
పర్యావరణ మార్పుల రీత్యా ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ జరిగిన సమావేశం అది. తీరా పన్నెండు రోజుల పైగా చర్చోపచర్చల తర్వాత సాధించినది మాత్రం అతి స్వల్పం. అజర్‌బైజాన్‌లోని బైకూలో తాజాగా ముగిసిన ఐరాస 29వ పర్యావరణ సదస్సు (కాన్ఫడరేషన్ ఆఫ్ పార్టీస్– కాప్29), అక్కడ చేసిన తూతూమంత్రపు తీర్మానం పట్ల బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశాల మధ్య అభిప్రాయ భేదాలను పోగొట్టి, మధ్యేమార్గ సాధన కోసం నిర్ణీత షెడ్యూల్‌కు మించి అదనంగా మరో రెండు రాత్రుల పాటు బాకూలో సంప్రతింపులను పొడిగించారు.
అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. చివరకు ఓ ‘దిశానిర్దేశ ప్రణాళిక’ రూపకల్పనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇన్నాళ్ళుగా కాలుష్యానికి కారణమవుతూ పురోగమించిన అభివృద్ధి చెందిన దేశాలు అలా చేతులు దులిపేసుకొని హమ్మయ్య అనుకున్నాయి. కాలుష్య బాధిత వర్ధమాన దేశాల్లో సహజంగానే ఇది నిరాశ నింపింది. పర్యావరణ మార్పులతో సతమతమవుతున్న పుడమి యథాపూర్వస్థితిలో ప్రమాదం అంచునే మిగిలిపోయింది. భారత్, నైజీరియా, బొలీవియా వగైరా బృందంతో కూడిన వర్ధమాన దేశాలు తాజా ‘కాప్–29’ సదస్సు పట్ల పెదవి విరుస్తున్నది అందుకే!
ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా భూతాపోన్నతిని నియంత్రిస్తూ, పర్యావరణ అనుకూల విధానాలకు మారిపోవాలంటే వర్ధమాన ప్రపంచానికి 2035 నాటికి ఏటా 1.3 లక్షల కోట్ల డాలర్లు అవసరమని స్వతంత్ర నిపుణుల అంచనా. కానీ, విచ్చలవిడి పారిశ్రామికీకరణతో అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తూ, 2035 నాటికి ఏటా కేవలం 300 బిలియన్ డాలర్లు మాత్రం ఇస్తామంటూ ఒప్పందం చేశాయి. అడిగిన మొత్తంలో కేవలం 20 శాతమే అది. ఆ అరకొర నిధులతో, అదీ అపరిమితమైన ఆలస్యంతో ఉపయోగం ఉండదు.
ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న సముద్రమట్టాలు, దరిమిలా ముంచెత్తిన ఆర్థిక భారంతో మునిగిపోతున్న పేద దేశాలు తాజా బాకూ సదస్సులో తీర్మానించిన ఈ రకమైన అరకొర పర్యావరణ నిధి తమ పాలిట మరణ శాసనంగా అభివర్ణిస్తున్నాయి. పైగా, నిధి విషయంలో ధనిక ప్రపంచ ప్రభుత్వాలు బాధ్యతను తమ భుజం మీద వేసుకోకుండా ప్రైవేట్ సంస్థలు, అంతర్జాతీయ ఋణదాతల మీద ఆధారపడడం మరీ ఘోరం. ఈ అంశాలే ఇప్పుడు రచ్చకు దారి తీస్తున్నాయి.
పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణమైన ధనిక దేశాలు బెదిరింపులు, అధికార ప్రదర్శనలతో బాధిత దేశాల మెడలు వంచుతున్నాయి. పస లేని ఒప్పందాలకు తలలూపేలా చేస్తున్నాయి. ఇది చేదు నిజం. బైకూ సదస్సులోనూ అదే జరిగింది. శిలాజ ఇంధన దేశాల ప్రయోజనాల్ని కాపాడేందుకు తెర వెనుక సాగిన లాబీయింగ్, తీర్మానాల్లో ఆఖరి నిమిషంలో సాగిన మార్పులు చేర్పులే అందుకు నిదర్శనం.
అభివృద్ధి చెందిన దేశాలు ఇలా తమ నైతిక, చారిత్రక కర్తవ్యాల విషయంలో వెనక ముందులాడుతూ, చివరకు విసురుతున్న చాలీచాలని రొట్టె ముక్కలకే బీద దేశాలు తలలూపాల్సి వస్తోంది. అలాగని కాప్ సదస్సులు వట్టి వృథా అని కొట్టిపారేయలేం. ఎందుకంటే, పర్యావరణ ప్రమాదంపై పేద దేశాలు కనీసం తమ వాణిని అయినా వినిపించడానికి మిగిలింది ఇదొకటే వేదిక. కాదూ... కూడదంటే అసలుకే మోసం వస్తుందనీ, మొత్తం ‘కాప్’ ప్రక్రియే కుప్పకూలుతుందనీ ఈ బీద ప్రపంచపు భయం.
మరోపక్క పర్యావరణ సంక్షోభమనేది వట్టి బూటకమని వాదించే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బైకూ ‘కాప్’ సదస్సులో ఇచ్చిన హామీలకు అగ్ర రాజ్యం భవిష్యత్తులో ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ మాటకొస్తే అధ్యక్షుడు బైడెన్ హయాంలోనూ పర్యావరణ నిధులకై ప్రభుత్వ అభ్యర్థనల్ని అమెరికన్ కాంగ్రెస్ నెరవేర్చనేలేదు.
క్లిష్టమైన పరిస్థితుల్లో, అధ్యక్ష స్థానంలోని అజర్‌బైజాన్ సహా అనేక ప్రధాన దేశాల అంతంత మాత్రపు ముందస్తు కసరత్తు నడుమ కాప్29 అడుగులు వేసింది. అయినా ఈ సదస్సులో అసలేమీ జరగలేదని అనుకోలేం. ఏటా 100 బిలియన్ డాలర్ల మేర నిధులు సమకూరు స్తామని సంపన్న దేశాలు గతంలో వాగ్దానం చేశాయి.
2020 నుంచి నిలబెట్టుకోవాల్సిన మాటను ఆలస్యంగా 2022 నుంచి అమలు చేస్తున్నాయి. అదీ 2025తో ముగిసిపోనుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మొత్తాన్ని 2035 నాటికి 300 బిలియన్లకు పెంచడం ఒకింత విజయమే. కాకపోతే, పారదర్శకత లేమి, అందరినీ కలుపుకొనిపోలేకపోవడం తాజా ఒప్పందపు చట్టబద్ధతను తక్కువ చేస్తున్నాయి.
అధిక పారిశ్రామికీకరణతో లాభపడ్డ సంపన్న దేశాలు ఏళ్ళ తరబడి మీనమేషాలు లెక్కపెడు తుండడమే పెనుశాపమవుతోంది. అందువల్లే భూతాపోన్నతిని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించ రానివ్వరాదన్న ప్యారిస్ ఒప్పంద లక్ష్యం వట్టి కలగానే మిగిలింది. అసలు ఇదే పద్ధతిలో ముందుకు వెళితే కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో కొత్త మాట దేవుడెరుగు... వర్తమాన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నప్పటికీ భూతాపం 2.7 డిగ్రీల మేర పెరుగుతుందట.
అది పర్యావరణ సంక్షోభానికి దారి తీస్తుందని ఐరాస హెచ్చరిక. అది చెవికెక్కించుకొని, వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరిగే కాప్30 నాటికైనా సంపన్న దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నాలు సాగించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని, పర్యావరణ న్యాయం వాస్తవమయ్యేలా చూస్తేనే మానవాళికి మేలు జరుగుతుంది.
అదే సమయంలో భారత్ సహా వర్ధమాన ప్రపంచం ఈ పర్యావరణ మార్పు సవాలును సమర్ధంగా ఎదుర్కొనేందుకు తమవైన వ్యూహాలపై దృష్టి పెట్టడం మంచిది. థర్మల్ విద్యుత్‌పై అతిగా ఆధారపడడం లాంటివి మానుకోవడమూ మంచిది. లేదంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment