environment conference
-
సాధించినదేమిటి?
పర్యావరణ మార్పుల రీత్యా ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవేళ జరిగిన సమావేశం అది. తీరా పన్నెండు రోజుల పైగా చర్చోపచర్చల తర్వాత సాధించినది మాత్రం అతి స్వల్పం. అజర్‌బైజాన్‌లోని బైకూలో తాజాగా ముగిసిన ఐరాస 29వ పర్యావరణ సదస్సు (కాన్ఫడరేషన్ ఆఫ్ పార్టీస్– కాప్29), అక్కడ చేసిన తూతూమంత్రపు తీర్మానం పట్ల బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశాల మధ్య అభిప్రాయ భేదాలను పోగొట్టి, మధ్యేమార్గ సాధన కోసం నిర్ణీత షెడ్యూల్‌కు మించి అదనంగా మరో రెండు రాత్రుల పాటు బాకూలో సంప్రతింపులను పొడిగించారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. చివరకు ఓ ‘దిశానిర్దేశ ప్రణాళిక’ రూపకల్పనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇన్నాళ్ళుగా కాలుష్యానికి కారణమవుతూ పురోగమించిన అభివృద్ధి చెందిన దేశాలు అలా చేతులు దులిపేసుకొని హమ్మయ్య అనుకున్నాయి. కాలుష్య బాధిత వర్ధమాన దేశాల్లో సహజంగానే ఇది నిరాశ నింపింది. పర్యావరణ మార్పులతో సతమతమవుతున్న పుడమి యథాపూర్వస్థితిలో ప్రమాదం అంచునే మిగిలిపోయింది. భారత్, నైజీరియా, బొలీవియా వగైరా బృందంతో కూడిన వర్ధమాన దేశాలు తాజా ‘కాప్–29’ సదస్సు పట్ల పెదవి విరుస్తున్నది అందుకే! ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా భూతాపోన్నతిని నియంత్రిస్తూ, పర్యావరణ అనుకూల విధానాలకు మారిపోవాలంటే వర్ధమాన ప్రపంచానికి 2035 నాటికి ఏటా 1.3 లక్షల కోట్ల డాలర్లు అవసరమని స్వతంత్ర నిపుణుల అంచనా. కానీ, విచ్చలవిడి పారిశ్రామికీకరణతో అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తూ, 2035 నాటికి ఏటా కేవలం 300 బిలియన్ డాలర్లు మాత్రం ఇస్తామంటూ ఒప్పందం చేశాయి. అడిగిన మొత్తంలో కేవలం 20 శాతమే అది. ఆ అరకొర నిధులతో, అదీ అపరిమితమైన ఆలస్యంతో ఉపయోగం ఉండదు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న సముద్రమట్టాలు, దరిమిలా ముంచెత్తిన ఆర్థిక భారంతో మునిగిపోతున్న పేద దేశాలు తాజా బాకూ సదస్సులో తీర్మానించిన ఈ రకమైన అరకొర పర్యావరణ నిధి తమ పాలిట మరణ శాసనంగా అభివర్ణిస్తున్నాయి. పైగా, నిధి విషయంలో ధనిక ప్రపంచ ప్రభుత్వాలు బాధ్యతను తమ భుజం మీద వేసుకోకుండా ప్రైవేట్ సంస్థలు, అంతర్జాతీయ ఋణదాతల మీద ఆధారపడడం మరీ ఘోరం. ఈ అంశాలే ఇప్పుడు రచ్చకు దారి తీస్తున్నాయి. పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణమైన ధనిక దేశాలు బెదిరింపులు, అధికార ప్రదర్శనలతో బాధిత దేశాల మెడలు వంచుతున్నాయి. పస లేని ఒప్పందాలకు తలలూపేలా చేస్తున్నాయి. ఇది చేదు నిజం. బైకూ సదస్సులోనూ అదే జరిగింది. శిలాజ ఇంధన దేశాల ప్రయోజనాల్ని కాపాడేందుకు తెర వెనుక సాగిన లాబీయింగ్, తీర్మానాల్లో ఆఖరి నిమిషంలో సాగిన మార్పులు చేర్పులే అందుకు నిదర్శనం. అభివృద్ధి చెందిన దేశాలు ఇలా తమ నైతిక, చారిత్రక కర్తవ్యాల విషయంలో వెనక ముందులాడుతూ, చివరకు విసురుతున్న చాలీచాలని రొట్టె ముక్కలకే బీద దేశాలు తలలూపాల్సి వస్తోంది. అలాగని కాప్ సదస్సులు వట్టి వృథా అని కొట్టిపారేయలేం. ఎందుకంటే, పర్యావరణ ప్రమాదంపై పేద దేశాలు కనీసం తమ వాణిని అయినా వినిపించడానికి మిగిలింది ఇదొకటే వేదిక. కాదూ... కూడదంటే అసలుకే మోసం వస్తుందనీ, మొత్తం ‘కాప్’ ప్రక్రియే కుప్పకూలుతుందనీ ఈ బీద ప్రపంచపు భయం. మరోపక్క పర్యావరణ సంక్షోభమనేది వట్టి బూటకమని వాదించే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బైకూ ‘కాప్’ సదస్సులో ఇచ్చిన హామీలకు అగ్ర రాజ్యం భవిష్యత్తులో ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ మాటకొస్తే అధ్యక్షుడు బైడెన్ హయాంలోనూ పర్యావరణ నిధులకై ప్రభుత్వ అభ్యర్థనల్ని అమెరికన్ కాంగ్రెస్ నెరవేర్చనేలేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో, అధ్యక్ష స్థానంలోని అజర్బైజాన్ సహా అనేక ప్రధాన దేశాల అంతంత మాత్రపు ముందస్తు కసరత్తు నడుమ కాప్29 అడుగులు వేసింది. అయినా ఈ సదస్సులో అసలేమీ జరగలేదని అనుకోలేం. ఏటా 100 బిలియన్ డాలర్ల మేర నిధులు సమకూరు స్తామని సంపన్న దేశాలు గతంలో వాగ్దానం చేశాయి. 2020 నుంచి నిలబెట్టుకోవాల్సిన మాటను ఆలస్యంగా 2022 నుంచి అమలు చేస్తున్నాయి. అదీ 2025తో ముగిసిపోనుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మొత్తాన్ని 2035 నాటికి 300 బిలియన్లకు పెంచడం ఒకింత విజయమే. కాకపోతే, పారదర్శకత లేమి, అందరినీ కలుపుకొనిపోలేకపోవడం తాజా ఒప్పందపు చట్టబద్ధతను తక్కువ చేస్తున్నాయి.అధిక పారిశ్రామికీకరణతో లాభపడ్డ సంపన్న దేశాలు ఏళ్ళ తరబడి మీనమేషాలు లెక్కపెడు తుండడమే పెనుశాపమవుతోంది. అందువల్లే భూతాపోన్నతిని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించ రానివ్వరాదన్న ప్యారిస్ ఒప్పంద లక్ష్యం వట్టి కలగానే మిగిలింది. అసలు ఇదే పద్ధతిలో ముందుకు వెళితే కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో కొత్త మాట దేవుడెరుగు... వర్తమాన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నప్పటికీ భూతాపం 2.7 డిగ్రీల మేర పెరుగుతుందట. అది పర్యావరణ సంక్షోభానికి దారి తీస్తుందని ఐరాస హెచ్చరిక. అది చెవికెక్కించుకొని, వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే కాప్30 నాటికైనా సంపన్న దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నాలు సాగించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని, పర్యావరణ న్యాయం వాస్తవమయ్యేలా చూస్తేనే మానవాళికి మేలు జరుగుతుంది. అదే సమయంలో భారత్ సహా వర్ధమాన ప్రపంచం ఈ పర్యావరణ మార్పు సవాలును సమర్ధంగా ఎదుర్కొనేందుకు తమవైన వ్యూహాలపై దృష్టి పెట్టడం మంచిది. థర్మల్ విద్యుత్‌పై అతిగా ఆధారపడడం లాంటివి మానుకోవడమూ మంచిది. లేదంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే అవుతుంది. -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్‌తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్‌లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్‌లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్‌గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్‌లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్‌లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్‌లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
COP27: కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే
ఈజిప్టులో జరిగిన ‘కాప్ 27’ సమావేశాలు వాడిగా వేడిగా జరిగాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ ఈసారి హాట్ టాపిక్! వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావన ఈ పేమెంట్ ఓవర్‌డ్యూ. అయితే ఈ దేశాలు తాము అంగీకరించిన విషయాల్లోనూ వెనకడుగు వేస్తుండటంతో వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉండటం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు తమ కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించే విధానాలు రావాలి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి స్పష్టం చేసినట్టు, కార్యాచరణకు దిగాల్సిన సమయమిదే! ఈజిప్టులోని షర్మ్ అల్–షేఖ్లో నవంబరు ఆరున మొదలైన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) 27వ సమావేశాలు ముగిశాయి. ఐక్యరాజ్య సమితి సంస్థ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైౖమేట్ ఛేంజెస్ (యూఎన్ఎఫ్సీసీసీ) ఆధ్వర్యంలో నడిచిన ఈ సమావేశాల్లో తీవ్ర చర్చోపచర్చలు, వాదోప వాదాలు జరిగి, ఒక్కరోజు పొడిగింపు తరువాత నవంబరు 20వ తేదీ తెల్లవారుజామున ముగిశాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేదెలా అన్న అంశంపై ఏటా జరిగే ‘కాప్’ సమావేశాల్లో ఈసారి ‘పేమెంట్ ఓవర్‌డ్యూ’ అంశంపై తీవ్రస్థాయి ప్రతిష్టంభన ఏర్ప డింది. వాతావరణ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు అందుకు తగ్గ పరిహారం చెల్లించడం ఇప్పటికే ఆలస్యమైందన్న భావనను సంక్షి ప్తంగా పేమెంట్ ఓవర్‌డ్యూ అని పిలుస్తున్నారు. ఈ అంశంపై అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండుగా విడిపోయాయి. నవంబరు 18నే ముగియాల్సిన చర్చలు ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజంతా కొనసాగాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటో నియో గుటెరస్ కలుగచేసుకుని, కార్యాచరణకు దిగాల్సిన సమయ మిదేనని స్పష్టం చేయాల్సి వచ్చింది. ‘‘కాప్27 సమావేశాలు నవం బరు 18నే ముగియాల్సి ఉండింది. అయితే చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఒక రోజుపాటు పొడిగించారు’’ అని భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వాతావరణ మార్పులపై ఏళ్లుగా జరుగుతున్న చర్చలు తరచూ ఆయా దేశాలు, వర్గాల మధ్య కలహాలు, జగడాలతో అర్ధంతరంగా ముగుస్తున్నాయి. ఈ దేశాలు, వర్గాలు సంకుచితమైన భావాలతో... ఇతరులపై పైచేయి సాధించేందుకు ఈ సమావేశాలు వేదికలుగా మారిపోయాయి. ‘‘వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల మోతాదు పెరిగిపోకుండా స్థిరీకరించాల్సి ఉంది’’ అన్న యూఎన్ ఎఫ్‌సీసీసీ ఆర్టికల్ 2 లక్ష్యాన్ని 30 ఏళ్లయినా అందుకోలేకపోవడం ఇందుకు ప్రత్యక్ష తార్కాణమని చెప్పాలి. ఈ ఏడాది జూన్ రెండున స్టాక్‌హోమ్+ 50 సమావేశాల్లోనూ ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రపంచ వాతావరణ అత్యయిక పరిస్థితిపై మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మూప్పేట ముప్పు ఎదుర్కొంటూ ఉన్నాం. ఏటికేడాదీ ప్రజ లను చంపేయడమే కాకుండా... నిరాశ్రయులను చేస్తున్న వాతావరణ అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు మనం మన తీరుతెన్నులు మార్చుకోవాలి. ప్రకృతిపై చేస్తున్న మతిలేని ఆత్మహత్యా సదృశమైన పోరును ఆపాలి’’ అని ఆంటోనియో గుటెరస్ విస్పష్టంగా పేర్కొ న్నారు. ఈ హెచ్చరికలు 1992లో యూఎన్ఎఫ్సీసీసీ... రియో సద స్సులో ఆమోదించిన తీర్మానాన్ని ధ్రువీకరించాయని చెప్పాలి. ‘‘ప్రపం చంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి... ఎక్కువ కాలం కొనసాగేది కాదు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ప్రకృతిని జయించాలన్న మానవ కాంక్ష మన మనగడనే ప్రశ్నార్థకం చేసే స్థితికి తీసుకొచ్చింది’’ అన్నది ఆ రియో సదస్సు తీర్మానం. ‘ఎన్విజనింగ్ అవర్ ఎన్విరాన్ మెంటల్ ఫ్యూచర్’ పేరుతో 2002లో వెలువడ్డ ఓ పుస్తకంలోనూ ‘‘పర్యావరణ విధ్వంసానికి సంబంధించిన హెచ్చరికలు వెలువడు తున్న ఈ తరుణంలో మన భవిష్యత్తును కాపాడుకునేందుకు తీసు కోవాల్సిన చర్యలకు తగినంత సమయం లేదన్నది గుర్తించాలి’’ అని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. యూఎన్ఎఫ్సీసీసీలో దాదాపు 198 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాతావరణ మార్పులన్నవి మానవాళికి అత్యంత ఆందోళ నకారి అని అంగీకరిస్తూ అందరితోనూ తొలినాళ్లలోనే ఒక ఒప్పందం చేసింది ఈ సంస్థ. 1997 నాటి క్యోటో ప్రోటోకాల్, 2015 నాటి ప్యారిస్ ఒప్పందాల ద్వారా యూఎన్ఎఫ్సీసీసీ వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు మూడు చట్టపరమైన ఆయుధాలు కలిగి ఉంది. రియో సదస్సు జరిగి ముప్ఫై ఏళ్లయిన సందర్భం ఇది. 2050 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలన్న శాస్త్రీయ లక్ష్యాన్ని సాధించేందుకు ఇదే అవకాశం. ఎందుకంటే... ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ద ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైౖమేట్ ఛేంజ్’ విడుదల చేసిన ఆరవ అంచనా నివేదిక కూడా... గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది. గత నెలలోనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్‌కు చెందిన ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ కూడా ప్యారిస్ ఒప్పందం అమలులో వెనుకబడుతున్నామనీ, లక్ష్యాన్ని అందుకు నేందుకు నమ్మ దగ్గ మార్గమేదీ లేని నేపథ్యంలో వాతావరణ పెను విపత్తును నివారిం చేందుకు అత్యవసరంగా ఓ విస్తృతమైన మార్పు అనివార్యం అవు తుందనీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల సమస్య అనేది ఇప్పుడు కేవలం ఒక ఆందోళనకరమైన అంశం మాత్రం కాదు. ప్రపంచం మొత్తాన్ని పీడించగలదని అందరూ గుర్తించాలి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకూ చేసిన కాలుష్య తప్పిదాలకు బాధ్యత వహించి పరిష్కార మార్గాలకు నేతృత్వం వహించేలా విధానాలు లేకుండా పోయాయి. భూమ్మీద అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికా వాతావరణ మార్పులపై పోరు విషయంలో కప్పదాట్లు వేయడం, 2019లో ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం, ఆ తరువాత 2021లో మళ్లీ చేరుతున్నట్లు ప్రకటించడం అభివృద్ధి చెందిన దేశాల తీరుకు తార్కాణంగా నిలుస్తోంది. అంతేకాకుండా... వాతా వరణ మార్పులపై జరిగిన ఒప్పందాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపు తుంది కూడా. అంతర్జాతీయ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఒడిదుడుకులకు గురయ్యేందుకు యూఎన్ఎఫ్సీసీసీ తన ప్రధాన సిద్ధాంతం నుంచి కొంత పక్కదారి పట్టడమే కారణమని అనిపిస్తుంది. వాతావరణ మార్పుల సమస్య అందరిదైనా... బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని చెప్పే సిద్ధాంతం మాత్రమే కాకుండా... క్యోటో ప్రోటో కాల్లోని కొన్ని కీలకాంశాల్లో సడలింపులు, ప్యారిస్ ఒప్పందంలోనూ బాధ్యతల విషయంలో ఆయా దేశాలు తమకు తగ్గ నిర్ణయం తీసు కుంటాయని చెప్పడం... వెరసి వాతావరణ మార్పులపై మనిషి పోరు నిర్వీర్యం అని చెప్పక తప్పదు. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన ప్రతి విషయంలోనూ వెనకడుగు వేయడం వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయేందుకు కారణమని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తాము అంగీకరించిన అంశాల నుంచి వెనక్కు వెళ్లడం... వాతావరణ మార్పులు, దాని దుష్ప్రభావాలను ఎదుర్కొనే విషయంలో ధనిక దేశాలు నేతృత్వం వహించాలని యూఎన్ఎఫ్సీసీసీ చేసిన ప్రకటనను వెక్కిరించేదిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తీరు యూఎన్ఎఫ్సీసీసీ లక్ష్యాలకు పూర్తిగా భిన్నమన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. యూఎన్ ఎఫ్‌సీసీసీ నిబంధనల ప్రకారం... అభివృద్ధి చెందిన దేశాలు నేతృత్వం వహించేందుకూ; అవసరమైన అంశాల్లో తామిచ్చిన హామీల అమలు జరుగుతున్నదా లేదా అన్నది సమీక్షించేందుకూ తగిన ఏర్పాట్లు చేయాలి. అయితే ఇవేవీ జరగడం లేదు. ఈజిప్టులో ఇటీవల ముగిసిన కాప్ 27 సమావేశాల సారాంశమూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని చెప్పాలి. అభివృద్ధి చెందిన దేశాలు తగిన చర్యలు తీసుకోకపోతే ప్యారిస్ ఒప్పందం ప్రకారం జాతీయంగా నిర్దే శించుకున్న కంట్రిబ్యూషన్స్ వల్ల తమకేమీ ప్రయోజనం ఉండబోదని అభివృద్ధి చెందుతున్న దేశాలూ త్వరలో గుర్తిస్తాయి. ఈ విషయాల న్నింటినీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పటివరకూ వాతావరణ మార్పులపై చర్చలను నిర్వహించడానికి మాత్రమే పరిమితమైన జనరల్ అసెంబ్లీ సమస్య మరింత తీవ్రమైనది అన్న విషయాన్ని అర్థం చేసుకునేలా చేయాలి. యూన్ఎఫ్సీసీసీతో పాటు ప్యారిస్ ఒప్పందం అమలుకు, భవిష్యత్తు కార్యాచరణకు తగిన తీర్మానాలు చేయాలి. భరత్ హెచ్. దేశాయి, వ్యాసకర్త ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, జేఎన్‌యూ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
COP 27: కాప్ 27లో కాక!
షెర్మెల్ షేక్ (ఈజిప్ట్): ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 దేశాల మధ్య ఉద్రిక్తతలకు వేదికగా మారింది. విషయం వాడివేడి చర్చల స్థాయిని దాటి ఏకంగా గొడవల దాకా వెళ్లింది. పలు కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యమైంది. దాంతో శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారమూ కొనసాగింది. అయినా పలు విషయాలపై పీటముడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్ట్ రూపొందించిన సంప్రదింపుల పత్రం పూర్తిగా నిస్సారమంటూ చాలా దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘1.5 డిగ్రీల లక్ష్యం’తో పాటు యూరోపియన్ యూనియన్ తాజాగా చేసిన చాలా ప్రతిపాదనలను సదరు పత్రంలో బుట్టదాఖలు చేయడంపై యూరప్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఒక దశలో అవి వాకౌట్ చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించే దాకా వెళ్లింది! ఇలాగైతే పత్రంపై యూరప్ దేశాలేవీ సంతకం చేయబోవని ఈయూ కుండబద్దలు కొట్టింది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగిపోతే భారీగా ముంపు తదితర ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చే ద్వీప దేశాల భద్రతను పత్రంలో అసలే పట్టించుకోలేదన్నది మరో అభ్యంతరం. మరోవైపు ఈజిప్ట్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించమే గాక ఆయా దేశాలపై ప్రత్యారోపణలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరైన 40 వేల పై చిలుకు ప్రతినిధుల్లో చాలామంది వెనుదిరుగుతుండటంతో ప్రాంగణమంతా బోసిపోయి కన్పిస్తోంది. మరోవైపు, విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోయిన పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధి ఏర్పాటు చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు చేసిన డిమాండ్‌పైనా చివరిదాకా ప్రతిష్టంభనే కొనసాగింది. ఎట్టకేలకు నిధి ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు మధ్యవర్తులు శనివారం సాయంత్రం ప్రకటించారు. అయితే దానిపైనా ఏకాభిప్రాయం ఇంకా కుదరాల్సే ఉంది! ఇందుకోసం ఏటా ఏకంగా 100 బిలియన్ డాలర్లు వెచ్చస్తామంటూ 2009లో చేసిన వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికీ నిలుపుకోకపోవడం గమనార్హం. మరోవైపు, ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరలో పూర్తిగా నిలిపేయాలన్నది గత సదస్సులోనే చేసిన ఏకగ్రీవ తీర్మానం. కానీ ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి చర్చాంశాన్నీ తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’’ అంటూ వర్ధమాన దేశాలు ఆరోపణలు దుమ్మెత్తి పోస్తున్నాయి. -
అగ్రరాజ్యాలపై మోదీ ఫైర్
అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలపట్ల అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నానాటికి పెరిగిపోతోన్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు మాటలే తప్ప చేతలకు సిద్ధపడవని ఆరోపించారు. పర్యావరణ హితం కోసం పెద్ద స్థాయిలో అణుశక్తిని వినియోగంలోకి తేవాలనే భారత్ ప్రయత్నాలను ఆయా దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో పర్యావరణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న జాతీయ పర్యావరణ సదస్సులో ప్రసంగించిన ఆయన ప్రకృతిని దైవంగా భావించడం భారతీయుల సంప్రదాయంలో భాగమన్నారు. 'భారత్‌లో కాలుష్యం పెరిగిపోతోందని వివిధ దేశాల ఏజెన్సీలు లెక్కలతో సహా మనల్ని నిందిస్తాయి. పోనీ, అలా జరగకుండా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్ని కడతామంటే మాత్రం గగ్గోలు పెడతాయి. ఈ వేదిక నుంచి గ్లోబర్ న్యూక్లియర్ కమిటీని అర్ధిస్తున్నాను.. దయచేసి మాకు అనుమతులు మంజూరుచేయండి' అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.