
టైర్ 2, 3 పట్టణాల్లో బలమైన వృద్ధి
నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఆప్నా వెల్లడి
ముంబై: ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు మరింత మంది మహిళలు ముందుకు వస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా 2021 నుంచి 2024 మధ్యకాలంలో టైర్–2, 3 ఇతర నాన్ మెట్రో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆప్నా డాట్ కో’ వెల్లడించింది. ముఖ్యంగా టైర్–2, 3 పట్టణాల నుంచి మహిళా అభ్యర్థుల దరఖాస్తులు మూడు రెట్లు పెరిగినట్టు తెలిపింది.
మెట్రోలకు వెలుపల ఉద్యోగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, డిజిటల్ అనుసంధానత, నియామకాల్లో వస్తున్న మార్పులు చిన్న పట్టణాల్లోనూ వివిధ రంగాల్లో మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది.
→ టైర్–2, 3 పట్టణాల్లో సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, అడ్మిన్, బ్యాక్‌ఆఫీస్, కస్టమర్ సపోర్ట్‌లో మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. 55 శాతం మంది మహిళలు ఈ ఉద్యోగాల్లోనే చేరుతున్నారు.
→ అంతేకాదు కఠిన పరిస్థితులు ఉండే క్షేత్రస్థాయి అమ్మకాలు, డెలివరీ, లాజిస్టిక్స్‌లోనూ కొందరు పనిచేసేందుకు సుముఖత చూపుతున్నారు.
→ క్షేత్రస్థాయి విక్రయాల్లో ఉద్యోగానికి 6 లక్షలు, డెలివరీ, లాజిస్టిక్స్ ఉద్యోగాలకు 2.5 లక్షల దరఖాస్తులు, సెక్యూరిటీస్ సేవల ఉద్యోగాలకు 1.5 లక్షల దరఖాస్తులు 2021–2024 మధ్యకాలంలో వచ్చాయి.
→ లక్నో, జైపూర్, ఇండోర్, భోపాల్, సూరత్, నాగ్‌పూర్, కోయింబత్తూర్ మహిళలకు ఉపాధి కేంద్రాలు. ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై ఉద్యోగ దరఖాస్తుల్లో 45% ఇక్కడివే.
Comments
Please login to add a commentAdd a comment