అగ్రరాజ్యాలపై మోదీ ఫైర్
అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలపట్ల అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నానాటికి పెరిగిపోతోన్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు మాటలే తప్ప చేతలకు సిద్ధపడవని ఆరోపించారు. పర్యావరణ హితం కోసం పెద్ద స్థాయిలో అణుశక్తిని వినియోగంలోకి తేవాలనే భారత్ ప్రయత్నాలను ఆయా దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో పర్యావరణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న జాతీయ పర్యావరణ సదస్సులో ప్రసంగించిన ఆయన ప్రకృతిని దైవంగా భావించడం భారతీయుల సంప్రదాయంలో భాగమన్నారు.
'భారత్లో కాలుష్యం పెరిగిపోతోందని వివిధ దేశాల ఏజెన్సీలు లెక్కలతో సహా మనల్ని నిందిస్తాయి. పోనీ, అలా జరగకుండా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్ని కడతామంటే మాత్రం గగ్గోలు పెడతాయి. ఈ వేదిక నుంచి గ్లోబర్ న్యూక్లియర్ కమిటీని అర్ధిస్తున్నాను.. దయచేసి మాకు అనుమతులు మంజూరుచేయండి' అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.