
‘‘ఉపకారికినుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చర్చించుకుంటున్నాం. పిల్లలు, యువతీ యువకులు భవిష్యత్తులో తమ జీవితాన్ని తమకు తాముగా ఎలా సరిదిద్దుకోవచ్చో ఆయన అత్యంత సులభమైన మాటల్లో మనకు తెలియపరుస్తున్నారు.
కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు, ప్రాతఃస్మరణీయులు, అపర శంకరావతారులు, నడిచే దేముడని కీర్తింపబడిన మహాపురుషులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 23 అక్టోబరు, 1966 న ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచం మొత్తానికీ సంస్కృతంలో ఒక గీతం ద్వారా తన సందేశాన్ని ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ద్వారా ఇప్పించారు. దాని అర్థం విన్న అతిథులు అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు.
అందులో వాడిన మొదటి మాట – ‘‘మైత్రీం భజతా అఖిలహృజ్జేత్రిమ్..’’. అంటే ప్రపంచ ప్రజలు యుద్ధాలు, స్పర్థలు, కక్షలు కార్పణ్యాలు వదిలి అందరితో స్నేహంగా ఉండాలి..అని. అపకారం చేసినవాడు, తప్పు చేసినవాడు, ... అది దృష్టిలోపెట్టుకుని నీవు ఎవరినీ దూరం చేసుకోకు. అందరికీ మంచి చేసుకుంటూ పోవడమే నీ కర్తవ్యం. అందరూ వద్ధిలోకి రావాలని కోరుకో...అన్న అర్థంలో ఉందా గీతం. సర్వేజనా సుఖినోభవంతు.
అంతే తప్ప ఏదో తప్పు చేసాడని వాడిని ఎలా దూరం చేద్దాం, ఎలా పక్కన పెడదాం... అని ఆలోచిస్తూ నీ సమయం, నీ జీవితం వృథా చేసుకోకు. వాడి తప్పు వాడు తెలుసుకోవాలని త్రికరణ శుద్ధిగా కోరుకో. అన్యాపదేశంగా వాడి తప్పు వాడు తెలుసుకునేటట్లు చేయి. వాడు మారాడా అదృష్టవంతుడు. నువ్వు మాత్రం వాడు తప్పు చేసాడని వాడికి అపకారం చేసే ప్రయత్నంలో నువ్వు పాడయి పోవద్దు. పాపాలను కడగడం, తప్పులను క్షమించడమే తప్ప అవతలివాడు మనపట్ల తప్పుగా వ్యవహరించాడు కాబట్టి మనం దానికి ప్రతిగా కక్ష తీర్చుకుని వాడికి బుద్ధి చెబుదాం... వంటి ధోరణి మహోన్నతమైన వ్యక్తుల జీవితాల్లో ఎక్కడా కనిపించదు.
అయోథ్యా నగరవాసులు రాముడి గురించి చెబుతూ ...‘‘కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా...’’ అంటారు. ఓ దశరథ మహారాజా! నీ కొడుకెంత గొప్పవాడో తెలుసా! కావాలని ఉపకారం చేసినవాడినే కాదు, అనుకోకుండా ఉపకారం చేసినవాడిని కూడా రాముడు గుర్తుపెట్టుకుని పదేపదే తలుచుకుంటుంటాడు. అంత చిన్నవాటిని కూడా మర్చిపోడు. సముద్రం ఇవతల నిలబడి అవతలి వైపు లక్ష్యాన్ని తన బాణాలతో ఛేదించగల సమర్ధుడే అయినా రాముడు నూరు అపకారాలు చేసిన వాడిని కూడా శిక్షించకుండా, మరో అవకాశం ఇద్దామని, వాడు మారడానికి వీలు కల్పిద్దామంటూ ఓపికపట్టగల సమర్థుడు.
ఉపకారం చేసిన వాడినయితే పదేపదే తలచుకుని మురిసిపోతుంటాడు... అదయ్యా రాముడంటే... అటువంటివాడు వాడు మాకు యువరాజుగా కావాలి.’’ అన్నారు ముక్తకంఠంతో.. అందుకే రాముడు మహాత్ముడయ్యాడు. ఇదీ భారతదేశ సాంస్కృతిక వైభవం. దానికి మనం వారసులం. ఉపకారికి ఉపకారం చేయడం సర్వసాధారణంగా లోకరీతిగా భావిస్తూ, అపకారం చేసిన వాడు కూడా తన తప్పు తెలుసుకుని మారడానికి వీలు కల్పించేవిధంగా పగబట్టకుండా, అతనికి మళ్ళీ అపకారం తలబెట్టకుండా అతనికి అవసరమయినప్పుడు ఉపకారం చేయాలని మన పెద్దలు మనకు చెబుతుంటారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు