. -
ర్యాగింగా? బెట్టింగా?
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య వలిగొండ: ఓ పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గోకారంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలకూర్ల భాస్కర్ కుమారుడు భానుప్రసాద్ (17) అబ్దుల్లాపూర్‌మెట్టు సమీపంలోని అర్జున్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన అతని సోదరుడు 108కు సమాచారం ఇవ్వగా.. పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే, భానుప్రసాద్ మృతికి ర్యాగింగా, లేక క్రికెట్ బెట్టింగ్ కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ కుమారుడిని అతడి స్నేహితులు మారుతి, కార్తీక్, మరికొందరు బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భానుప్రసాద్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
'ఆంధ్రజ్యోతి పేపర్ మమ్మల్ని కించపరిచింది'
హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రిక తమను కించపరిచిందని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భానుప్రసాద్ ఆరోపించారు. అమరులకు అన్యాయం చేస్తూ తమ జీతాలు పెంచారంటా తప్పుడు వార్త ప్రచురించిందని వారు శనివారమిక్కడ అన్నారు. ఎమ్మెల్సీలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. కాగా తనకు నోటీసు అందిన తర్వాత పరిశీస్తానని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు.