ప్రతిభా మూర్తులకు పది విశ్వపీఠాలు | Special Story On Famous Women Personalities | Sakshi
Sakshi News home page

ప్రతిభా మూర్తులకు పది విశ్వపీఠాలు

Published Wed, Dec 11 2019 12:01 AM | Last Updated on Wed, Dec 11 2019 7:55 AM

Special Story On Famous Women Personalities - Sakshi

మహిళాభ్యుదయం అంటే... అవనిలో సగం – ఆకాశంలో సగం, నేల నీదే – నింగీ నీదే... అని స్ఫూర్తి పొందడం ఒక్కటే కాదు. సామాజిక చైతన్యంలో మహిళ సేవను గుర్తు చేసుకోవడం. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళ పాత్రను గుర్తెరగడం. మహిళ మేధను, నిష్ణాతను, నైపుణ్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియచేయడం.

కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ఉద్దేశం కూడా ఇదే. ప్రాచీన, ఆధునిక సమాజంలో సామాజిక వివక్షకు ఎదురొడ్డి మరీ సమాజాన్ని చైతన్యవంతం చేసి, తమ పాదముద్రలతో తర్వాతి తరాలకు మార్గదర్శనం చేసిన మహిళల గుర్తుగా యూనివర్సిటీలలో పది పీఠాలను (అకడమిక్‌ చెయిర్‌) ఏర్పాటు చేయనుంది. ఆ పీఠాలను ‘అలంకరించనున్న’ మహిళామూర్తుల వివరాలివి.

లల్లేశ్వరి
క్రీ.శ 14వ శతాబ్దంలో కశ్మీర్‌లో మహిళాభ్యుదయం కోసం అక్షర పోరాటం చేసిన మహిళ. కశ్మీర్‌ సాహిత్యంలో ఆమెది ప్రత్యేకస్థానం. స్త్రీకి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు చదువుతోనే సాధ్యమవుతాయన్నారు. స్త్రీకి చదువుకునే సౌకర్యం కల్పించే ఉదారవాద సమాజస్థాపన ఆమె ఆకాంక్ష. న్యూఢిల్లీలో 2000లో ఆమె రచనల మీద జాతీయ స్థాయి సెమినార్‌ జరిగింది. ‘రిమెంబరింగ్‌ లాల్‌ దేద్‌ ఇన్‌ మోడరన్‌ టైమ్స్‌’ పుస్తకం కూడా ఆవిష్కృతమైంది.

లీలావతి
గణితశాస్త్రవేత్త. క్రీ.శ. 16వ శతాబ్దం నాటి ప్రముఖ గణితశాస్త్రవేత్త రెండవ భాస్కరుని కుమార్తె. గణితంలో ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే నోటి లెక్కగా చెప్పేదని నాటి గ్రంథాల్లో ఉంది. భాస్కరుడు తాను రాసిన గణితశాస్త్ర గ్రంథానికి కూడా ‘లీలావతి’ అనే పేరు పెట్టాడు.

అహల్యాబాయ్‌ హోల్కర్‌
స్వస్థలం మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌కు సమీపంలోని చొండి గ్రామం. ఆడవాళ్లు ఇల్లు దాటి బయట అడుగుపెట్టడానికి సమాజం అంగీకరించని 18వ శతాబ్దంలో ఆమె ఇంట్లోనే చదవడం, రాయడం నేర్చుకున్నారు. అహల్యాబాయ్‌ భర్త మాల్వా రాజు ఖండేరావ్‌ హోల్కర్‌ కుంభేర్‌ యుద్ధంలో మరణించాడు. భర్త మరణించిన సమయంలో ఆమె సతిని పాటించాలా వద్దా అనే మీమాంస తలెత్తింది. రాజ్య నిర్వహణ బాధ్యత చేపట్టగలిగిన మహిళ తనను తాను సబలగా నిరూపించుకోవాలి తప్ప అబలగా అగ్నికి ఆహుతి కాకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పటినుంచి ఆమె మామ మల్హర్‌రావ్‌ ఆమెను రాజ్యపాలనలో నిష్ణాతురాలిని చేశారు. మల్హర్‌ రావ్‌ హోల్కర్‌ మరణించినప్పటి నుంచి అహల్యాబాయ్‌ పూర్తిస్థాయిలో రాజ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. రాజధానిని మాల్వా నుంచి మహేశ్వర్‌కు మార్చడం వంటి నిర్ణయాలతో పరిపాలనలో అనేక స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నారామె.

అమృతాదేవి బెనివాల్‌ (బిష్ణోయి)
చెట్లను కాపాడేందుకు ప్రాణాలు వదిలిన త్యాగశీల పర్యావరణవేత్త అమృతాదేవి. రాజస్థాన్, జో«ద్‌పూర్‌లోని ఖేజార్లి గ్రామంలో పుట్టిన అమృతాదేవి ఖేజ్రీ చెట్ల పరిరక్షణ కోసం పోరాడిన మహిళ. క్రీ.శ 1730లో భవననిర్మాణానికి అవసరమైన కలప కోసం రాజోద్యోగులు ఖేజార్లి గ్రామం సమీపంలోని అడవులకు వచ్చారు. చెట్లను ప్రేమించే బిష్ణోయి తెగ వాళ్లు కలప కోసం ఎండిన కొమ్మలను మాత్రమే ఉపయోగిస్తారు తప్ప చెట్లను నరకరు. సాటి బిష్ణోయి తెగకు చెందిన మహిళలను కూడగట్టి.. చెట్లను నరకడానికి వచ్చిన రాజు మనుషులను అడ్డుకుంది అమృతాదేవి. ఆ ఘర్షణలో ముగ్గురు కూతుళ్లతోపాటు అమృతాదేవి, మరో మూడు వందలకు పైగా బిష్ణోయి మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

అనందీబాయ్‌ జోషి
మనదేశంలో తొలి లేడీడాక్టర్‌. పద్నాలుగేళ్లకే బిడ్డకు తల్లయ్యారు ఆనందీబాయ్‌. కానీ ఆ బిడ్డ సరైన వైద్యం అందని కారణంగా పది రోజులకే మరణించడంతో ఆమె దృష్టి వైద్యరంగం మీదకు మళ్లింది. సంస్కృతం, ఇంగ్లిష్‌ నేర్చుకుని అమెరికా, పెన్సిల్వేనియాలోని ఉమెన్స్‌ మెడికల్‌ కాలేజ్‌లో వైద్యశాస్త్రాన్ని చదివారామె. ఇండియాకి తిరిగి వచ్చి కొల్హాపూర్‌లోని ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ హాస్పిటల్‌లో వైద్యసేవలందించారు.

హన్షా మెహతా
సూరత్‌లో పుట్టిన హన్షామెహతా గుజరాతీ భాషలో తొలి నవల రాసిన రచయిత. ఆమె విద్యావంతురాలు, సంఘసంస్కర్త, సామాజిక కార్యకర్త, స్వతంత్ర భావాలు కలిగిన మహిళ. ఆమె తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ చేసి ఇంగ్లండ్‌లో జర్నలిజం, సోషియాలజీ చదివారు.

మహాదేవి వర్మ
ఆమె ఉన్నత విద్యావంతురాలు, ప్రముఖ హిందీ కవయిత్రి. ఛాయావాద సాహిత్య ఉద్యమంలో ఆమె తన భావాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో కీలకంగా సేవలందించారు. అలహాబాద్‌లోని ‘ప్రయాగ మహిళా విద్యాపీuŠ‡’కు వైస్‌ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించారామె.

రాణి గైదిన్‌లియు
మణిపూర్‌కు చెందిన రాణి గైదిన్‌లియుకి 78 ఏళ్లు. ఆమె ఆధ్యాత్మిక, రాజకీయ నాయిక. బ్రిటిష్‌ పాలను వ్యతిరేకంగా గళమెత్తిన ధీర. పదమూడేళ్ల వయసులోనే హరక్కా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మణిపూర్‌ నుంచి బ్రిటిష్‌ వారిని తరిమివేయడానికి ఉద్యమించారు. పదహారేళ్ల వయసులో బ్రిటిష్‌ పాలకుల చేతిలో అరెస్ట్‌ అయ్యి జైలు జీవితాన్ని గడిపారామె. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆమెకు రాణి అని ప్రశంసించారు. ఆ తర్వాత ఆమె పేరులో రాణి అనే మకుటం చేరింది. జాతీయోద్యమ నాయకురాలిగా ఆమె సేవలకు భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.
– మంజీర

ఎం.ఎస్‌ సుబ్బులక్ష్మి
ఎం.ఎస్‌. పేరుతోపాటు గుర్తుకు వచ్చే పాట ‘రఘుపతి రాఘవ రాజారామ్‌’. గాంధీజీకి ఇష్టమైన పాట. తమిళనాడు, మధురైలో పుట్టిన సుబ్బులక్ష్మి కర్నాటక సంగీతంతో నిష్ణాతురాలు. భారతరత్న పురస్కారం, రామన్‌ మెగసెసె అవార్డు అందుకున్న తొలి సంగీతకారిణి ఆమె. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీలో సంగీతాలాపన చేసిన తొలి భారతీయురాలు కూడా. పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు ఎం.ఎస్‌ సుబ్బులక్ష్మి. ఆమె పేరులోని ఎం.ఎస్‌ అంటే మధురై షణ్ముఖవాడివు.

కమలా సోహోనీ
మధ్యప్రదేశ్, ఇందోర్‌కు చెందిన కమలా సోహోనీ సైన్స్‌ రంగంలో పీహెచ్‌డీ అందుకున్న తొలి భారతీయ మహిళ. బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఆమె పరిశోధనలు చేశారు. అంతేకాదు, ఆమె ఆ సంస్థలో మహిళల ప్రవేశానికి మార్గం సుగమం చేసిన మహిళ కూడా. వరి, పప్పుధాన్యాలలో ఉండే పోషకాలు, విటమిన్‌ల గురించి పరిశోధించారు. తాటి చెట్టు నుంచి స్రవించే ద్రవం ‘నీరా’లో ఉండేæ పోషకాలు– వాటి ప్రయోజనాల మీద చేసిన పరిశోధనకు ఆమె రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.

►పై ఐదుగురు (ఎడమ నుంచి కుడికి)
ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, కమలా సొహోనీ, దేవీ అహల్యాబాయ్‌ హోల్కర్, రాణీ గైడిన్లీ, హన్సా మెహ్‌తా

►కింది ఐదుగురు (పై నుంచి సవ్యదిశలో)
లీలావతి, లల్లేశ్వరి, అమృతాదేవి బెనీవాల్, మహదేవీ వర్మ, ఆనందీబాయ్‌ గోపాల్రావ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement