![Auspicious words and sounds, there is worship - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/26/ustad-bismilla-khan.gif.webp?itok=fGtE7n4_)
భారతీయ సంప్రదాయంలో ఏదయినా ప్రారంభం చేసేటప్పుడు.. మంగళకరమైన వాక్కులతో, శబ్దాలతో ప్రారంభం జరుగుతుంటుంది. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’.. అంటారు. అంటే మంగళకర వాక్కుతో ప్రారంభించాలి, మధ్యలో మంగళకరమైన వాక్కు ఉండాలి. ముగింపును కూడా మంగళకరంగా పూర్తి చేయాలి.. అని శాస్త్ర వాక్కు. అంటే జీవితం ఎప్పుడూ మంగళకరంగా, శోభాయమానంగా ఉండాలి. శాంతికి విఘాతం కలగకుండా చూసుకుంటుండాలి. అంటే ఇతరుల మనశ్శాంతికి కారణమయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి.
మంగళకర వాక్కులు, శబ్దాలు ఉన్నచోట పూజనీయత ఉంటుంది. వాతావరణం కూడా పరిశుద్ధమయి, దేవతల అనుగ్రహానికి కారణమవుతుందని విశ్వసిస్తాం. ఘంటానాదంతో పూజ ప్రారంభం చేస్తాం. ఎందుకని.. ఆగమార్థంతు దేవానాం/ గమనార్థంతు రాక్షసాం/ కురుఘంటారవంతత్ర/ దేవాతాహ్వాన లాంఛనం... అంటే రాక్షసులు అక్కడినుంచి వెళ్లిపోవాలన్నా, దేవతలు రావాలన్నా... ఘంట మోగాలి. ఆ శబ్దంలోని పవిత్రత, మంగళప్రదత్వం అటువంటిది.
నాదస్వరం, షెహనాయి, మృదంగం, డోలు, శాక్సోఫోన్, మద్దెల, ఘంటలు, గజ్జెలు, ఢమరుకం, శంఖం, కొమ్ము, వేణువు, వీణ, వయోలిన్, హార్మోనియం, క్లారినెట్... ఇవన్నీ మంగళప్రదమైన శబ్దాలు చేసే సంగీత పరికరాలు. బ్యాండ్ కూడా అంతే... దానిలోని శాక్సోఫోన్ కానీ, క్లారినెట్ కానీ, ఇతర పరికరాలు కానీ అవి కూడా గురుముఖతః నేర్చుకుని వాయిస్తారు. వీటిని మోగించే కళాకారులను కూడా సమాజం సమున్నతం గా ఆదరిస్తుంది. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ లను భారతరత్న వరించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు.
‘నేను సరస్వతీ ఆరాధకుడిని’ అని బిస్మిల్లాఖాన్ ప్రకటించుకున్నారు. ‘యావత్ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు..’ అని ఆయన తరచుగా అంటూండేవారు. ఒకసారి అమెరికాలో కచేరీ సందర్భంగా అభిమానులు ఆయనను అక్కడే ఉండిపొమ్మని కోరగా... కాశీని, విశ్వనాథుడిని, విశాలాక్షిని, గంగమ్మను వదిలి రాలేను అని.. ప్రకటించుకున్న గొప్ప దేశభక్తుడు. సింహాచలం ఆస్థాన విద్వాంసుడు చిట్టబ్బాయిని... సంగీతనాటక అకాడమీ, కళాప్రపూర్ణ వంటి బిరుదులెన్నో వరించాయి. కాకినాడలో సత్యనారాయణ అనే గొప్ప క్లారినెట్ విద్వాంసుడు ఎందరో శిష్యులను తయారు చేసాడు.. వారందరూ కలిసి ఆయనకు గురుదక్షిణగా బంగారు క్లారినెట్ ను బహూకరించారు.
ఇటువంటి వాద్య సంగీత విద్వాంసులను కూడా గౌరవించడం, వారి కచ్చేరీలు నిర్వహించి వారిని, వారి కళను, వారి వాయిద్యాలను సమాదరించడం మన కర్తవ్యంగా భావించాలి. మంగళత్వం అనేది కోయిల కూతలో, మామిడాకులో వానచినుకులో, పసుపులో, కుంకుమలో, పువ్వులో.. కూడా దర్శించే సంప్రదాయం మనది. ఇప్పటికీ నృత్యకళను అభ్యసించినవారు అరంగేట్రం చేయడానికి ముందు .. సభలో ఆసీనులైన పెద్దల దగ్గరకు వచ్చి, వారి చేతికి గజ్టెలు అందించి... తిరిగి వారి చేతులనుండి స్వీకరించి కాలికి కట్టుకుని వెళ్ళి ప్రదర్శిస్తుంటారు... అంత గాఢంగా మనం ఈ కళలను అభిమానిస్తాం... ఈ సంప్రదాయాన్ని నవతరం కూడా నిష్ఠతో కొనసాగించాలని కోరుకుందాం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment