మంజూరు చేసిన హైకోర్టు.. షరతులు విధింపు
సాక్షి, అమరావతి/వెంకటాచలం: రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని పిన్నెల్లిని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు వారంలో ఒక రోజు సంబంధిత ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని చెప్పింది. పాస్‌పోర్టును మేజిస్ట్రేట్ కోర్టులో స్వాధీనం చేయాలని, అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని, ఎప్పుడు అవసరమైనా దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను వాటిని కోర్టుకు, పోలీసు అధికారికి తెలియజేయకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. నివాస స్థలం, మొబైల్ నంబరు వివరాలను దర్యాప్తు అధికారికి తెలపాలని, ఒకవేళ అవి మారితే వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పింది. ప్రస్తుత కేసుల్లో తన పాత్ర గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడరాదని ఆదేశించింది.
ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు చెప్పారు. దర్యాప్తు అధికారి పిన్నెల్లిని విచారణకు పిలిచినప్పుడు వెంట న్యాయవాదిని తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ పరిస్థితి వస్తే కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి çసూచించారు. పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు గురజాల కోర్టు నిరాకరించడంతో పిన్నెల్లి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై గురువారం విచారణ జరిపారు. ఈ కేసులో పిటిషనర్ నుంచి పోలీసులు రాబట్టాల్సిన విషయాలేవీ లేనందున, ఆయన్ని నిరవధికంగా నిర్బంధించడం సమర్థనీయం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిన్నెల్లి 4 సార్లు ఎమ్మెల్యే అని, ఆయనకు బలమైన సామాజిక సంబంధాలున్నాయని, ఆయన విచారణ నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు.
నేడు జైలు నుంచి పిన్నెల్లి విడుదల
బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయడంలో ఆలస్యం కావడంతో శుక్రవారం పిన్నెల్లిని విడుదల చేయడానికి వీలుకాలేదు. ఆయన్ని శనివారం విడుదలయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment