Baku
-
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
పెట్టుబడుల కోసం పాక్ ‘బెల్లీ డ్యాన్స్’
-
పెట్టుబడుల కోసం పాక్ ‘బెల్లీ డ్యాన్స్’
ఇస్లామాబాద్ : రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చేసిన ఓ ప్రయత్నం తీవ్ర విమర్శలకు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన సర్హాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎస్‌సీసీఐ) ఓ పెట్టుబడి సదస్సును అజర్ బైజాన్ దేశ రాజధాని బకూలో నిర్వహించింది. ఖైబర్ పక్తుంఖ్వా పెట్టుబడి అవకాశాల సదస్సు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4 నుంచి 8 మధ్య జరిగింది. అయితే అక్కడికి వచ్చిన పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమంలో బెల్లీ డాన్స్‌ను ఏర్పాటు చేసింది. దీనిని పాక్ జర్నలిస్టు ఒకరు.. వీడియోతో సహా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. పెట్టుబడిదారులను బెల్లీ డాన్సులతో ఆకర్షించడానికి ప్రయత్నించినపుడు... అనే శీర్షికతో ఈ వీడియోను అప్లోడ్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి ఇంత దిగజారాలా? అని సోషల్ మీడియా వేదికగా పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. నయా పాకిస్తాన్ అని తరచూ ఉద్భోద చేసే మన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దృష్టిలో ‘నయా పాకిస్తాన్’ అంటే ఇదే కాబోలు అని ఓ పాక్ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించగా.. ఎందుకు ఆ పెట్టుబడుల సదస్సు ఇక్కడ ఉన్న బర్రెలను, గొర్రెలను అమ్ముకోవడానికా.. అంతకన్నా ఇక్కడ ఏం లేదు అని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి పాకిస్తాన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేకన్నా కొత్తగా ఆలోచిస్తే బాగుండేది అని, అయినా ఈ సదస్సులో బెల్లీ డ్యాన్స్ మాత్రమే హైలెట్ కాబోలు అని వ్యంగ్యంగా కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న సంగతి తెలిసిందే. పాక్‌ను ఆదుకోవడానికి చైనా, సౌదీ ఆరేబియా, యూఏఈలు బెయిల్ అవుట్ ప్యాకేజీలు ప్రకటించినా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. గ్యాస్, చమురు ధరలు, విద్యుత్ బిల్లులు రోజురోజుకు పెరిగిపోయి సామాన్యునిపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చదవండి : పాక్‌లో చైనా పెట్టుబడులు -
రికియార్డోకు టైటిల్
బాకు (అజర్బైజాన్): రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ డానియల్ రికియార్డో అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును రికియార్డో రెండు గంటల 3 నిమిషాల 55.570 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజి షన్’తో రేసును ప్రారంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బొటాస్ (మెర్సిడెస్), స్ట్రాల్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్ ఒకాన్ ఆరో స్థానాన్ని పొందాడు. -
బాకులో చెస్ ఒలింపియాడ్
-
సముద్రంలో కూలిన విమానం
66 మంది దుర్మరణం * పారిస్ నుంచి కెరో వెళ్తుండగా ప్రమాదం * గ్రీస్ తీరంలో శకలాలు * ఉగ్రవాదుల దాడితో కూలి ఉండొచ్చని అనుమానం! కైరో: ఈజిప్టుఎయిర్కు చెందిన విమానం గురువారం మధ్యధరా సముద్రంలో కూలిన దుర్ఘటనలో 66 మంది మృతిచెందారు. వీరిలో ఒక చిన్నారి సహా 56 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలిన ‘ఎంఎస్ 804’ శకలాలను ఆగ్నేయ ఏజియన్ సముద్రంలో గ్రీస్‌కు చెందిన కర్పతోస్ ద్వీపం వద్ద.. కనుగొన్నామని ఈజిప్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ పౌరవిమానయాన శాఖకు సమాచారమిచ్చింది. విమానం సాంకేతిక లోపం వల్ల కాకుండా ఉగ్రవాద దాడి వల్లే కూలి ఉండవచ్చని ఈజిప్టు పౌర విమానయాన మంత్రి ఫాతీ చెప్పారు. ప్రమాదం గురించి ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు. మిగిలిన విమాన శకలాల కోసం గ్రీసు అధికారులతో కలిసి ఈజిప్టు విచారణ బృందాలు గాలిస్తున్నాయి. విమానం గురువారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఈజిప్టు గగనతలంలోకి ప్రవేశించిన కాసేపటికే 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్‌తో సంబంధాల్ని కోల్పోయింది. అలెగ్జాండ్రియా నగరానికి సమీపంలో చివరిసారిగా రాడార్‌పై కనిపించింది. గల్లంతవడానికి ముందు 22వేల అడుగులు కిందికి దిగిందని, 10 వేల అడుగుల ఎత్తులో రాడార్‌తో సంబంధం కోల్పోయిందని గ్రీస్ రక్షణ మంత్రి పానోస్ కొమెనోస్ తెలిపారు. ప్రమాదానికి ముందు పైలట్‌తో ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది మాట్లాడారని, ఆ సమయంలో అంతా సవ్యంగానే ఉందని గ్రీస్ విమానయాన శాఖ తెలిపింది. మృతుల్లో ఈజిప్టుకు చెందిన 30 మంది, 15 మంది ఫ్రాన్స్ దేశీయులు ఉండగా మిగిలినవారు ఇరాక్, బ్రిటన్, బెల్జియం, కువైట్, సౌదీఅరేబియా, సుడాన్, కెనడా వాసులు. కూలిన కార్గో విమానం: ఏడుగురి మృతి బాకు: అజార్బైజాన్ సరుకు రవాణా విమానం బుధవారం అఫ్గానిస్తాన్‌లో కూలిపోయింది. ఏడుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆంటనోవ్-12 విమానం సదరన్ హెల్మాద్ రాష్ట్రంలోని డ్వైర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.