‘మహా’ ఒప్పందం చరిత్రాత్మకం
Published Tue, Aug 23 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
సుల్తానాబాద్ : రాష్ట్రంలో నిర్మించనున్న ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరాలు రాకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేయించడం సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అవగాహనలేక మాట్లాడుతున్నాయని, రైతులు, ప్రజల అవసరాలు తెలియడం లేదని తెలిపారు. జిల్లాల పెంపు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల నిర్ణయాన్ని విపక్షాలు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందిస్తున్నాయని గుర్తుచేశారు. జిల్లాల ఏర్పాటుతో ఆర్థికంగా, రాజకీయంగా పరిపాలన సులభమవుతుందన్నారు. రామగుండం జిల్లాకు ప్రతిపాదన చేయగా.. వ్యతిరేకించడంతోనే పెద్దపల్లిని జిల్లాగా సీఎం కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటుతో సింగరేణి, ఎఫ్‌సీఐ, ఎన్‌టీపీసీ, సిమెంట్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలతోపాటు వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందని వివరించారు. సమావేశంలో సర్పంచ్ కొంజర్ల వెంకన్న, నాయకులు కాంపెల్లి నారాయణ, సర్వర్, పల్లా సురేష్, జూపల్లి రాజేశ్వర్‌రావు, ఫకీర్ యాదవ్, కోడం అజయ్, పర్శరాములు గౌడ్, రాజయ్య యాదవ్ సహపలువురు ఉన్నారు.
రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
జూలపల్లి : కాళేశ్వరం వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంపై టీఆర్‌ఎస్ నేత రఘువీర్‌సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. మండలకేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం జూలపల్లి నుంచి కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మిత స్థలం వరకు చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. జూలపల్లి, ఎలిగేడ్, మంథని మండలాలు, మంథని నియోజకవర్గం నుంచి 2వేల మంది రైతులతో వెళ్లి మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
Advertisement