MS Subbulakshmi
-
ఆ అవార్డు గ్రహీతగా టీఎం కృష్ణ చెప్పుకోరాదు: సుప్రీం
న్యూఢిల్లీ: దిగ్గజ కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా ప్రకటించుకోరాదని కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్ సుబ్బులక్ష్మిని గతంలో టీఎం కృష్ణ తీవ్ర పదజాలంతో అవమానించి అప్రతిష్ట పాల్జేశారంటూ ఆమె మనవడు వి.శ్రీనివాసన్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఎం కృష్ణ ఇప్పటికే ఈ అవార్డును స్వీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు తీర్పు వెలువరించినట్లు తెలిపింది. ఈ విషయమై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ, ది హిందూ గ్రూప్‌లను ఆదేశించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఏటా ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డును అందజేస్తుంటుంది. -
ఎంఎస్ సుబ్బులక్ష్మి దిగి వచ్చినట్టున్న విద్యాబాలన్ ఫోటో ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
Azadi Ka Amrit Mahotsav: గంధర్వ గాయని.. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
‘‘ఆమె కంఠం అత్యంత మధురం. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశులైపోతారు. ప్రార్థన సమయంలో ఎవరైనా అలా భగవంతునిలో లీనం అవ్వాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు’’ అని మహాత్మాగాంధీ ఓ సందర్భంలో అన్నారు. సుబ్బులక్ష్మి సంగీతంలోని సారాంశం ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే! తమిళనాడులోని మదురైలో 1916లో సుబ్బులక్ష్మి జన్మించారు. ఆమె తల్లి వీణ షణ్ముఖవడివు సంగీత విద్వాంసురాలు. తొలి రోజుల్లో సుబ్బులక్ష్మికి సంగీత గురువు ఆమే! సుబ్బులక్ష్మి చిన్నప్పటి నుంచే కళాకారిణిగా నడక సాగించారు. పురుషుల ఆధిక్యమే చెల్లుబాటయ్యే మద్రాసు లోని మ్యాజిక్ అకాడమీలో 16 ఏళ్ల వయసులో ఆమె పాడుతుంటే, సంగీత ప్రపంచం ఆసక్తిగా విన్నది. పాత్రికేయుడు, సంగీత ప్రియుడు అయిన టి.సదాశివంతో ఆమె వివాహం జరిగింది. దాంతో ఆమెకు తనదైన మార్గదర్శకుడు దొరికినట్లయింది. దేశవ్యాప్తంగా పలువురితో సత్సంబంధాలున్న సదాశివం ఆమె వృత్తి జీవితానికి పూలబాట వేశారు. రాజనీతిజు ్ఞడైన సి.రాజగోపాలాచారి సహాయంతో, సుబ్బులక్ష్మి, సదాశివం దంపతులు దేశ సాంస్కృతిక పునరుజ్జీవనంలో కేంద్రస్థానంలో నిలిచారు. సహాయ కార్యక్రమాల కోసం కచ్చేరీలు చేసిన సుబ్బులక్ష్మి, ఎంతోమంది ప్రముఖులను అభిమానులుగా సంపాదించుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ సైతం అభిమానే! 1954లో పద్మభూషణ్ దక్కిన సుబ్బులక్ష్మిని 1998లో భారతరత్న వరించింది. సంగీత కళానిధి బిరుదు పొందిన తొలి మహిళ ఆమే! కర్ణాటక సంగీతంలో నోబెల్ బహుమతి లాంటిదని పేరున్న ఆ బిరుదును 1968లో మ్యూజిక్ అకాడమీ ఆమెకు ఇచ్చింది. 1974లో రామన్ మెగసేసే అవార్డు దక్కింది. ఆమె గళం నుంచి వచ్చిన వేంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, విష్ణు సహస్రనామం లాంటివి ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. ఇప్పటికీ ఆలయాల్లో, ఇళ్లల్లో సుబ్బు లక్ష్మి గళంలో ఇవి ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమె సంగీతమే ఆమె జీవితం. అది తెలుసు కనుకనే ఆమె తన గాత్ర మాధుర్యం ద్వారా ఎందరి హృదయాలనో చూరగొన్నారు. అలాంటి మహా వ్యక్తి ప్రేమను పొందగలగడం నా అదృష్టం. నాకే కాదు, నాలాగా ఆమెను కలిసిన వారందరి విషయంలో ఇది నిజం. – లక్ష్మీ విశ్వనాథన్, ‘కుంజమ్మ ఓడ్ టు ఎ నైటింగేల్’ పుస్తక రచయిత్రి -
మైత్రీం భజతా...
‘‘ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చర్చించుకుంటున్నాం. పిల్లలు, యువతీ యువకులు భవిష్యత్తులో తమ జీవితాన్ని తమకు తాముగా ఎలా సరిదిద్దుకోవచ్చో ఆయన అత్యంత సులభమైన మాటల్లో మనకు తెలియపరుస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు, ప్రాతఃస్మరణీయులు, అపర శంకరావతారులు, నడిచే దేముడని కీర్తింపబడిన మహాపురుషులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 23 అక్టోబరు, 1966 న ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచం మొత్తానికీ సంస్కృతంలో ఒక గీతం ద్వారా తన సందేశాన్ని ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ద్వారా ఇప్పించారు. దాని అర్థం విన్న అతిథులు అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. అందులో వాడిన మొదటి మాట – ‘‘మైత్రీం భజతా అఖిలహృజ్జేత్రిమ్..’’. అంటే ప్రపంచ ప్రజలు యుద్ధాలు, స్పర్థలు, కక్షలు కార్పణ్యాలు వదిలి అందరితో స్నేహంగా ఉండాలి..అని. అపకారం చేసినవాడు, తప్పు చేసినవాడు, ... అది దృష్టిలోపెట్టుకుని నీవు ఎవరినీ దూరం చేసుకోకు. అందరికీ మంచి చేసుకుంటూ పోవడమే నీ కర్తవ్యం. అందరూ వద్ధిలోకి రావాలని కోరుకో...అన్న అర్థంలో ఉందా గీతం. సర్వేజనా సుఖినోభవంతు. అంతే తప్ప ఏదో తప్పు చేసాడని వాడిని ఎలా దూరం చేద్దాం, ఎలా పక్కన పెడదాం... అని ఆలోచిస్తూ నీ సమయం, నీ జీవితం వృథా చేసుకోకు. వాడి తప్పు వాడు తెలుసుకోవాలని త్రికరణ శుద్ధిగా కోరుకో. అన్యాపదేశంగా వాడి తప్పు వాడు తెలుసుకునేటట్లు చేయి. వాడు మారాడా అదృష్టవంతుడు. నువ్వు మాత్రం వాడు తప్పు చేసాడని వాడికి అపకారం చేసే ప్రయత్నంలో నువ్వు పాడయి పోవద్దు. పాపాలను కడగడం, తప్పులను క్షమించడమే తప్ప అవతలివాడు మనపట్ల తప్పుగా వ్యవహరించాడు కాబట్టి మనం దానికి ప్రతిగా కక్ష తీర్చుకుని వాడికి బుద్ధి చెబుదాం... వంటి ధోరణి మహోన్నతమైన వ్యక్తుల జీవితాల్లో ఎక్కడా కనిపించదు. అయోథ్యా నగరవాసులు రాముడి గురించి చెబుతూ ...‘‘కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా...’’ అంటారు. ఓ దశరథ మహారాజా! నీ కొడుకెంత గొప్పవాడో తెలుసా! కావాలని ఉపకారం చేసినవాడినే కాదు, అనుకోకుండా ఉపకారం చేసినవాడిని కూడా రాముడు గుర్తుపెట్టుకుని పదేపదే తలుచుకుంటుంటాడు. అంత చిన్నవాటిని కూడా మర్చిపోడు. సముద్రం ఇవతల నిలబడి అవతలి వైపు లక్ష్యాన్ని తన బాణాలతో ఛేదించగల సమర్ధుడే అయినా రాముడు నూరు అపకారాలు చేసిన వాడిని కూడా శిక్షించకుండా, మరో అవకాశం ఇద్దామని, వాడు మారడానికి వీలు కల్పిద్దామంటూ ఓపికపట్టగల సమర్థుడు. ఉపకారం చేసిన వాడినయితే పదేపదే తలచుకుని మురిసిపోతుంటాడు... అదయ్యా రాముడంటే... అటువంటివాడు వాడు మాకు యువరాజుగా కావాలి.’’ అన్నారు ముక్తకంఠంతో.. అందుకే రాముడు మహాత్ముడయ్యాడు. ఇదీ భారతదేశ సాంస్కృతిక వైభవం. దానికి మనం వారసులం. ఉపకారికి ఉపకారం చేయడం సర్వసాధారణంగా లోకరీతిగా భావిస్తూ, అపకారం చేసిన వాడు కూడా తన తప్పు తెలుసుకుని మారడానికి వీలు కల్పించేవిధంగా పగబట్టకుండా, అతనికి మళ్ళీ అపకారం తలబెట్టకుండా అతనికి అవసరమయినప్పుడు ఉపకారం చేయాలని మన పెద్దలు మనకు చెబుతుంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చెరగని ఈ ముద్రలు వెండితెరకెక్కవా?
మొఘల్ సామ్రాజ్యం చివరి రాణి బేగం జీనత్ మహల్, భర్త స్వాతంత్య్రోద్యమంలో జైలు కెళితే ఖుదాఫీజ్ చెప్పిన జులైకా బేగం, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి, ముత్తులక్ష్మీ రెడ్డి, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి వంటి భారతీయ ధీరమహిళల జీవితచరిత్రలను భారతీయ చిత్రపరిశ్రమ వెండితెరపై ఇంతవరకు ఎందుకు చిత్రించలేకపోయింది? భారతీయ పురాణాల చిత్రణపై మనకు పట్టు ఉంది కానీ చరిత్ర చిత్రీకరణలో తడబడుతుంటాం. వీరోచిత కార్యాలకు పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకమే. బ్రిటిష్ నాటకరంగంలో, సినిమాల్లో విశిష్ట నటి జూడి డెంచ్ వంటివారు భారతీయ చిత్ర రంగంమీదికి ఇంకా రాలేదు. ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, పసలేని వీరోచిత కృత్యాలను తోసిపడేస్తారని ఆశిద్దాం. బేగం జీనత్ మహల్ అత్యద్భుతమైన జీవితం ఇంతవరకు వెండితెరపై ఎందుకు కనిపించలేదు? చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ అవశేష రాజ్యాన్ని పాలించిన చివరి భారతీయ రాణి ఈమె. ఆత్మగౌరవం, ఒంటరితనంతో, దర్పం, భయాందోళనల మిశ్రమ స్థితిలో ఎర్రకోటలోని పరిమిత పరిస్థితుల్లో జీవితం కోసం తపనపడిన ధీర వనిత ఈమె. దృఢచిత్తం ఉన్నప్పటికీ అదృష్టానికి నోచుకోని బేగం జీనత్ తన ఏకైక పుత్రుడు మీర్జా జావన్ బక్త్ని సింహాసనంపై కూర్చుండబెట్టడానికి తన రాణి హోదాను, దర్బారును ఎంతగానో ఉపయోగించి కూడా విఫలమైంది. షా జాఫర్ మునుపటి భార్యలకు పుట్టిన ఇద్దరు కుమారులకంటే తన కుమారుడికి ఆమె ఎంతో ప్రాధాన్యత నిచ్చింది. తన కుమారుడిని గద్దెనెక్కించడానికి ఆమె విఫల ప్రయత్నాలు చేసింది. అతడికి భవిష్యత్ సింహాసనం కట్టబెట్టడం కోసం 1857లో చెలరేగిన సిపాయి తిరుగుబాట్లకు దూరంగా ఉంచింది. తన భర్తను దురదృష్టం కోరల నుంచి బయటపడేయటానికి చేయగలిగినంతా చేసింది కానీ నిష్ఫలమే అయింది. సింహాసనం కోల్పోయి ప్రవాస శిక్షకు గురైన భర్త షా జాఫర్‌తోపాటు ఆమె రంగూన్‌కి పయనమైంది. ఎర్రకోట నుంచి బేగం జీనత్ మహల్ నిష్క్రమిం చడం బాధాకరమైన ఘటన. రంగూన్‌లోనే చనిపోయిన తన భర్త సమాధి పక్కనే నాలుగేళ్ల తర్వాత ఆమెని కూడా సమాధి చేశారు. మన కాలంలో బేగం జీనత్ మహల్‌కు సరిసమానమైన వ్యక్తిత్వం కలిగిన మరొక ధీరవనిత జులైకా బేగం గురించి కూడా భారతీయ సినిమా చిత్రించకపోవడం శోచనీయం. ఈమె మౌలానా ఆజాద్ అని మనందరికీ తెలిసిన అబుల్ కలామ్ గులాం మొహియుద్దీన్ భార్య. విద్యాధికుడైన తిరుగుబాటుదారు, లౌకికవాద పునీతుడు అయిన మౌలానా ఆజాద్ పుస్తకాలూ పోరాటాలే ప్రపంచంగా జీవించిన వారు. 13 ఏళ్ల ప్రాయంలో ఆయన్ని పెళ్లాడిన జులైకా బేగం తన భర్త స్వాతంత్య్ర పోరాటంలో మునిగి తేలుతున్న సమయంలో కలకత్తాలో గడిపారు. ముస్లిం లీగ్ తన లక్ష్యం పాకిస్తాన్ ఏర్పాటేనని ప్రకటించిన తర్వాత అవిభక్త హిందూస్తాన్ కోసం మౌలానా పోరాడుతూ వచ్చారు. 1942లో గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైన పోరాటంలోకి దిగినప్పుడు కలకత్తాలో తన గృహంలో ఉండిన ఆజాద్.. బొంబాయిలో క్విట్ ఇండియా కోసం పిలుపుని చ్చిన వెంటనే ఇంటిని వదిలి వెళ్లారు. ‘మరి కుటుంబం గురించి ఆలోచించు’ అని ఆమె అడిగి ఉంటారా? మనకు తెలిసినంతవరకు జులైకా బేగం వెళ్లిపోతున్న మౌలానాను అనుసరించి ఇంటి గేటు దాటి అక్కడే నిలబడి నిశ్శ బ్దంగా చూస్తూ, కారెక్కుతున్న భర్తకు ఖుదాఫీజ్ చెప్పారు. క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించగానే తనను కూడా అరెస్టు చేస్తారన్న విషయం ఆజాద్‌కు బహుశా తెలిసి ఉంటుంది. అలాగే నెహ్రూ, పటేల్, కృపలానీ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు ఆజాద్ కూడా మూడేళ్లపాటు అహ్మద్ నగర్ పోర్ట్ జైలులో గడిపారు. ప్రచురితమవుతాయా లేదా అని కూడా తెలీని పరిస్థితుల్లో తన జైలు గదిలోని రెండు ఊరపిచ్చుకల ప్రేమ జీవితాన్ని చూస్తూ, పరిశీలిస్తూ ఆయన ఉత్తరాల్లో రాస్తూ వచ్చారు. సుదీర్ఘ కారాగార ఏకాంత జీవితంలో ఇద్దరు దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింత బలోపేతమవుతుంది. తన భర్త ఖైదీగా ఉండగానే జులైకా కలకత్తాలో మరణిం చారు. అక్కడే ఆమెను సమాధి చేశారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి బ్రిటన్‌లో చదువుకుని సంగీత సాహిత్యాల్లో ప్రావీణ్యత పొందిన సరోజినీ నాయుడిపైనా మనదేశంలో ఎలాంటి సినిమా తీయలేదు. తన ప్రవృత్తికి భిన్నమైన హైదరాబాద్ నివాసి, శస్త్రవైద్యుడు గోవిందరాజులు నాయుడిని పెళ్లాడి అయిదుగురు బిడ్డలకు తల్లి అయిన సరోజిని నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. అమెరికన్ రచయిత కేథరీన్ మేయో రాసిన ‘మదర్ ఇండియా’ దేశంపై కలిగిస్తున్న ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆమె అమెరికాకు కూడా వెళ్లారు. దండి సత్యాగ్రహ సమయంలో పోలీసు చర్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. రాజ్యాంగ సభలో సేవలందించారు. యునైటెడ్ ప్రావిన్స్ ప్రథమ గవర్నర్ అయ్యారు. తర్వాత అచిరకాలంలోనే స్వల్ప అస్వస్థతకు గురై మరణించారు. అంతిమ క్షణాల్లోనూ ఆమె తనకు సేవలందిస్తున్న నర్సును పాటపాడి వినిపించమన్నారు. అలాగే 20వ శతాబ్ది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న కమలాదేవి ఛటోపాధ్యాయ, అరుణా అసఫాలీ, మృదులా సారాబాయి వంటి ధీరవనితలపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. వీరిలో మొదటివారు సోషలిస్టు, రెండోవారు కమ్యూనిస్టు, మూడో వ్యక్తి వ్యష్టివాదిగా ప్రసిద్ధులు. మృదులా సారాబాయి దేశ విభజన సమయంలో అపహరించబడి, త్యజించబడిన అనేకమంది మహిళలను కాపాడారు. అలాగే తదనంతర కాలంలో ముత్తులక్ష్మీ రెడ్డిగా పేరొందిన చంద్ర నారాయణ స్వామి ముత్తులక్ష్మిపై కూడా ఇంతవరకూ ఎవరూ సినిమా తీయలేదు. పుదుక్కోటై సంస్థానంలో దేవదాసీ కమ్యూనిటీలో పుట్టిన ముత్తులక్ష్మి చదువుకోవడానికి పెద్ద పోరాటమే చేశారు. తర్వాత పురుషుల కాలేజీలో సీటు సాధించిన తొలి విద్యార్థినిగా చరిత్రకెక్కారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి మహిళా హౌస్ సర్జన్ అయ్యారు. తర్వాత బ్రిటిష్ ఇండియాలో తొలి శాసనసభ్యురాలిగా ఎన్నికై దేవదాసీ వ్యవస్థ రద్దుకు కృషిచేశారు. అలాగే దేవదాసీ తల్లికి పుట్టిన ప్రతిభావంతురాలైన కుమార్తెగా మదురైలో పెరిగిన ఎమ్ఎస్ సుబ్బులక్ష్మిపై కూడా ఇంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. అనంతర కాలంలో సంగీత విద్మన్మణిగా అద్భుత ప్రావీ ణ్యత సాధించిన ఈమె స్వరాలు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి కానీ ఆమె జీవితం గురించిన అద్భుత సినిమా ఇంకా వెలువడలేదు. ఇలాంటి భారతీయ ధీరవనితల జీవితాలు ఇంతవరకు సినిమా రూపంలోకి ఎందుకు రాలేదు? ఎందుకంటే భారతదేశంలో పురాణాల గురించి మనకు బాగా తెలుసు కానీ చరిత్ర చిత్రణలో తడబడుతుంటాం. మానసిక సంక్షోభాలు, బుద్ధిజీవులకు చెందిన వ్యత్యాసాలను, డైలమాల చిత్రీకరణ మనకు సాధ్యం కాదు. వీరోచిత కార్యాలకు మనం పట్టం కడతాం కానీ వాస్తవ జీవిత చిత్రణ మనకు సమస్యాత్మకంగానే ఉంటోంది. మరొక కారణం ఉంది. మన కాలంలో కొంతమంది అతిగొప్ప నటీమణులను చూశాం. కానీ వ్యక్తిత్వ చిత్రణలను పండించే వారిని దొరకబుచ్చుకోవడం చాలా కష్టం. చారిత్రక హీరోయిన్ పాత్రల్లో ధరించేటటువంటి భారతీయ జూడి డెంచ్లు ఇంకా రంగంమీదికి రావడం లేదు. జూడి డెంచ్ బ్రిటన్ థియేటర్ నటి, వెండితెర నటి. ప్రస్తుతం ఆమె వయస్సు 85 ఏళ్లు. వర్జిన్ మేరీలో మేరీగా, హామ్లెట్‌లో ఒఫెలియాలా, రోమియో అండ్ జూలియట్లో జూలియట్‌లా, మాక్‌బెత్‌లో లేడీ మాక్బెత్లా, షేక్స్పియర్ ఇన్ లవ్‌లో క్వీన్ ఎలిజిబెత్‌లా, ది డచెస్ ఆఫ్ మాల్ఫిలో డచెస్లా, మిస్టర్ బ్రౌన్ టెలి ప్లేలో క్వీన్ విక్టోరియాలా, ఐరిస్‌లో ఐరిస్ మర్దోక్లా, జేమ్స్ బాండ్ సీరీస్‌లో ‘ఎమ్’ పాత్రధారిణిలా ఆమె విశిష్ట పాత్రలు పోషించారు. సమకాలీన, టెక్నో స్పై చిత్రాల్లో డెంచ్ పాత్ర ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం. జీరబోయిన ఆమె స్వరమే ఆమె సిగ్నేచర్‌గా మారిపోయింది. అయితే జ్వలించిపోయే ఆమె నేత్రాలు సకలభావాలను పలుకుతాయి. ఒక గొప్ప షాట్లో ఆమెను చంపబోతున్న హంతకుడు చేతిలో తుపాకితో ఆమెకు ఎదురు నిలబడతాడు. సరిగ్గా తుపాకి ట్రిగ్గర్ నొక్కుతుండగా డెంచ్ అతడికేసి తీక్షణంగా చూస్తుంది. మరుక్షణంలో ఆమె సురక్షితంగా ఒక డెస్క్ వెనుక పడిపోతుంది. సెకన్ల తేడాతో టెర్రరిస్టు తన తుపాకిని గురి పెట్టడం, ఆమె ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అతడికేసి తీక్షణంగా చూడటం ఎంత ప్రతిభావంతంగా షాట్‌గా మల్చారంటే క్రెడిట్ మొత్తం ఆమెకు, దర్శకుడికి మాత్రమే దక్కుతుంది. మన గొప్ప నటీమణులలో జూడి డెంచ్ ఒకరై ఉండినట్లయితే, మన జీనత్ మహల్, జులైకా, సరోజినీ నాయుడు, కమలాదేవి తదితర భారతీయ ధీరవనితల పాత్రలన్నీ ఆమె పోషించి ఉండేది. కానీ మనం నిరాశచెందాల్సిన పనిలేదు. కానీ మనం కోల్పోయిన జాతి రత్నాలను మనం తిరిగి ఆవిష్కరించడానికి మరొక తరం గడిచిపోవాల్సి ఉంటుంది కాబోలు. 85 ఏళ్ల ప్రాయంలో జూడీ డెంచ్ జన్మ దినోత్సవాన్ని ఈ డిసెంబర్ 9న జరుపుకున్న తరుణంలో, ఆమెను పోలిన నట విదుషీమణులు భవిష్యత్తులోనైనా మన దేశంలో పుట్టుకొస్తారని, కళా, సంస్కృతీ సౌందర్యాన్ని చూడని మన క్షుద్ర సినీ జీవుల బుర్రలేని వీరోచిత కృత్యాలను ఈ భవిష్యత్ తారలు తోసిపడేస్తారని మనసారా ఆశిస్తూ సంబరాలు చేసుకుందాం. వ్యాసకర్త : గోపాలకృష్ణ గాంధీ, మాజీ ఐఏఎస్ అధికారి, దౌత్యవేత్త, మాజీ గవర్నర్ -
ప్రతిభా మూర్తులకు పది విశ్వపీఠాలు
మహిళాభ్యుదయం అంటే... అవనిలో సగం – ఆకాశంలో సగం, నేల నీదే – నింగీ నీదే... అని స్ఫూర్తి పొందడం ఒక్కటే కాదు. సామాజిక చైతన్యంలో మహిళ సేవను గుర్తు చేసుకోవడం. సమకాలీన సమాజ నిర్మాణంలో మహిళ పాత్రను గుర్తెరగడం. మహిళ మేధను, నిష్ణాతను, నైపుణ్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియచేయడం. కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ఉద్దేశం కూడా ఇదే. ప్రాచీన, ఆధునిక సమాజంలో సామాజిక వివక్షకు ఎదురొడ్డి మరీ సమాజాన్ని చైతన్యవంతం చేసి, తమ పాదముద్రలతో తర్వాతి తరాలకు మార్గదర్శనం చేసిన మహిళల గుర్తుగా యూనివర్సిటీలలో పది పీఠాలను (అకడమిక్ చెయిర్) ఏర్పాటు చేయనుంది. ఆ పీఠాలను ‘అలంకరించనున్న’ మహిళామూర్తుల వివరాలివి. లల్లేశ్వరి క్రీ.శ 14వ శతాబ్దంలో కశ్మీర్లో మహిళాభ్యుదయం కోసం అక్షర పోరాటం చేసిన మహిళ. కశ్మీర్ సాహిత్యంలో ఆమెది ప్రత్యేకస్థానం. స్త్రీకి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు చదువుతోనే సాధ్యమవుతాయన్నారు. స్త్రీకి చదువుకునే సౌకర్యం కల్పించే ఉదారవాద సమాజస్థాపన ఆమె ఆకాంక్ష. న్యూఢిల్లీలో 2000లో ఆమె రచనల మీద జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. ‘రిమెంబరింగ్ లాల్ దేద్ ఇన్ మోడరన్ టైమ్స్’ పుస్తకం కూడా ఆవిష్కృతమైంది. లీలావతి గణితశాస్త్రవేత్త. క్రీ.శ. 16వ శతాబ్దం నాటి ప్రముఖ గణితశాస్త్రవేత్త రెండవ భాస్కరుని కుమార్తె. గణితంలో ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే నోటి లెక్కగా చెప్పేదని నాటి గ్రంథాల్లో ఉంది. భాస్కరుడు తాను రాసిన గణితశాస్త్ర గ్రంథానికి కూడా ‘లీలావతి’ అనే పేరు పెట్టాడు. అహల్యాబాయ్ హోల్కర్ స్వస్థలం మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌కు సమీపంలోని చొండి గ్రామం. ఆడవాళ్లు ఇల్లు దాటి బయట అడుగుపెట్టడానికి సమాజం అంగీకరించని 18వ శతాబ్దంలో ఆమె ఇంట్లోనే చదవడం, రాయడం నేర్చుకున్నారు. అహల్యాబాయ్ భర్త మాల్వా రాజు ఖండేరావ్ హోల్కర్ కుంభేర్ యుద్ధంలో మరణించాడు. భర్త మరణించిన సమయంలో ఆమె సతిని పాటించాలా వద్దా అనే మీమాంస తలెత్తింది. రాజ్య నిర్వహణ బాధ్యత చేపట్టగలిగిన మహిళ తనను తాను సబలగా నిరూపించుకోవాలి తప్ప అబలగా అగ్నికి ఆహుతి కాకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పటినుంచి ఆమె మామ మల్హర్‌రావ్ ఆమెను రాజ్యపాలనలో నిష్ణాతురాలిని చేశారు. మల్హర్ రావ్ హోల్కర్ మరణించినప్పటి నుంచి అహల్యాబాయ్ పూర్తిస్థాయిలో రాజ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. రాజధానిని మాల్వా నుంచి మహేశ్వర్‌కు మార్చడం వంటి నిర్ణయాలతో పరిపాలనలో అనేక స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నారామె. అమృతాదేవి బెనివాల్ (బిష్ణోయి) చెట్లను కాపాడేందుకు ప్రాణాలు వదిలిన త్యాగశీల పర్యావరణవేత్త అమృతాదేవి. రాజస్థాన్, జో«ద్‌పూర్‌లోని ఖేజార్లి గ్రామంలో పుట్టిన అమృతాదేవి ఖేజ్రీ చెట్ల పరిరక్షణ కోసం పోరాడిన మహిళ. క్రీ.శ 1730లో భవననిర్మాణానికి అవసరమైన కలప కోసం రాజోద్యోగులు ఖేజార్లి గ్రామం సమీపంలోని అడవులకు వచ్చారు. చెట్లను ప్రేమించే బిష్ణోయి తెగ వాళ్లు కలప కోసం ఎండిన కొమ్మలను మాత్రమే ఉపయోగిస్తారు తప్ప చెట్లను నరకరు. సాటి బిష్ణోయి తెగకు చెందిన మహిళలను కూడగట్టి.. చెట్లను నరకడానికి వచ్చిన రాజు మనుషులను అడ్డుకుంది అమృతాదేవి. ఆ ఘర్షణలో ముగ్గురు కూతుళ్లతోపాటు అమృతాదేవి, మరో మూడు వందలకు పైగా బిష్ణోయి మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అనందీబాయ్ జోషి మనదేశంలో తొలి లేడీడాక్టర్. పద్నాలుగేళ్లకే బిడ్డకు తల్లయ్యారు ఆనందీబాయ్. కానీ ఆ బిడ్డ సరైన వైద్యం అందని కారణంగా పది రోజులకే మరణించడంతో ఆమె దృష్టి వైద్యరంగం మీదకు మళ్లింది. సంస్కృతం, ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా, పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజ్‌లో వైద్యశాస్త్రాన్ని చదివారామె. ఇండియాకి తిరిగి వచ్చి కొల్హాపూర్‌లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో వైద్యసేవలందించారు. హన్షా మెహతా సూరత్‌లో పుట్టిన హన్షామెహతా గుజరాతీ భాషలో తొలి నవల రాసిన రచయిత. ఆమె విద్యావంతురాలు, సంఘసంస్కర్త, సామాజిక కార్యకర్త, స్వతంత్ర భావాలు కలిగిన మహిళ. ఆమె తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసి ఇంగ్లండ్‌లో జర్నలిజం, సోషియాలజీ చదివారు. మహాదేవి వర్మ ఆమె ఉన్నత విద్యావంతురాలు, ప్రముఖ హిందీ కవయిత్రి. ఛాయావాద సాహిత్య ఉద్యమంలో ఆమె తన భావాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో కీలకంగా సేవలందించారు. అలహాబాద్‌లోని ‘ప్రయాగ మహిళా విద్యాపీuŠ‡’కు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించారామె. రాణి గైదిన్లియు మణిపూర్‌కు చెందిన రాణి గైదిన్లియుకి 78 ఏళ్లు. ఆమె ఆధ్యాత్మిక, రాజకీయ నాయిక. బ్రిటిష్ పాలను వ్యతిరేకంగా గళమెత్తిన ధీర. పదమూడేళ్ల వయసులోనే హరక్కా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మణిపూర్ నుంచి బ్రిటిష్ వారిని తరిమివేయడానికి ఉద్యమించారు. పదహారేళ్ల వయసులో బ్రిటిష్ పాలకుల చేతిలో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపారామె. జవహర్లాల్ నెహ్రూ ఆమెకు రాణి అని ప్రశంసించారు. ఆ తర్వాత ఆమె పేరులో రాణి అనే మకుటం చేరింది. జాతీయోద్యమ నాయకురాలిగా ఆమె సేవలకు భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. – మంజీర ఎం.ఎస్ సుబ్బులక్ష్మి ఎం.ఎస్. పేరుతోపాటు గుర్తుకు వచ్చే పాట ‘రఘుపతి రాఘవ రాజారామ్’. గాంధీజీకి ఇష్టమైన పాట. తమిళనాడు, మధురైలో పుట్టిన సుబ్బులక్ష్మి కర్నాటక సంగీతంతో నిష్ణాతురాలు. భారతరత్న పురస్కారం, రామన్ మెగసెసె అవార్డు అందుకున్న తొలి సంగీతకారిణి ఆమె. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సంగీతాలాపన చేసిన తొలి భారతీయురాలు కూడా. పద్మభూషణ్, పద్మ విభూషణ్, సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా అందుకున్నారు ఎం.ఎస్ సుబ్బులక్ష్మి. ఆమె పేరులోని ఎం.ఎస్ అంటే మధురై షణ్ముఖవాడివు. కమలా సోహోనీ మధ్యప్రదేశ్, ఇందోర్‌కు చెందిన కమలా సోహోనీ సైన్స్ రంగంలో పీహెచ్డీ అందుకున్న తొలి భారతీయ మహిళ. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఆమె పరిశోధనలు చేశారు. అంతేకాదు, ఆమె ఆ సంస్థలో మహిళల ప్రవేశానికి మార్గం సుగమం చేసిన మహిళ కూడా. వరి, పప్పుధాన్యాలలో ఉండే పోషకాలు, విటమిన్ల గురించి పరిశోధించారు. తాటి చెట్టు నుంచి స్రవించే ద్రవం ‘నీరా’లో ఉండేæ పోషకాలు– వాటి ప్రయోజనాల మీద చేసిన పరిశోధనకు ఆమె రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ►పై ఐదుగురు (ఎడమ నుంచి కుడికి) ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, కమలా సొహోనీ, దేవీ అహల్యాబాయ్ హోల్కర్, రాణీ గైడిన్లీ, హన్సా మెహ్తా ►కింది ఐదుగురు (పై నుంచి సవ్యదిశలో) లీలావతి, లల్లేశ్వరి, అమృతాదేవి బెనీవాల్, మహదేవీ వర్మ, ఆనందీబాయ్ గోపాల్రావ్ -
నేడు ఎంఎస్ సుబ్బలక్ష్మి వర్ధంతి
-
మనకు తెలియని యం.ఎస్
తాజా పుస్తకం ఆమె సుప్రభాతం శ్రీ వేంకటేశ్వరునికి మేలుకొలుపు. ఆమె దివ్యగానం ముక్కోటి దేవతలకు పవిత్రార్చన. ఆమె స్వరం గాంధీజీకి ప్రాణం. ఆమె గాత్రం కోట్లాది మందికి హృదయంగమం. ఆ గాన మాధుర్యం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సొంతం. ఆమె గురించి ఇప్పటి వరకు వేలాది వ్యాసాలు వచ్చాయి. వందలాది కథనాలు వెలువడ్డాయి. పుస్తకాలకు లెక్కేలేదు. కాని ప్రముఖ జర్నలిస్ట్ టి.జె.ఎస్ జార్జ్ రాసిన ఎమ్మెస్ బయోగ్రఫీ– ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ ఎక్కువ మంది పాఠకుల మన్ననను పొందింది. దానిని హైదరాబాద్‌కు చెందిన హెచ్‌బీటీ సంస్థ ‘మనకు తెలియని ఎం.ఎస్’గా తెలుగులో ప్రచురించింది. ప్రముఖ రచయిత్రి ఓల్గా దీనిని తెలుగులోకి అనువదించారు. ఈ రోజు అంటే నవంబర్ 24 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. ముఖ్యవక్తగా కర్ణాటక గాయకుడు, ప్రజామేధావి టి.ఎం. కృష్ణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రచురణకర్త గీతా రామస్వామి, అనువాదకురాలు ఓల్గా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ టీజేఎస్ జార్జ్ 2004లో ఇంగ్లిష్‌లో రాశారు. 20016 వరకూ ఈ పుస్తకం గురించి నాకు తెలీదు. ఈ పుస్తకం గురించి ఇప్పటిదాకా తెలీకుండా ఎలా ఉన్నానా? అని ఆశ్చర్యపోయా. అంటే కర్ణాటక సంగీతంలోని ఒక వర్గం లాబీ మొత్తం దాన్ని బయటకు రాకుండా చేసింది. ఎందుకంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే ప్రపంచానికి తెలుసు. కాని ఈ పుస్తకం ఆమెది దేవదాసీ కుటుంబ నేపథ్యం అని చెబుతోంది. ఈ సంగతి నలుగురికీ తెలియకూడదని ఆ లాబీ భావించినట్టుంది. 2016లో ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేసినప్పుడు కొన్ని సమీక్షలు వెలువడితే తెప్పించుకొని చదివాను. అరే.. ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులోకి ఎందుకు ప్రచురించకూడదు అని అనిపించింది. అదే సమయంలో కొంచెం సంశయం కూడా పొందాను. నిజానికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కళ అంతా దేవదాసీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే వచ్చింది. అయినా ఆమె బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే గుర్తింపు పొందింది. ఈ వైరుధ్యాన్ని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎలా ఎదుర్కొన్నది, రోజువారి జీవితంలో ఈ ద్వంద్వ అస్తిత్వాన్ని ఎలా సమన్వయం చేసుకుంది... వంటి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలియచేయవచ్చు అనిపించింది. అదీగాక ఒక మహా గాయకురాలి గెలుపు ఓటములు రెండూ మనకు అవసరమే. ఎమ్మెస్ ఎందుకు బ్రాహ్మణీకంలో లీనమయ్యింది... ఆమెను స్వీకరించిన బ్రాహ్మణీకం ఎందుకు మరో గాయని రావు బాలసరస్వతిని తిరస్కరించింది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకోటి ఏమనిపించిందంటే బ్రాహ్మణ కళాకారుల గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ పుస్తకం బయటకు వస్తే దేవదాసీ వంటి కమ్యూనిటీల గురించి రాసేవాళ్లు కూడా వస్తారు అనిపించింది. ఎమ్మెస్ మూలాలు దేవదాసి కుటుంబంతో ఉన్నాయని తెలిస్తే ఆ సమూహం తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుందనిపించింది. ఇక ఈ పుస్తక రచయిత జార్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు అయుండి కర్ణాటక సంగీతంతో అసలు పరిచయం లేకపోయినా ఇంత అద్భుతంగా రాశాడు అంటే అదే భారతదేశంలోని వైవిధ్యం. బ్రాహ్మణుడు అయి ఉంటే ఈ పుస్తకాన్ని ఇంత సున్నితంగా రాసి ఉండేవాడు కాదేమో. ఒక్కమాటలో చెప్పాలంటే ఇట్సె వండర్ఫుల్ బుక్. ఈ పుస్తకాన్ని తెలుగులోకి చేయాలి అనుకోగానే నా మనసులోకి వచ్చిన వ్యక్తి ఓల్గానే. ఎందుకంటే ఇది ప్రాథమికంగా స్త్రీవాదాన్ని సూచించే రచన. వీ ఆర్ రిట్రీవింగ్ ఫెమినిస్ట్ హిస్టరీ. నేను అడగగానే వెంటనే యెస్ అంది. అప్పటిదాకా తాను చేస్తున్న పని పక్కనపెట్టి ఈ అనువాదం తీసుకుంది. ప్రస్తుతం మా సంస్థ జీవిత కథల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఈ నెల 29న గౌరీ లంకేష్ పుస్తకం విడుదల కానుంది. తర్వాత రావు బాలసరస్వతి బయోగ్రఫీ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ పాఠకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచన కూడా రేకెత్తిస్తాయని భావిస్తాను. సుబ్బులక్ష్మి మూలాలను చెప్పే పుస్తకం – గీతా రామస్వామి, ప్రచురణకర్త గీత అడగ్గానే చాలా సంతోషమేసింది. ఎమ్మెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పాటలు బాగా వింటాను. కొన్ని కొన్ని పాటలను కొన్నాళ్లు పొద్దున్నే వినేదాన్ని. మనసుకు హాయిగా ఉంటుందని. ఆమె పాడిన శ్రీరంగపుర విహార లాంటి పాటలను చాలా ఇష్టంగా వింటుంటాను. ఎమ్మెస్ దేవదాసీ అని అప్పుడెప్పుడో ‘హిందూ’లో చదివాను. అప్పటిదాకా నాకు తెలియదు. తెలియగానే షాక్ అయ్యాను. ఇంతకాలం తెలియకుండా ఎలా దాచారు వీళ్లు అనిపించింది. ఇప్పుడు బయోగ్రఫీ అనగానే అవన్నీ తెలుసుకోవచ్చనిపించింది. గతంలో నేను ‘సరిద మాణిక్యమ్మ’ అని దేవదాసీని 1990లలో కలిసాను. ఆమె ఎంత గొప్పదంటే ‘దావదాసీ రామయాణాన్ని’ నటరాజ రామకృష్ట బృందానికి నేర్పించి దానిని పునర్ముఖం చేసింది. అలాంటి ఆవిడను ఎంతో దయనీయమైన స్థితిలో చూశాను. ‘మా కళలన్నీ ఇతరులు నేర్చుకున్నారమ్మా. కాని మాకు మాత్రం ఇప్పుడు ఏమీ లేదు’ అని ఆమె అనడం నాకు చాలా బాధనిపించింది. అప్పటి నుంచి దేవదాసీల గురించి ఆలోచిస్తూనే ఉన్నా. ముత్తు లక్ష్మీరెడ్డి, బెంగుళూరు నాగరత్నమ్మ, మైసూరు జెట్టి తాయమ్మ వంటి దేవదాసీల పోరాటాలు.. జీవితాలు అధ్యయనం చేశాను. ఈ మధ్య నేను రాసిన ‘గమనమే గమ్యం’ అనే నవల్లో కూడా ఒక దేవదాసీ పాత్ర ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎం.ఎస్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నా. నిజానికి అప్పటికి నేను పని చేస్తున్న పుస్తకం ఈ విషయానికి పూర్తిగా వ్యతిరేకమైనది. అది ‘నైనా దేవీ’ అనే టుమ్రీ గాయనీ గురించి. ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ చాలా డిఫరెంట్. ఆమె బ్రాహ్మిణ్. రాజా రామమోహన్‌రాయ్ మనవరాలు. అయినా సరే దేవదాసీలాంటి వాళ్లు పాడే పాటలు నేర్చుకొని పాడింది. అదీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అయినా దాన్ని పక్కన పెట్టి ఇది చేశాను. కారణం.. ఎమ్మెస్ అంటే ఉన్న ఇష్టమే కాకుండా నేను తెలుసుకోవాలనుకున్న చాలా విషయాలున్నాయనిపించింది. అన్నట్టుగానే ఈ పుస్తకం నాకెంత జ్ఞానం ఇచ్చిందంటే మొత్తం కర్ణాటక సంగీతాన్నే అర్థం చేయించింది. కర్ణాటక సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుంది అనేది ఈ పుస్తకం చెబుతుంది. అన్ని బయోగ్రఫీల్లాంటి బయోగ్రఫీ కాదు ఇది. చాలా ప్రత్యేకమైంది. జార్జ్ చాలా రీసెర్చ్ చేశాడు. సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుందో తెలిపే పుస్తకం – ఓల్గా, రచయిత్రి -
ప్రధానిని కలిసి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి వారసులు
-
ప్రధానిని కలిసి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వారసులు
సాక్షి, న్యూఢిల్లీ : అమరగాయకురాలు భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు.. 1966లో ఎం.ఎస్. సుబ్బులక్ష్మిఐక్యరాజ్య సమితిలో పాడిన మైత్రీమ్ భజతామ్ గీతాన్ని మోదీ ముందు ఆలపించారు. ఈ గీతాన్ని కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు రచించారు. సౌందర్య, ఐశ్వర్యలతో పాటు.. వారి తల్లిదండ్రులు శ్రీనివాసన్, గీతలు కూడా మోదీని కలిసినవారిలో ఉన్నారు. -
ఘనంగా సుబ్బులక్ష్మి జయంత్యుత్సవాలు
నెల్లూరు(బారకాసు): సింహపురి కల్చరల్ అకాడమీ, సంస్కృతి తరంగాలు సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో పురమందిరంలో నిర్వహిస్తున్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శతజయంత్యుత్సవాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ డోలు విద్వాంసుడు నెల్లూరు మస్తాన్‌బాబు, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు కుమారి ఆశ్రితారెడ్డి, కుమారి లాస్యను ముఖ్యఅతిథులు సన్మానించి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారాలను అందజేశారు. అవసరాల కన్యాకుమారితో నిర్వహించిన వయెలిన్ వాద్యం అలరించింది. ప్రముఖ డోలు విద్వాంసులు పద్మశ్రీ హరిద్వార మంగళం పళనివేల్(డోలు), పత్రి సతీష్‌కుమార్ (మృదంగం) వాద్య సహకారాన్ని అందించారు. నృత్య కళాకారిణి ఆశ్రితారెడ్డి కూచిపూడి నాట్యంతో ఆకట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి, బీవీ నరసింహం, సత్యనారాయణ, ప్రముఖ తవిల్ విద్వాన్ సుబ్రహ్మణ్యం, నిర్వాహకులు రేణిగుంట రాజశేఖర్, మునిప్రసాద్, మునిరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించుకోవాలి
అలరించిన గాత్రకచేరి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జయంత్యుత్సవాలు ప్రారంభం నెల్లూరు(బారకాసు): శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సింహపురి కల్చరల్ అకాడమీ, సంస్కృతి తరంగాలు సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శతజయంత్యుత్సవాలు సోమవారం రాత్రి పురమందిరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. భారతీయ సాంస్కృతిక సంగీతాలను మరిచి పాశ్చాత్య సంగీతాన్ని అలవర్చుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల వారు భారతీయ సంగీతం వైపు ఆకర్షితులవుతుంటే భారతీయలు మాత్రం ఇతర దేశాల సంగీతాన్ని ఇష్టపడటం దురదృష్టకరమన్నారు. ఎంతో ప్రాచీనం పొందిన శాస్త్రీయ సంగీతాలు కనుమరుగవుతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడాన్ని అభినందించారు. మూడు రోజుల పాటు జరిగే జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అలరించిన గాత్ర కచేరి పురమందిరంలో జరిగిన శాస్త్రీయ సంగీత విభావరితో పలువురు పులకించారు. చెన్నైకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు విఘ్నేష్ ఈశ్వరన్ తన బృందంతో ఆలపించిన గాత్రకచేరి ఆహూతులను అలరించింది. ‘జగదానంద కారక’ సాధించినే ఓ మనసా’ పంచరత్న కీర్తన, ఆదితాళం.. ‘శ్రీమన్నారాయణ’, అన్నమాచార్య రచన, భౌళిరాగం, ఆదితాళం.. ‘నన్ను పాలింప’, తదితర కీర్తనలు ఆహూతులను ఓలలాడించాయి. పుదుకోటై రామనాథన్(వయోలిన్), ఇలపావులూరి పినాకపాణి(మృదంగం), మారుతీ రఘురామ్(ఘటం)తో వాయిదాన్ని అందించారు. రేణిగుంట రాజశేఖర్ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, సహస్ర సభాసింహం నరసింహం, కావలి వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, ప్రముఖ వ్యాపారవేత్త కొండా బలరామిరెడ్డి, పంచాగ్నుల వెంకటవిశ్వనాథం, వల్లకవి వెంకటసుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ సుబ్బులక్ష్మికి అరుదైన గౌరవం
న్యూయార్క్: కర్ణాటక సంగీత విధ్వాంసురాలు, లెజండరీ గాయని, ఒకప్పుడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సైతం తన గొంతు వినిపించిన గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మికి అత్యంత అరుదైన గౌరవం దక్కనుంది. ఐక్యరాజ్యసమితి ఆమె శతజయంతి నేపథ్యంలో ఒక స్టాంపును విడుదల చేస్తోంది. ఐక్యరాజ్య సమితి పోస్టల్ పరిపాలన విభాగం 70వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధి చెప్పారు. ఈ ఆగస్టు 15న ఐరాస జనరల్ అసెంబ్లీ వద్ద హాలులో లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఒక భారతీయుడు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. అందుకు ప్రదర్శన ఇచ్చింది ఎంఎస్ సుబ్బలక్ష్మీ మాత్రమే. 1966 అక్టోబర్ నెలలో ఈ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ప్రదర్శన ఇచ్చారు. -
'అందుకే అంత బాధగా ఉంది..'
చేతి నిండా సినిమాలున్నా, ఎన్నో అవకాశాలు తలుపు తడుతున్నా బాలీవుడ్ పరిణీత విద్యాబాలన్‌కు మాత్రం చేజారిన ఓ అవకాశం మీదకే మనసు మళ్లుతోందట. ఎలాగైనా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే బావుండని ఫీల్ అవుతోంది. విద్య మనసు దోచిన ఆ పాత్ర ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయనీమణి అయిన ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి జీవితచరిత్ర ఆధారంగా నిర్మించదలచిన చిత్రంలో లీడ్ రోల్. ఎమ్ఎస్ సుబ్బులక్ష్మిగా విద్యా దాదాపు ఫిక్సయ్యాక అనుకోని అవాంతరాలతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో విద్య మనసు మనసులో లేకుండా పోయింది. ఎలాగైనా సినిమా తిరిగి మొదలైతే బావుండని కోరుకుంటోంది. అయితే ఆమె ఆ పాత్రలో నటించాలని అంతగా కోరుకోవడం వెనుక చాలా కారణాలున్నాయట. వాటిలో ఒకటి.. సుబ్బులక్ష్మి ఆహార్యం. ఆమె ధరించే అందమైన చీరలు, నగలంటే విద్యకు చాలా ఇష్టమట. ముఖ్యంగా సుబ్బులక్ష్మి ధరించే వజ్రాల చెవిదిద్దులు చాలామందిని ఆకర్షించేవన్నారు. ఇప్పటికీ ఆమె ఫొటోలు చూసినప్పుడల్లా ఆమె ధరించిన నగలు చూసి 'ఓ మై గాడ్' అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారన్నారు. కాంచీవరం చీరల్లో, వజ్రాల నగలతో ఆమెలా అందంగా కనిపించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఫీలయ్యానని, కానీ అనుకోని కారణాలతో సినిమా నిర్మాణం ఆగిపోవడం చాలా బాధగా ఉందన్నారు. అయితే కనీసం తన మనసులోని మాట బయట పెట్టినందుకైనా ఎవరైనా సినిమా మొత్తం కాంచీవరం చీరలతో కనిపించేలా ఓ మంచి కథతో ముందుకొస్తే బావుండంటున్నారు. విద్యా బాలన్ చాలాసార్లు తనకు నగలు, చీరల మీదున్న ఇష్టాన్ని బయటపెట్టింది. ఆభరణాలు కొనడమనేది తనకి తెలిసిన మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెబుతుంటుంది. అందమైన చీరల్లో ఎక్కువగా టెంపుల్ జ్యూయెలరీని ధరించి కనిపిస్తుంటుంది విద్య. ప్రస్తుతం ఆమె 'బేగమ్ జాన్' అనే సినిమాలో నటిస్తుంది. అలాగే మహానటి సావిత్రి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ యువ దర్శకుడు విద్యను సంప్రదించినట్టు సమాచారం. -
సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు
చెన్నై: సోషల్ మీడియా నుంచి ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను తొలగించడంతో కర్ణాటక సంగీత ప్రియులు అసంతృప్తికి గురవుతున్నారు. మార్గశిర మాసం అంటేనే కర్ణాక సంగీత ప్రియులకు అంత్యంత ప్రీతి పాత్రమైనది. ఈ నెలలో పలు కర్ణాటక సంగీతోత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాంటి కర్ణాటక సంగీతంలో ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను సోషల్ మీడియాలో ఆలకించాలని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. యూట్యూబ్ నుంచి సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామం గీతాన్ని తొలగించారు. ఆ గీతాల హక్కులను పొందిన ఆడియో సంస్థ ఆ సహస్రనామ గీతాన్ని తొలగించడం కర్ణాటక సంగీత ప్రియులను నిరాశకు గురిచేసింది.