'అందుకే అంత బాధగా ఉంది..'
చేతి నిండా సినిమాలున్నా, ఎన్నో అవకాశాలు తలుపు తడుతున్నా బాలీవుడ్ పరిణీత విద్యాబాలన్కు మాత్రం చేజారిన ఓ అవకాశం మీదకే మనసు మళ్లుతోందట. ఎలాగైనా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కితే బావుండని ఫీల్ అవుతోంది. విద్య మనసు దోచిన ఆ పాత్ర ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయనీమణి అయిన ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి జీవితచరిత్ర ఆధారంగా నిర్మించదలచిన చిత్రంలో లీడ్ రోల్. ఎమ్ఎస్ సుబ్బులక్ష్మిగా విద్యా దాదాపు ఫిక్సయ్యాక అనుకోని అవాంతరాలతో ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో విద్య మనసు మనసులో లేకుండా పోయింది. ఎలాగైనా సినిమా తిరిగి మొదలైతే బావుండని కోరుకుంటోంది.
అయితే ఆమె ఆ పాత్రలో నటించాలని అంతగా కోరుకోవడం వెనుక చాలా కారణాలున్నాయట. వాటిలో ఒకటి.. సుబ్బులక్ష్మి ఆహార్యం. ఆమె ధరించే అందమైన చీరలు, నగలంటే విద్యకు చాలా ఇష్టమట. ముఖ్యంగా సుబ్బులక్ష్మి ధరించే వజ్రాల చెవిదిద్దులు చాలామందిని ఆకర్షించేవన్నారు. ఇప్పటికీ ఆమె ఫొటోలు చూసినప్పుడల్లా ఆమె ధరించిన నగలు చూసి 'ఓ మై గాడ్' అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారన్నారు. కాంచీవరం చీరల్లో, వజ్రాల నగలతో ఆమెలా అందంగా కనిపించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఫీలయ్యానని, కానీ అనుకోని కారణాలతో సినిమా నిర్మాణం ఆగిపోవడం చాలా బాధగా ఉందన్నారు. అయితే కనీసం తన మనసులోని మాట బయట పెట్టినందుకైనా ఎవరైనా సినిమా మొత్తం కాంచీవరం చీరలతో కనిపించేలా ఓ మంచి కథతో ముందుకొస్తే బావుండంటున్నారు.
విద్యా బాలన్ చాలాసార్లు తనకు నగలు, చీరల మీదున్న ఇష్టాన్ని బయటపెట్టింది. ఆభరణాలు కొనడమనేది తనకి తెలిసిన మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెబుతుంటుంది. అందమైన చీరల్లో ఎక్కువగా టెంపుల్ జ్యూయెలరీని ధరించి కనిపిస్తుంటుంది విద్య. ప్రస్తుతం ఆమె 'బేగమ్ జాన్' అనే సినిమాలో నటిస్తుంది. అలాగే మహానటి సావిత్రి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ యువ దర్శకుడు విద్యను సంప్రదించినట్టు సమాచారం.