Azerbaijani
-
అజర్‌బైజాన్‌తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్ ఓపెన్ విభాగంలో భారత పురుషుల జట్టు నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. అజర్బైజాన్ జట్టుతో మంగళవారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌ను భారత జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆధిబన్–అర్కాదిజ్; కృష్ణన్ శశికిరణ్–గాదిర్ గుసెనోవ్; సూర్యశేఖర గంగూలీ–ఎల్తాజ్ సఫారీలి; సేతురామన్–అబాసోవ్ నిజాత్ల మధ్య జరిగిన నాలుగు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఏడో రౌండ్ తర్వాత భారత్ పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 12 పాయింట్లతో రష్యా అగ్రస్థానంలో... 11 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉన్నాయి. మహిళల విభాగంలో భారత జట్టు మూడో విజయం సాధించింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4–0తో నెగ్గింది. అబ్రామ్యాన్ తతేవ్‌పై ఇషా కరవాడే; కాటరీనాపై సౌమ్య స్వామినాథన్; యిప్ కారిస్సాపై పద్మిని రౌత్; సబీనాపై భక్తి కులకర్ణి గెలిచారు. ఏడో రౌండ్ తర్వాత భారత్ ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. -
సముద్రంలో కూలిన విమానం
66 మంది దుర్మరణం * పారిస్ నుంచి కెరో వెళ్తుండగా ప్రమాదం * గ్రీస్ తీరంలో శకలాలు * ఉగ్రవాదుల దాడితో కూలి ఉండొచ్చని అనుమానం! కైరో: ఈజిప్టుఎయిర్కు చెందిన విమానం గురువారం మధ్యధరా సముద్రంలో కూలిన దుర్ఘటనలో 66 మంది మృతిచెందారు. వీరిలో ఒక చిన్నారి సహా 56 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలిన ‘ఎంఎస్ 804’ శకలాలను ఆగ్నేయ ఏజియన్ సముద్రంలో గ్రీస్‌కు చెందిన కర్పతోస్ ద్వీపం వద్ద.. కనుగొన్నామని ఈజిప్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ పౌరవిమానయాన శాఖకు సమాచారమిచ్చింది. విమానం సాంకేతిక లోపం వల్ల కాకుండా ఉగ్రవాద దాడి వల్లే కూలి ఉండవచ్చని ఈజిప్టు పౌర విమానయాన మంత్రి ఫాతీ చెప్పారు. ప్రమాదం గురించి ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామన్నారు. మిగిలిన విమాన శకలాల కోసం గ్రీసు అధికారులతో కలిసి ఈజిప్టు విచారణ బృందాలు గాలిస్తున్నాయి. విమానం గురువారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఈజిప్టు గగనతలంలోకి ప్రవేశించిన కాసేపటికే 37 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్‌తో సంబంధాల్ని కోల్పోయింది. అలెగ్జాండ్రియా నగరానికి సమీపంలో చివరిసారిగా రాడార్‌పై కనిపించింది. గల్లంతవడానికి ముందు 22వేల అడుగులు కిందికి దిగిందని, 10 వేల అడుగుల ఎత్తులో రాడార్‌తో సంబంధం కోల్పోయిందని గ్రీస్ రక్షణ మంత్రి పానోస్ కొమెనోస్ తెలిపారు. ప్రమాదానికి ముందు పైలట్‌తో ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది మాట్లాడారని, ఆ సమయంలో అంతా సవ్యంగానే ఉందని గ్రీస్ విమానయాన శాఖ తెలిపింది. మృతుల్లో ఈజిప్టుకు చెందిన 30 మంది, 15 మంది ఫ్రాన్స్ దేశీయులు ఉండగా మిగిలినవారు ఇరాక్, బ్రిటన్, బెల్జియం, కువైట్, సౌదీఅరేబియా, సుడాన్, కెనడా వాసులు. కూలిన కార్గో విమానం: ఏడుగురి మృతి బాకు: అజార్బైజాన్ సరుకు రవాణా విమానం బుధవారం అఫ్గానిస్తాన్‌లో కూలిపోయింది. ఏడుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆంటనోవ్-12 విమానం సదరన్ హెల్మాద్ రాష్ట్రంలోని డ్వైర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
అందమైన కావ్యం
అజర్బైజాన్ పాక్షికంగా తూర్పు యూరప్‌లోనూ, పశ్చిమ ఆసియాలోనూ ఉన్న దేశం అజర్బైజాన్. 1920లో సోవియెట్ యూనియన్‌లో విలీనమైన ఈ దేశం... సోవియెట్ పతనానికి ముందు 1991 ఆగస్ట్ 30న స్వతంత్రదేశంగా అవతరించింది. 95 శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్బైజాన్... ఆర్థికాభివృద్ధి, అక్షరాస్యతలో ఉన్నత స్థానంలో ఉంది. ఆధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాల్లో దీనిది రెండో స్థానం. పురాతన అశ్వజాతికి చెందిన కారాబాక్ గుర్రం వేగానికి, ఆవేశానికి, సౌందర్యానికి పేరుగాంచింది. ఇది అజర్బైజాన్ జాతీయ జంతువు. అధికార భాష అయిన అజర్బైజానీతో పాటు డజన్ వరకు స్థానిక భాషలు ఈ దేశంలో మాట్లాడతారు. జీవవైవిధ్యంలో అజర్బైజాన్ ముందు వరుసలో ఉంది. 106 జాతుల జంతువులు, 97 జాతుల చేపలు, 363 జాతుల పక్షులు ఈ దేశంలో ఉన్నాయి. బోలెడన్ని పురాతన నదులు, సరస్సులు ఉన్నాయి. ‘కురా’ ‘ఆరిస్’ నదులు అన్నిటికంటే ముఖ్యమైనవి. ఆయిల్, గ్యాస్, బంగారం, ఇనుము, టైటానియం, మాంగనీస్... మొదలైన నిధులు ఉన్న సుసంపన్నమైన దేశం అజర్బైజాన్. దేశంలో 54 శాతం వ్యవసాయ భూములే. వాటిలో చెరకు, పత్తి, పొగాకు మొదలైనవి పండిస్తారు. పాల సంబంధిత, మద్య ఉత్పత్తులు ఈ దేశ ప్రధాన ఉత్పత్తులు. విలువైన వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే తయారుచేసుకునే ప్రయత్నాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అజర్బైజాన్ 1991లో స్వతంత్రదేశంగా అవతరించిన తరువాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇస్లామిక్ డెవెలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ డెవెలప్మెంట్ బ్యాంకు మొదలైన వాటిలో సభ్యత్వం తీసుకుని ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఒకప్పుడు అజర్బైజాన్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేది. సోవియెట్ యూనియన్ పతనం, ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో పర్యాటక రంగం దెబ్బతిని ఆకర్షణ కోల్పోయింది. 2000 సంవత్సరం నుంచి మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. పర్యాటక ఆదాయం పెరిగింది. అందుకే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భౌగోళిక విశిష్టత, అసాధారణ ప్రకృతి సంపదకు తోడు కళ, చారిత్రక, సాంస్కృతిక సంపద కూడా ఈ అగ్నితేజ దేశానికి అరుదైన ఆభరణాలు! టాప్ 10 1. అజర్బైజాన్ రాజ్యాంగం ఏ మతాన్నీ ‘అధికార మతం’గా ప్రకటించలేదు. 2. మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ అజర్బైజాన్ రాజధాని ‘బకూ’లో జన్మించారు. 3. చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల అజర్‌బైజాన్‌కు ‘ద ల్యాండ్ ఆఫ్ ఫైర్’ అని పేరు. 4. అజర్బైజాన్ అధికార నామం ‘రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్’. 5. అజర్‌బైజానీ భాషలో ఎన్నో మాండలికాలు ఉన్నాయి. 6. రాజధాని ‘బకూ’కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గొబుస్తాన్ నేషనల్ పార్క్’లో వందలాది రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. 7. దేశంలో నూతన సంవత్సర వేడుకలను ‘నౌరోజ్’ పేరుతో జరుపుకుంటారు. 8. పరిపాలనా సౌలభ్యం కోసం అజర్‌బైజాన్‌ను పది ‘ఎకనామిక్ రీజన్’లుగా విభజించారు. 9. ‘కురా’ అనేది అజర్బైజాన్లో పొడవైన నది. 10. అజర్బైజాన్ ప్రజల ప్రీతిపాత్రమైన పానీయం ‘టీ’. -
20 ఏళ్ల తర్వాత రగిలిన చిచ్చు
యెరెవన్: మరోసారి ఆర్మేనియా, అజర్‌బైజానీ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 20 ఏళ్లు దాటిని తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు గుండా ఇరు సైనికులు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో రెండు దేశాల సైనికుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. హెలికాప్టర్లు, ట్యాంకర్లు, రాకెట్ లాంఛర్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 18మంది ఆర్మీనియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 35మందికి పైగా గాయాలపాలయ్యారు. 1994 తర్వాత ఆ రెండు దేశాల మధ్య ఇదే అతిపెద్ద సంఘర్షణ. నిత్యం ఘర్షణకు తావిచ్చే కరాబక్ జోన్ వద్దే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మేనియన్ అధికారులు చెప్పారు.