వచ్చే వారం వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా
రాత్రి 10.20 గంటలు కావడంతో విచారణ వాయిదా
ఉదయం నుంచి కేసులు చేసి చేసి అలసిపోయిన న్యాయమూర్తి
వాయిదాకు సమ్మతి తెలిపిన ఫిర్యాది తరపు న్యాయవాదులు
సాక్షి, అమరావతి : మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి వ్యాజ్యాలను విచారించేందుకు తగినంత సమయం లేకపోవడం, అప్పటికే రాత్రి 10.30 గంటలు కావడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.
మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు
ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆ వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు.
టీడీపీ నేతలు అస్మిత్‌రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉందని అభ్యర్థించడంతో ఈ నెల 6వ తేదీ వరకు వారందరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
వాదనలు ముగిసేలోపు అర్ధరాత్రి అవుతుంది
పిన్నెల్లి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. హైకోర్టుకు వేసవి సెలవుల కారణంగా అత్యవసర కేసులను విచారిస్తుండటంతో ఈ వ్యాజ్యాలు రాత్రి 9.30 గంటల సమయంలో విచారణకు వచ్చాయి. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు.
అంతేకాక ఈ నెల 6న విచారణకు రానున్న వ్యాజ్యాలను పరిష్కరించాలని హైకోర్టుకు తెలిపిందన్నారు. తమ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలన్నింటినీ కోర్టు ముందు ఉంచి వాదనలు పూర్తి చేసేందుకు సమయం పడుతుందన్నారు. ఆ తరువాత తమ వాదనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు స్పందించాల్సి ఉంటుందని, ఇవన్నీ పూర్తయ్యే లోపు అర్థరాత్రి దాటుతుందని నిరంజన్‌రెడ్డి వివరించారు. పైపెచ్చు సుప్రీంకోర్టు 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించి తీరాలని చెప్పలేదని, ఎలాంటి గడువు నిర్దేశించకుండా ఆ రోజున విచారణకు వచ్చే వ్యాజ్యాలను పరిష్కరించాలని మాత్రమే చెప్పిందన్నారు.
అనంతరం ఆయన కేసుకు సంబంధించిన వాదనలను వినిపించారు. పోలీసులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు సైతం స్పష్టంగా పేర్కొందని వివరించారు. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు దురుద్దేశపూర్వకంగా ఉందన్నారు. ఉదయం 10.30 నుంచి విరామం లేకుండా వరుసగా అనేక కేసులు విచారణ జరిపి న్యాయమూర్తి తీవ్రంగా అలసిపోయినట్లు ఉండటాన్ని గమనించిన నిరంజన్‌రెడ్డి.. విచారణను శనివారానికి వాయిదా వేయాలని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వినిపిస్తామని చెప్పారు. శనివారం తాను కేసు వినేందుకు నిబంధనలు అనుమతించవని, ప్రధాన న్యాయమూర్తి అనుమతించాల్సి ఉంటుందని జస్టిస్ విజయ్ స్పష్టం చేశారు.
అలా అయితే విచారణను వచ్చే వారానికి (13వ తేదీకి) వాయిదా వేయాలని, ఆ రోజున పూర్తిస్థాయి వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించవచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. తాము కూడా ఉదయం నుంచి పలు కేసుల్లో వాదనలు వినిపిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడే వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదుల అభిప్రాయం కోరారు.
వాదనలు విని తీర్పు చెప్పేలోపు తెల్లారుతుంది
ఫిర్యాదుదారు శేషగిరిరావు తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. మూడు క్రైం నంబర్లు ఒకే అంశానికి సంబంధించినవైనందున, అన్నింటినీ కలిపే విచారించాలని కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. అన్ని వ్యాజ్యాలపై వచ్చే వారం విచారణ జరుపుతానని తెలిపారు. ఇప్పటికే 10.20 అయిందని, ఇప్పుడు వాదనలు విని, తీర్పు చెప్పేలోపు తెల్లారి అవుతుందని, తాను అందుకు సిద్ధమేనని, అయితే కోర్టు సిబ్బంది ఇళ్లకు వెళ్లాల్సి ఉందని గుర్తు చేశారు. విచారణను వాయిదా వేయడంపై పోసాని వెంకటేశ్వర్లు అభిప్రాయం కోరగా, ఆయన కూడా అందుకు అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిన్నెల్లి అరెస్ట్ విషయంలో ఉన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాయిదాకు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు అంగీకరించిన విషయాన్ని కూడా తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
అలాంటి మాటలు ఇంకెవరి ముందైనా చెప్పండి
పోలీసు అధికారి నారాయణ స్వామి (పిన్నెల్లి ఫిర్యాదు మేరకు ఇతన్ని ఎన్నికల సంఘం విధులకు దూరంగా ఉంచింది) తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. 6వ తేదీనే ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు చేయకుంటే బాగుండదన్నారు. దీనిపై మళ్లీ ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఈ వాదనపై న్యాయమూర్తి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘సుప్రీం కోర్టుకు వెళితే వెళ్లనివ్వండి. ఎవరో వెళతారని మీరెలా చెబుతారు? ఇలాంటివన్నీ ఇంకెవరి ముందైనా చెప్పండి. ఈ కోర్టుకు కాదు.
కోర్టు పని వేళలు సాయంత్రం 4.15 గంటల వరకే. ఈ సమయం దాటి కేసులు విచారించకూడదు. మరి దీని గురించి ఏమంటారు’ అంటూ న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కి తగ్గిన అశ్వనీ కుమార్ కోర్టును క్షమాపణలు కోరారు. అల్లర్లలో నారాయణస్వామి తలకు తీవ్ర గాయమైందన్నారు. దీనికి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. నారాయణస్వామి తలకు తగిలిన గాయం స్వల్పమైనదేనని, ఈ విషయాన్ని ఆయన సమర్పించిన మెడికల్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుందని చెప్పారు. స్వల్ప గాయమని డాక్టర్లు చెబుతుంటే, తీవ్రమైనదని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment