తపాలా
నేను జిల్లా పరిషత్ హైస్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తూ ఉండేవాణ్ని. నాకు నలుగురు అమ్మాయిలు. నాలుగో అమ్మాయి పేరు లీలావతి. ఆమెను మేం ‘లీలూ’ అని ముద్దుగా పిలుచుకునేవాళ్లం. వచ్చీరాని మాటలతో మమ్మల్ని ఆనంద డోలికల్లో ఊగిస్తూ ఉండేది లీలూ.
ఒకరోజు పెండ్లిపిలుపుకని కొందరు పేరంటాళ్లు మా ఇంటికొచ్చారు. వాళ్లు మాకు దగ్గర బంధువులు కాబట్టి, మా వాళ్లు, వాళ్లు బాతాఖానీకి దిగారు.
‘అమ్మాయ్ లీలూ! ఆ చెంబు తీసుకొనిరామ్మా’ అంది మా ఆవిడ.
‘ఇదో మమ్మీ సీలెంబు’ అంది లీలూ. ‘స్టీలు చెంబును సీలెంబుగా పలుకుంది లీలూ’ అని పేరంటాళ్లు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. లీలూ నోట మరిన్ని ముద్దుమాటలు వినాలని, ‘అమ్మా లీలూ పొద్దున ఏం టిఫిన్ తిన్నావు’ అంది ఒకావిడ.
‘ఇగ్లీ సాంబ’ అంది లీలూ. ఇడ్లీని ఇగ్లీగాను, సాంబారును సాంబగా పలుకుతుంది లీలూ అని దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడారు వాళ్లు.
లీలూ యుక్త వయసుకు వచ్చాక పెళ్లి కుదిరింది. పెళ్లి ముందురోజు లీలూకు నలుగు పెట్టేందుకు పేరంటాళ్లొచ్చారు. వాళ్లల్లో ఒకావిడ సీలెంబుకు పెళ్లా అంది. ఆమె ఎవరో కాదు, లీలూ చిన్నతనంలో పెండ్లిపిలుపుకని మా ఇంటికొచ్చిన పేరంటాళ్లలో ఒకరు. సీలెంబుకు పెళ్లా అంటే అర్థంకాక, ఆశ్చర్యంగా చూశారు. లీలూ చిన్నతనంలో ముద్దుమాటల గురించి విన్న తర్వాత పేరంటాళ్లు నవ్వుల నలుగు పెట్టారు లీలూకు.
- కె.రంగనాథం
హరనాథపురం, నెల్లూరు
సీలెంబుకు పెళ్లి!
Published Sun, Jul 27 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement