నేపాల్‌లో విమాన ప్రమాదం | Nepal Plane Crash: 18 Killed As Plane Slips Off Runway And Crashes At Kathmandu Airport, See Details | Sakshi
Sakshi News home page

Nepal Plane Crash: నేపాల్‌లో విమాన ప్రమాదం

Published Thu, Jul 25 2024 5:41 AM | Last Updated on Thu, Jul 25 2024 1:25 PM

Nepal plane crash: Plane slips off runway and crashes at Kathmandu airport

కఠ్మాండు ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లకే కూలిన విమానం 

18 మంది మృతి 

పైలెట్‌కు తీవ్ర గాయాలు 

కఠ్మాండు: హిమాలయాల నేల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్‌ విమానం కుప్పకూలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారిసహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పైలట్‌ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన పైలట్‌ మనీశ్‌ రత్న శాక్యకు కంటి, వెన్నుముక శస్త్రచికిత్స చేస్తున్నారు. 

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌ నుంచి పొఖారా సిటీకి బయల్దేరేందుకు టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లకే బంబార్డియర్‌ తయారీ సీఆర్‌జే–200 రకం విమానం కూలింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్‌ అయ్యాక ఎడమ వైపుగా పయనించాల్సిన విమానం దిశను హఠాత్తుగా కుడి వైపునకు తిప్పడంతో స్థిరత్వం కోల్పోయి నేలరాలిందని ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ జగన్నాథ్‌ నిరౌలా ‘బీబీసీ న్యూస్‌ నేపాలీ’ వార్తాసంస్థతో చెప్పారు.

 కూలిన విమానంలో సాధారణ ప్రయాణికులెవరూ లేరుగానీ పైలెట్, సాంకేతిక సిబ్బంది, ఇద్దరూ విమాన సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. విమానం రన్‌ వే మీద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగి్నమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేశారు. 15 మంది ఘటనాస్థలిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ మరణించారు. ఘటనాస్థలిని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి సందర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.  

టేబుల్‌ టాప్‌ రన్‌వే 
చుట్టూతా ఉండే హిమాలయ పర్వతాల మధ్య నుంచి దిగుతూ నేపాల్‌ ఎయిర్‌పోర్ట్‌ల గుండా రాకపోకలు సాగించడం ఇక్కడి పైలెట్లకు కత్తిమీద సామే. పర్వతప్రాంతం కావడంతో ఇక్కడి గాలి వీచే దిశ, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయి. తక్కువ ఎత్తులో నడపడం సవాల్‌తో కూడిన పని. అందులోనూ  కఠ్మాండు విమానాశ్రయంలో టేబుల్‌ టాప్‌ రన్‌వే ఉంది. అంటే రన్‌వే దాటి ఏమాత్రం ముందుకు వెళ్లినా లోయలో పడే ప్రమాదముంది. 

రన్‌వేకు ఒక వైపు గానీ, రెండు వైపులా గానీ లోయ లేదా ఏటవాలు భూమి టేబుల్‌ టాప్‌ రన్‌వేగా పిలుస్తారు. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్‌ ఖచి్చతత్వంతో చేయకుండా ప్రమాదమే. బుధవారం జరిగిన ప్రమాదానికి ఈ రకం రన్‌వే కూడా ఒక కారణమని వార్తలొచ్చాయి. భారత్‌లో సిమ్లా, కాలికట్, మంగళూరు, లెంగ్‌పుయ్‌ (మిజోరం), పాక్యోంగ్‌ (సిక్కిం)లలో ఈ టేబుల్‌–టాప్‌ రన్‌వేలు ఉన్నాయి. వీటిలో కేరళ, మంగళూరులో గతంలో పెద్ద విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement