సముద్రంలో కూలిన విమానం
66 మంది దుర్మరణం
* పారిస్ నుంచి కెరో వెళ్తుండగా ప్రమాదం
* గ్రీస్ తీరంలో శకలాలు
* ఉగ్రవాదుల దాడితో కూలి ఉండొచ్చని అనుమానం!
కైరో: ఈజిప్టుఎయిర్‌కు చెందిన విమానం గురువారం మధ్యధరా సముద్రంలో కూలిన దుర్ఘటనలో 66 మంది మృతిచెందారు. వీరిలో ఒక చిన్నారి సహా 56 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలిన ‘ఎంఎస్ 804’ శకలాలను ఆగ్నేయ ఏజియన్ సముద్రంలో గ్రీస్‌కు చెందిన కర్పతోస్ ద్వీపం వద్ద.. కనుగొన్నామని ఈజిప్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ పౌరవిమానయాన శాఖకు సమాచారమిచ్చింది. విమానం సాంకేతిక లోపం వల్ల కాకుండా ఉగ్రవాద దాడి వల్లే కూలి ఉండవచ్చని ఈజిప్టు పౌర విమానయాన మంత్రి ఫాతీ చెప్పారు. ప్రమాదం గురించి ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు.
మిగిలిన విమాన శకలాల కోసం గ్రీసు అధికారులతో కలిసి ఈజిప్టు విచారణ బృందాలు గాలిస్తున్నాయి. విమానం గురువారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఈజిప్టు గగనతలంలోకి ప్రవేశించిన కాసేపటికే 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్‌తో సంబంధాల్ని కోల్పోయింది. అలెగ్జాండ్రియా నగరానికి సమీపంలో చివరిసారిగా రాడార్‌పై కనిపించింది. గల్లంతవడానికి ముందు 22వేల అడుగులు కిందికి దిగిందని, 10 వేల అడుగుల ఎత్తులో రాడార్‌తో సంబంధం కోల్పోయిందని గ్రీస్ రక్షణ మంత్రి పానోస్ కొమెనోస్ తెలిపారు.
ప్రమాదానికి ముందు పైలట్‌తో ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది మాట్లాడారని, ఆ సమయంలో అంతా సవ్యంగానే ఉందని గ్రీస్ విమానయాన శాఖ తెలిపింది. మృతుల్లో ఈజిప్టుకు చెందిన 30 మంది, 15 మంది ఫ్రాన్స్ దేశీయులు ఉండగా మిగిలినవారు ఇరాక్, బ్రిటన్, బెల్జియం, కువైట్, సౌదీఅరేబియా, సుడాన్, కెనడా వాసులు.
కూలిన కార్గో విమానం: ఏడుగురి మృతి
బాకు: అజార్‌బైజాన్ సరుకు రవాణా విమానం బుధవారం అఫ్గానిస్తాన్‌లో కూలిపోయింది. ఏడుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆంటనోవ్-12 విమానం సదరన్ హెల్మాద్ రాష్ట్రంలోని డ్వైర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.