
ల్యాండవుతూ తలకిందులు
మంచు, విపరీతమైన గాలుల వల్లే
80 మంది ప్రయాణికులూ సురక్షితం
18 మందికి గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం
టొరంటో: కెనడాలో టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ విమానం రన్‌వేపై దిగుతూ ఒక్కసారిగా బోల్తా పడింది! మంచు తుపాను, బలమైన గాలుల ధాటికి ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 80 మంది అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే 18 మంది గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం బోల్తా పడ్డ తీరు, అందులోంచి ప్రయాణికులు సురక్షితంగా బయట కొస్తున్న వీడియోలు, అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు సిబ్బంది నురగ స్ప్రే చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రమాదంతో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.
ప్రతికూల వాతావరణం...
వాతావరణ ఇబ్బందులతో పియర్సన్ విమానాశ్రయంలో కొన్ని రోజులుగా విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. బుధ, ఆదివారాల్లో రెండు తుపాన్లు నగరాన్ని 50 సెంటీమీటర్ల మంచుతో కప్పేశాయి. వారాంతంలోనైతే విమానాశ్రయంలో 22 సెంటీమీటర్లకు పైగా మంచు కురిసింది. ప్రమాద సమయంలోనూ తేలికపాటి మంచు కురిసినట్లు సమాచారం.
ప్రాణాలతో ఎలా బయటపడ్డరంటే?
విమానం పరిమాణం, సీట్ బెల్ట్, ఇంజనీరింగ్ నైపుణ్యం తదితరాలే టొరంటో ప్రమాదంలో ప్రయాణికులను కాపాడినట్టు నిపుణులు చెబుతున్నారు. విమానాలు తలకిందులవడం చాలా అరుదు. అలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొనేలా డెల్టా విమానాన్ని రూపొందించారు. విమానంలోని సీట్లు గురుత్వాకర్షణ శక్తికి పదహారు రెట్లు ఎక్కువ శక్తిని కూడా తట్టుకునేలా ఉంటాయి. విమానం బోల్తా పడ్డా ప్రయాణికులు మాత్రం స్థిరంగా ఉండేలా, వారిని కట్టిపడేసేలా సీట్లను రూపొందిస్తారు.
అందుకే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విధిగా సీటు బెల్టులు ధరించేలా చూస్తారు. విమానం తలకిందులయితే రెక్కలు, తోకభాగం మాత్రమే విచ్ఛిన్నమయ్యేలా నిర్మాణం ఉంటుంది. ఇలాంటప్పుడు విమాన సిబ్బంది పాత్ర చాలా కీలకం. ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు వీలుగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా వారికి శిక్షణ ఇస్తారు. సాధారణ సమయాల్లో ఫ్లైట్ అటెండెంట్లు మాత్రమే అయినా ఇలాంటప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారు. విమానం కూలగానే ప్రయాణికులను సిబ్బంది హుటాహుటిన ఖాళీ చేయిస్తున్న దృశ్యాలు దీనికి నిదర్శనం. అత్యవసర సిబ్బంది కూడా క్షణాలపై స్పందించారు. ఆలస్యం చేయకుండా మంటలను ఆర్పేసి పెను ప్రమాదాన్ని నివారించారు.
సైజూ కలిసొచ్చింది...
ప్రమాదానికి గురైన బొంబార్డియర్ సీఆర్‌జే 900 విమానం చిన్నగా ఉంటుంది. ప్రయాణికులు ప్రా ణాలతో బయట పడేందుకు ఇది కూడా కారణమే. కేబిన్ ఎత్తు కేవలం ఆరడుగులే. దాంతో బోల్తా పడ్డా ప్రయాణికులు ఎక్కువ దూరం పడిపోరు.
Comments
Please login to add a commentAdd a comment