సాక్షి, అమరావతి: యుద్దభేరి పేరుతో ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసంపై ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నిర్ణయాన్ని వెలువరిస్తామన్నారు.
అంతకుముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీ కి చెందిన వారే అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతో ర్యాలీపై రాళ్లదాడి చేశారని చెప్పారు. తమపై దాడిచేసి ఆ తరువాత నాలుగు రోజులకు తప్పుడు ఫిర్యాదు చేశారని, పోలీసులు సైతం వాస్తవాలు తెలుసుకోకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇతర నిందితులందరికీ హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిందన్నారు.
చంద్రబాబు ప్రోద్బలంతోనే విధ్వంసం
పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు విధ్వంసం జరిగిందని చెప్పారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారన్నారు. అంగళ్లు వద్ద మొదలైన విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని, ఈ ఘటనలో పోలీసులు పెద్దసంఖ్యలో గాయపడ్డారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రిగా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి పూర్తి బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని చెప్పారు. చంద్రబాబు ప్రోద్బలంతో జరిగిన ఈ దాడిలో పిటిషనర్, ఇతరులు గాయపడ్డారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌కు అర్హులు కాదని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment