రాజకీయ ప్రోద్బలంతో పోలీసులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు
నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లు
సాక్షి, అమరావతి: పోలింగ్ రోజున, ఆ మరుసటి రోజున తనపై రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం విచారణ జరపనున్నారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసి.. టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేశారంటూ రెంటచింతల పోలీసులు రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఆ మరుసటి రోజు కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారంటూ కారంపూడి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అనంతరం పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఇటీవల గురజాల కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురజాల కోర్టు రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తనపై హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసులు చెల్లవని.. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని పిన్నెల్లి వివరించారు. రాజకీయ ప్రోద్భలంతో పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తాను జైలు నుంచి బయటకు రాకూడదని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విన్నవించారు. 37 రోజులుగా జైల్లో ఉన్నానని.. పోలీసులు దర్యాప్తు కూడా పూర్తయ్యిందని.. బెయిల్ మంజూరు సందర్భంగా ఏ షరతు విధించినా కట్టుబడి ఉంటానన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును పిన్నెల్లి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment