ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలికకాదు. రావణాసురుడు రాముడి చేతిలో పది తలలు తెగి పడిపోయి ఉన్నాడు యుద్ధభూమిలో. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు. అక్కడ ఆమె దిగింది. కాస్త దూరంలో రామలక్ష్మణులు నిలబడి ఉన్నారు. అందరూ అనుకున్నారు.. ‘‘నా భర్తను నువ్వే చంపేసావ్ ... దుర్మార్గుడివి..’’ అని రాముణ్ణి తిడుతుందనుకున్నారు. ఎంతయినా భర్త కదా, ఆక్రోశంలో నిందిస్తుందనుకున్నారు. ఆమె నేరుగా నేలపై పడి ఉన్న రావణుడి దగ్గరకు వెళ్లి..‘‘ ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా / స్మరద్భిరవ తద్వైరమింద్రియైరేవ నిర్జితః’’ అన్నది.
నీవు ఒకప్పుడు త్రిభువన సామ్రాజ్యాన్ని కోరుకున్నావు. ఆ కోరిక తీరడానికి తపస్సు చేసావు. ఆ సమయంలో ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించావు. కాలికింద తలదించుకుని రాము అవకాశం కోసం ఎదురు చూసినట్లు నీవు కోరుకున్న సామ్రాజ్యం రాగానే నీ ఇంద్రియాలే నిన్ను కాటేసాయి. మహా పతివ్రత సీతమ్మను వేధించావు. రాముని చేతిలో చచ్చిపోయావని అందరూ అనుకుంటున్నారు. నీ భార్యగా నాకు తెలుసు. రాముడి చేతిలో కాదు, నీ ఇంద్రియాల చేతిలోనే నీవు చచ్చిపోయావు’’ అంది. ఈ మాటలను సీతమ్మ కూడా ముందే ఇంచుమించు ఇలాగే చెప్పింది..‘‘నీ కామం నీ భార్యయందుంచుకో. ధర్మానికి కట్టుబడి ఉండు. దోషం లేదు. నీ కామం నీ భార్యను దాటిపోయిందా నీకు మహాపాపం చుట్టుకుంటుంది... వద్దు. ధూర్త విషయాలజోలికి వెళ్ళకు’ అని హెచ్చరించింది కూడా..
అందువల్ల ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలికయిన పనేం కాదు. అరిషడ్వర్గాలకు దూరంగా ఉండాలని చెప్పడం చాలా తేలికే. అంటే కామానికీ, కో΄ానికీ... దూరంగా ఉండమంటున్నారు.. సరే.. అసలు కామాన్ని పట్టుకుని ఉంటే కదా... ఈ మాట అనవలసింది. మరి ....మనం పట్టుకోవడం కాదు... అదే మనల్ని పట్టుకుంటున్నది. అది వదలాలి అంటే... మొదట అది మనల్ని పట్టుకుందని గుర్తించాలి. తరువాత మనం ఏం చేస్తే అది పట్టు వదులుతుందో కూడా తెలుసుకోవాలి. ఇది అందరికీ అన్వయం అవుతుందా లేదా.. పక్కనబెట్టి గృహస్థుకు ఏ ధర్మం అన్వయం అవుతుందో అదే అన్వయం చేసుకోవాలి.
అందుకే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ ...‘‘లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా / నీకము జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధు జేయు నీ/ భీకర శత్రు లార్వుర బ్రభిన్నుల జేయుము ్ర΄ాణికోటిలో/ నీకు విరోధి లే డొకడు నేర్పున? జూడుము దానవేశ్వరా!’ అంటాడు. నీవు లోకాలన్నీ గెలిచానంటున్నావు కదా... ముందు నీ ఇంద్రియాలను నీవు గెలిచావా? నీ మనసును గెలిచావా? అది చెప్పు.. వాటిని గెలవడం అంత తేలిక కాదు.
వాటిని గెలువు. గెలిస్తే... అప్పుడు నీకు శత్రువన్న వాడెవడూ ఎదురుగా కనబడడు. అందరూ మిత్రులే...అంటాడు. కాబట్టి అది అనుష్ఠానం చేత గెలవాలి. అంటే సుఖాన్ని ధర్మంతో కట్టేసి ఉంచాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. కామం ధర్మబద్ధమైనప్పుడు సంతానం కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. సమాజం నైతికంగా ఒక క్రమ పద్ధతిలో, సుఖసంతోషాలతో, ప్రశాంతంగా పురోగమిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment