వ్యక్తిగత వివాదాలకు రాజకీయ రంగు
ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఖండించిన బాధితురాలు
సాక్షి, నరసరావుపేట/మాచర్ల: వీధి గొడవలకు రాజకీయ రంగు పులిమి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల ద్వారా తాపీగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
కారంపూడిలో ఘర్షణలు జరిగిన వారం తరువాత పిన్నెల్లి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం తెలిసిందే. పాల్వాయి గేట్‌లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడి చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేయగా తనను చంపుతానని పిన్నెల్లి బెదిరించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. ఇవి చాలవన్నట్లు కండ్లకుంటకు చెందిన టీడీపీ ఏజెంట్‌తో పిన్నెల్లి సోదరులపై మంగళగిరి పోలీసుస్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.
మద్యం మత్తులో దాడి..
మాచర్ల 22వ వార్డులో శనివారం రాత్రి మల్లె లీలావతి అనే మహిళపై అదే వీధికి చెందిన ఉప్పుతోళ్ల వెంకటేశ్ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలున్నాయి. ఎల్లో మీడియా దీనికి రాజకీయ రంగు పులిమింది. బాధిత మహిళ టీడీపీకి ఓటు వేయడమే ఈ ఘర్షణకు కారణమంటూ కథనాలు అల్లేసింది. పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో దాడులు జరిగినట్లు తప్పుడు కథనాలు వెలువరించింది.
పార్టీలకు సంబంధం లేదు..
నాపై జరిగిన దాడితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఓ పార్టీకి ఓటు వేయడంతో దాడి చేశారంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదు. నన్ను ఏ మీడియా వాళ్లు వివరణ అడగలేదు. ఇష్టానుసారంగా వార్తలు రాయడం బాగాలేదు. మమ్మల్ని పార్టీల గొడవల్లోకి లాగొద్దు. మద్యం సేవించి నాపై దాడి చేస్తే పార్టీలకు అంటగట్టడం సరికాదు. నాపై దాడికి పాల్పడిన వెంకటేష్ పై పోలీసులు చర్య తీసుకోవాలి. లీలావతి, బాధిత మహిళ, మాచర్ల
Comments
Please login to add a commentAdd a comment