Lilavati
-
మాచర్లలో వీధి నాటకాలు!
సాక్షి, నరసరావుపేట/మాచర్ల: వీధి గొడవలకు రాజకీయ రంగు పులిమి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల ద్వారా తాపీగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.కారంపూడిలో ఘర్షణలు జరిగిన వారం తరువాత పిన్నెల్లి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడం తెలిసిందే. పాల్వాయి గేట్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడి చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేయగా తనను చంపుతానని పిన్నెల్లి బెదిరించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. ఇవి చాలవన్నట్లు కండ్లకుంటకు చెందిన టీడీపీ ఏజెంట్‌తో పిన్నెల్లి సోదరులపై మంగళగిరి పోలీసుస్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. మద్యం మత్తులో దాడి.. మాచర్ల 22వ వార్డులో శనివారం రాత్రి మల్లె లీలావతి అనే మహిళపై అదే వీధికి చెందిన ఉప్పుతోళ్ల వెంకటేశ్ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలున్నాయి. ఎల్లో మీడియా దీనికి రాజకీయ రంగు పులిమింది. బాధిత మహిళ టీడీపీకి ఓటు వేయడమే ఈ ఘర్షణకు కారణమంటూ కథనాలు అల్లేసింది. పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో దాడులు జరిగినట్లు తప్పుడు కథనాలు వెలువరించింది. పార్టీలకు సంబంధం లేదు.. నాపై జరిగిన దాడితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఓ పార్టీకి ఓటు వేయడంతో దాడి చేశారంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదు. నన్ను ఏ మీడియా వాళ్లు వివరణ అడగలేదు. ఇష్టానుసారంగా వార్తలు రాయడం బాగాలేదు. మమ్మల్ని పార్టీల గొడవల్లోకి లాగొద్దు. మద్యం సేవించి నాపై దాడి చేస్తే పార్టీలకు అంటగట్టడం సరికాదు. నాపై దాడికి పాల్పడిన వెంకటేష్ పై పోలీసులు చర్య తీసుకోవాలి. లీలావతి, బాధిత మహిళ, మాచర్ల -
కన్న బిడ్డలే కడతేర్చారు!
రాజంపేట: ఆస్తికోసం కన్న తండ్రినే కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులు (80)కు ఇద్దరు భార్యలు ఉండగా, మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు 25 సంవత్సరాల క్రితమే మరణించాడు. మొదటి భార్య తనని సక్రమంగా చూడకపోవడంతో ఆంజనేయులు 20 సంవత్సరాల క్రితం బాలమణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులుకు నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండగా గ్రామంలో నివసిస్తున్న రెండో కూతురు లీలావతి పేరిట ఇదివరకే రెండెకరాలు పట్టా చేయించాడు. కూతురు లీలావతి, మొదటి భార్య లక్ష్మి తరచూ ఆంజనేయులుతో ఆస్తికోసం గొడవపడేవారు. మిగిలిన రెండెకరాల భూమి తనకే చెందాలని లీలావతి, ఆమె కొడుకు భానుప్రసాద్ కలసి ఆంజనేయులును వేధింపులకు గురిచేసేవారు. ఆదివారం ఉదయం లీలావతి, తన పెద్ద సోదరి లక్ష్మీ నర్సవ్వ, కొడుకు భానుప్రసాద్‌తో కలసి పథకం ప్రకారం ఆంజనేయులును ఇంట్లోనే చంపేసింది. అనంతరం తమ చెల్లెలు గంగమణి కూతురు విందు కార్యక్రమానికి హాజరై రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తిరిగివచ్చారు. తర్వాత ఆంజనేయులు ఉంటున్న ఇంటిని తగులబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, నిందితులను శిక్షించే వరకూ ఊరుకునేది లేదని రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో సీఐ తిరుపయ్య, డీఎస్పీ సురేశ్ పరిస్థితిని నియంత్రించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుని అన్న కొడుకు కొప్పుల పెద్ద స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రతిభా మూర్తులకు పది విశ్వపీఠాలు
మహిళాభ్యుదయం అంటే... అవనిలో సగం – ఆకాశంలో సగం, నేల నీదే – నింగీ నీదే... అని స్ఫూర్తి పొందడం ఒక్కటే కాదు. సామాజిక చైతన్యంలో మహిళ సేవను గుర్తు చేసుకోవడం. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళ పాత్రను గుర్తెరగడం. మహిళ మేధను, నిష్ణాతను, నైపుణ్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియచేయడం. కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ఉద్దేశం కూడా ఇదే. ప్రాచీన, ఆధునిక సమాజంలో సామాజిక వివక్షకు ఎదురొడ్డి మరీ సమాజాన్ని చైతన్యవంతం చేసి, తమ పాదముద్రలతో తర్వాతి తరాలకు మార్గదర్శనం చేసిన మహిళల గుర్తుగా యూనివర్సిటీలలో పది పీఠాలను (అకడమిక్ చెయిర్) ఏర్పాటు చేయనుంది. ఆ పీఠాలను ‘అలంకరించనున్న’ మహిళామూర్తుల వివరాలివి. లల్లేశ్వరి క్రీ.శ 14వ శతాబ్దంలో కశ్మీర్లో మహిళాభ్యుదయం కోసం అక్షర పోరాటం చేసిన మహిళ. కశ్మీర్ సాహిత్యంలో ఆమెది ప్రత్యేకస్థానం. స్త్రీకి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు చదువుతోనే సాధ్యమవుతాయన్నారు. స్త్రీకి చదువుకునే సౌకర్యం కల్పించే ఉదారవాద సమాజస్థాపన ఆమె ఆకాంక్ష. న్యూఢిల్లీలో 2000లో ఆమె రచనల మీద జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. ‘రిమెంబరింగ్ లాల్ దేద్ ఇన్ మోడరన్ టైమ్స్’ పుస్తకం కూడా ఆవిష్కృతమైంది. లీలావతి గణితశాస్త్రవేత్త. క్రీ.శ. 16వ శతాబ్దం నాటి ప్రముఖ గణితశాస్త్రవేత్త రెండవ భాస్కరుని కుమార్తె. గణితంలో ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే నోటి లెక్కగా చెప్పేదని నాటి గ్రంథాల్లో ఉంది. భాస్కరుడు తాను రాసిన గణితశాస్త్ర గ్రంథానికి కూడా ‘లీలావతి’ అనే పేరు పెట్టాడు. అహల్యాబాయ్ హోల్కర్ స్వస్థలం మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌కు సమీపంలోని చొండి గ్రామం. ఆడవాళ్లు ఇల్లు దాటి బయట అడుగుపెట్టడానికి సమాజం అంగీకరించని 18వ శతాబ్దంలో ఆమె ఇంట్లోనే చదవడం, రాయడం నేర్చుకున్నారు. అహల్యాబాయ్ భర్త మాల్వా రాజు ఖండేరావ్ హోల్కర్ కుంభేర్ యుద్ధంలో మరణించాడు. భర్త మరణించిన సమయంలో ఆమె సతిని పాటించాలా వద్దా అనే మీమాంస తలెత్తింది. రాజ్య నిర్వహణ బాధ్యత చేపట్టగలిగిన మహిళ తనను తాను సబలగా నిరూపించుకోవాలి తప్ప అబలగా అగ్నికి ఆహుతి కాకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పటినుంచి ఆమె మామ మల్హర్‌రావ్ ఆమెను రాజ్యపాలనలో నిష్ణాతురాలిని చేశారు. మల్హర్ రావ్ హోల్కర్ మరణించినప్పటి నుంచి అహల్యాబాయ్ పూర్తిస్థాయిలో రాజ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. రాజధానిని మాల్వా నుంచి మహేశ్వర్‌కు మార్చడం వంటి నిర్ణయాలతో పరిపాలనలో అనేక స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నారామె. అమృతాదేవి బెనివాల్ (బిష్ణోయి) చెట్లను కాపాడేందుకు ప్రాణాలు వదిలిన త్యాగశీల పర్యావరణవేత్త అమృతాదేవి. రాజస్థాన్, జో«ద్‌పూర్‌లోని ఖేజార్లి గ్రామంలో పుట్టిన అమృతాదేవి ఖేజ్రీ చెట్ల పరిరక్షణ కోసం పోరాడిన మహిళ. క్రీ.శ 1730లో భవననిర్మాణానికి అవసరమైన కలప కోసం రాజోద్యోగులు ఖేజార్లి గ్రామం సమీపంలోని అడవులకు వచ్చారు. చెట్లను ప్రేమించే బిష్ణోయి తెగ వాళ్లు కలప కోసం ఎండిన కొమ్మలను మాత్రమే ఉపయోగిస్తారు తప్ప చెట్లను నరకరు. సాటి బిష్ణోయి తెగకు చెందిన మహిళలను కూడగట్టి.. చెట్లను నరకడానికి వచ్చిన రాజు మనుషులను అడ్డుకుంది అమృతాదేవి. ఆ ఘర్షణలో ముగ్గురు కూతుళ్లతోపాటు అమృతాదేవి, మరో మూడు వందలకు పైగా బిష్ణోయి మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అనందీబాయ్ జోషి మనదేశంలో తొలి లేడీడాక్టర్. పద్నాలుగేళ్లకే బిడ్డకు తల్లయ్యారు ఆనందీబాయ్. కానీ ఆ బిడ్డ సరైన వైద్యం అందని కారణంగా పది రోజులకే మరణించడంతో ఆమె దృష్టి వైద్యరంగం మీదకు మళ్లింది. సంస్కృతం, ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా, పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజ్‌లో వైద్యశాస్త్రాన్ని చదివారామె. ఇండియాకి తిరిగి వచ్చి కొల్హాపూర్‌లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో వైద్యసేవలందించారు. హన్షా మెహతా సూరత్‌లో పుట్టిన హన్షామెహతా గుజరాతీ భాషలో తొలి నవల రాసిన రచయిత. ఆమె విద్యావంతురాలు, సంఘసంస్కర్త, సామాజిక కార్యకర్త, స్వతంత్ర భావాలు కలిగిన మహిళ. ఆమె తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసి ఇంగ్లండ్‌లో జర్నలిజం, సోషియాలజీ చదివారు. మహాదేవి వర్మ ఆమె ఉన్నత విద్యావంతురాలు, ప్రముఖ హిందీ కవయిత్రి. ఛాయావాద సాహిత్య ఉద్యమంలో ఆమె తన భావాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో కీలకంగా సేవలందించారు. అలహాబాద్‌లోని ‘ప్రయాగ మహిళా విద్యాపీuŠ‡’కు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించారామె. రాణి గైదిన్లియు మణిపూర్‌కు చెందిన రాణి గైదిన్లియుకి 78 ఏళ్లు. ఆమె ఆధ్యాత్మిక, రాజకీయ నాయిక. బ్రిటిష్ పాలను వ్యతిరేకంగా గళమెత్తిన ధీర. పదమూడేళ్ల వయసులోనే హరక్కా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మణిపూర్ నుంచి బ్రిటిష్ వారిని తరిమివేయడానికి ఉద్యమించారు. పదహారేళ్ల వయసులో బ్రిటిష్ పాలకుల చేతిలో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపారామె. జవహర్లాల్ నెహ్రూ ఆమెకు రాణి అని ప్రశంసించారు. ఆ తర్వాత ఆమె పేరులో రాణి అనే మకుటం చేరింది. జాతీయోద్యమ నాయకురాలిగా ఆమె సేవలకు భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. – మంజీర ఎం.ఎస్ సుబ్బులక్ష్మి ఎం.ఎస్. పేరుతోపాటు గుర్తుకు వచ్చే పాట ‘రఘుపతి రాఘవ రాజారామ్’. గాంధీజీకి ఇష్టమైన పాట. తమిళనాడు, మధురైలో పుట్టిన సుబ్బులక్ష్మి కర్నాటక సంగీతంతో నిష్ణాతురాలు. భారతరత్న పురస్కారం, రామన్ మెగసెసె అవార్డు అందుకున్న తొలి సంగీతకారిణి ఆమె. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సంగీతాలాపన చేసిన తొలి భారతీయురాలు కూడా. పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ఆమె పేరులోని ఎం.ఎస్ అంటే మధురై షణ్ముఖవాడివు. కమలా సోహోనీ మధ్యప్రదేశ్, ఇందోర్‌కు చెందిన కమలా సోహోనీ సైన్స్ రంగంలో పీహెచ్డీ అందుకున్న తొలి భారతీయ మహిళ. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఆమె పరిశోధనలు చేశారు. అంతేకాదు, ఆమె ఆ సంస్థలో మహిళల ప్రవేశానికి మార్గం సుగమం చేసిన మహిళ కూడా. వరి, పప్పుధాన్యాలలో ఉండే పోషకాలు, విటమిన్ల గురించి పరిశోధించారు. తాటి చెట్టు నుంచి స్రవించే ద్రవం ‘నీరా’లో ఉండేæ పోషకాలు– వాటి ప్రయోజనాల మీద చేసిన పరిశోధనకు ఆమె రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ►పై ఐదుగురు (ఎడమ నుంచి కుడికి) ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, కమలా సొహోనీ, దేవీ అహల్యాబాయ్ హోల్కర్, రాణీ గైడిన్లీ, హన్సా మెహ్తా ►కింది ఐదుగురు (పై నుంచి సవ్యదిశలో) లీలావతి, లల్లేశ్వరి, అమృతాదేవి బెనీవాల్, మహదేవీ వర్మ, ఆనందీబాయ్ గోపాల్రావ్ -
ప్రియుడితో కలిసి భర్త హత్య
నిజామాబాద్ రూరల్ (నిజామాబాద్ అర్బన్): వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో కలిసి భార్య, భర్త ను దారుణంగా చంపిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తానాఖూర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన గీత కార్మికుడైన వెల్పూర్ సాయిలు (38) హత్యకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన సాయిలు స్వగ్రామానికి వచ్చి పదిరోజులైంది. భర్త విదేశాలకు వెళ్లడంతో సాయిలు భార్య నీలావతి అలియాస్ లీలా గ్రామానికి చెందిన తిరుపతి రమేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధం విషయంలో లీలావతి, సాయిలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పథకం ప్రకారం సోమవారం రాత్రి తిరుపతి రమేశ్, లీలావతి కలిసి సాయిలును ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశారు. మంచంపై పడుకోబెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. బయట నుంచి ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఉదయం ఇంట్లో నుంచి మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక దళ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి మంటలు ఆర్పారు. అప్పటికే మంచంతో పాటు సాయిలు మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో వస్తువులు, దుస్తులు బూడిదయ్యాయి. హతుడికి 6వ, 7వ తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సతీశ్ సందర్శించారు. నిందితులు ఇరువురు పరారీలో ఉన్నారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తొండూరు మండలం పేలూరు, తుమ్మలపల్లి గ్రామాల సమీపంలోని పొలాల్లో పురుగుల ముందు సేవించి అపస్మారక స్థితిలో ఉన్న యువతీ, యువకుడ్ని ఆదివారం స్థానికులు గుర్తించి పులివెందుల ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం వారిని కడప జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. తొండూరు మండలం పేలూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పుల్లాయప్ప (25), తుమ్మలపల్లి గ్రామానికి చెందిన లీలావతి (23)గా వారిని గుర్తించారు. -
సీలెంబుకు పెళ్లి!
తపాలా నేను జిల్లా పరిషత్ హైస్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాణ్ని. నాకు నలుగురు అమ్మాయిలు. నాలుగో అమ్మాయి పేరు లీలావతి. ఆమెను మేం ‘లీలూ’ అని ముద్దుగా పిలుచుకునేవాళ్లం. వచ్చీరాని మాటలతో మమ్మల్ని ఆనంద డోలికల్లో ఊగిస్తూ ఉండేది లీలూ. ఒకరోజు పెండ్లిపిలుపుకని కొందరు పేరంటాళ్లు మా ఇంటికొచ్చారు. వాళ్లు మాకు దగ్గర బంధువులు కాబట్టి, మా వాళ్లు, వాళ్లు బాతాఖానీకి దిగారు. ‘అమ్మాయ్ లీలూ! ఆ చెంబు తీసుకొనిరామ్మా’ అంది మా ఆవిడ. ‘ఇదో మమ్మీ సీలెంబు’ అంది లీలూ. ‘స్టీలు చెంబును సీలెంబుగా పలుకుంది లీలూ’ అని పేరంటాళ్లు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. లీలూ నోట మరిన్ని ముద్దుమాటలు వినాలని, ‘అమ్మా లీలూ పొద్దున ఏం టిఫిన్ తిన్నావు’ అంది ఒకావిడ. ‘ఇగ్లీ సాంబ’ అంది లీలూ. ఇడ్లీని ఇగ్లీగాను, సాంబారును సాంబగా పలుకుతుంది లీలూ అని దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడారు వాళ్లు. లీలూ యుక్త వయసుకు వచ్చాక పెళ్లి కుదిరింది. పెళ్లి ముందురోజు లీలూకు నలుగు పెట్టేందుకు పేరంటాళ్లొచ్చారు. వాళ్లల్లో ఒకావిడ సీలెంబుకు పెళ్లా అంది. ఆమె ఎవరో కాదు, లీలూ చిన్నతనంలో పెండ్లిపిలుపుకని మా ఇంటికొచ్చిన పేరంటాళ్లలో ఒకరు. సీలెంబుకు పెళ్లా అంటే అర్థంకాక, ఆశ్చర్యంగా చూశారు. లీలూ చిన్నతనంలో ముద్దుమాటల గురించి విన్న తర్వాత పేరంటాళ్లు నవ్వుల నలుగు పెట్టారు లీలూకు. - కె.రంగనాథం హరనాథపురం, నెల్లూరు