ఒకే చోట ఉండేవారికి సొంతిల్లు అనుకూలం
రుణం తీసుకుని ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి
దీని విలువ దీర్ఘకాలంలో పెరిగేదే
ఇంటి రుణంపై పన్ను ప్రయోజనాలు
తరచూ ఉద్యోగాలు మారితే అద్దె ఇల్లు అనుకూలం
చాలా మంది తేల్చుకోలేని అంశం.. అద్దె ఇంట్లో ఉండడం నయమా? లేక సొంతిల్లు సమకూర్చుకోవడం బెటరా? అని. ఈ రెండింటిలో ఆర్థికంగా ఏది లాభదాయకమో నిపుణులను అడిగితే చెబుతారు. కానీ, ఇల్లు అన్నది భావోద్వేగాలు, సామాజిక గుర్తింపు, మానసిక ప్రశాంతత తదితర ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది. అద్దె ఇల్లు ఆర్థిక భారం లేనిది.
సొంతిల్లు ఆర్థిక బాధ్యతను తెచి్చపెడుతుంది. ఒకటి రెండు నెలల అడ్వాన్స్ ఉంటే నిమిషాల్లో అద్దె ఇంట్లో దిగిపోవచ్చు. కానీ, సొంతింట్లో కుడి కాలు మోపాలంటే భారీ మొత్తం కావాలి. లేదంటే బ్యాంక్ తలుపు తట్టాలి. అద్దె ఇంట్లో మనకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి గిట్టకపోయినా మరో గూడు వెతుక్కోవాల్సిందే. సొంతింట్లో ఎవరికి వారే రారాజు. ఇలా నాణేనికి రెండువైపులా లాభనష్టాలున్నాయి. తమకు ఏది అనుకూలమో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే. ఈ దిశగా అవగాహన కలి్పంచి, సులువుగా నిర్ణయం తీసుకోవ డానికి దారి చూపించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం.
ఆర్థిక కోణం...
ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏంటన్నవి ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కల్లో కనబడుతున్నాయి. కనుక అక్కడ సొంతిల్లు చాలా మందికి సాధ్యపడకపోవచ్చు. అలాంటి చోట అద్దె ఇల్లే ఆర్థి కంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దే తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్థోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి/ఉద్యోగ/వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశి్చంతగా సొంతింటికి మొగ్గు చూపొచ్చు. కానీ, నగరాలు, పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించే వారు అక్కడి రెంటల్ ఈల్డ్స్ (ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి), ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది, తదితర అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. మన దేశంలోని చాలా పట్టణాల్లో రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఈఎంఐతో పోలి్చతే.. చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయడం మంచి ఆప్షనే. కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ వెళ్తుంది. కానీ, దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవడం వల్ల.. తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది.
అద్దె రాబడి తక్కువ...
మన దేశంలో ఇంటిపై సగటు రాబడి 2.9 శాతంగా ఉంది. ప్రపంచంలో ఇక్కడే తక్కువ. అదే యూఎస్, కెనడా, దుబాయిలోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి 5–6 శాతంగా ఉంది. అద్దె రాబడి 4 శాతాన్ని మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవడం అత్యుత్తమమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ (అద్దెకు ఇస్తే వచ్చే రాబడి) (ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు), ఏటా ఎంత చొప్పున పెరుగుతుందన్నది తెలుసుకోవాలి. వీటి ఆధారంగా అద్దె/ఈఎంఐ రేషియో ఎంతో తేల్చుకోవాలి. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ ‘లైసస్ ఫొరాస్’ ఇందుకు సంబంధించి విలువైన గణాంకాలు రూపొందించింది. దీని ప్రకారం 100 శాతం అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండడమే లాభం. ఈ రేషియో 100 దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవడం లాభం.
విశ్లేషణ
విశాఖలో రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 2 శాతంగా ఉంది. ఇది ఏటా 5 శాతం పెరుగుతూ పోతే రెంటల్/ఈఎంఐ రేషియో 57 శాతం అవుతుంది. ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 84 శాతంగా ఉంటుంది. 11 శాతం పెరిగితే రేషియో 93గా ఉంటుంది. అదే హైదరాబాద్‌లో రెంటల్ ఈల్డ్ 2.5 శాతం.. ఏటా 9 శాతం వరకు పెరిగితే రెంట్/ఈఎంఐ రేషియో 94గా ఉంటుంది. ఒకవేళ ఏటా 10 శాతం పెరిగితే ఈ రేషియో 104కు వెళుతుంది. హైదరాబాద్‌లో ఏటా 10 శాతం చొప్పున అద్దెలు పెరిగేట్టు అయితే అప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి, ఈఎంఐలు కట్టుకోవడమే ప్రయోజనకరం. అద్దె పెరుగుదల 10 శాతంలోపే ఉంటే కిరాయికి తీసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుత రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 4 శాతం అంతకంటే ఎక్కువే ఉండి, ఏటా అద్దె 5 శాతం పెరిగినా సరే.. అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవడమే లాభం.
లాభాలు
ఈ అంశాలు గమనించాలి..
ఆర్‌బీఐ డేటా ప్రకారం 2010–11 నుంచి 2017–18 మధ్య కాలంలో (రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ (రెరా) రాక ముందు) ప్రాప ర్టీల ధరలు ఏటా 15 శాతం చొప్పున పెరిగాయి. 2018–19 నుంచి 2022–23 కాలంలో (రెరా వచ్చిన తర్వాత) ఏటా 3 శాతం పెరిగాయి. చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు స్థాయిలో ప్రాపరీ్టల ధరలు పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ప్రాపర్టీ కొనుగోలు లాభదాయకమే. 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే, ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ, ఇంటి అద్దె కంటే రెట్టింపు ఉంటుంది. కానీ, 15–17 ఏళ్లు గడిచే సరికి ఇంటి అద్దె ఏటా పెరుగుతూ రుణ ఈఎంఐకి చేరువ కావచ్చు.
సొంతిల్లు
→ ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. ఇది ఇళ్లు, స్థలాల విలువలకు దన్నుగా నిలుస్తుంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపదకు దారితీస్తుంది.
→ సొంతిల్లుతో వచ్చే ప్రశాంతతను వెలకట్టలేం. భద్రతకు హామీనిస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చితి ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. గోపత్య ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీపడాల్సిన అవసరం ఉండదు.
→ అద్దెకు బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగడమే కాదు.. పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణ ఈఎంఐలో అసలు (ప్రిన్సిపల్), వడ్డీ అని రెండు భాగాలుంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది.
→ సొంతింటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దె ఇంట్లో ఉండి, చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడం కష్టమనిపిస్తుంది. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయాల్సిన అగత్యం ఏర్పడదు. సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది. సామాజిక గుర్తింపును తెస్తుంది.
→ చివరిగా సొంతిల్లు ఉంటే.. విశ్రాంత జీవనంలో స్థిరమైన ఆదాయాన్నిచ్చే బంగారు బాతు అవుతుంది. రివర్స్ మార్ట్‌గేజ్‌తో ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని బ్యాంక్ నుంచి పొందొచ్చు.
అద్దె ఇల్లుళీ అద్దె ఇంటితో ఉండే అత్యంత అనుకూలత.. నచి్చన ప్రాంతంలో ఉండొచ్చు. సొంతిల్లు అయితే మారకుండా ఎప్పటికీ ఒకేచోట ఉండిపోవాల్సి వస్తుంది.
→ ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వస్తే, తక్కువ అద్దె ఇంటికి వెళ్లి సర్దుకోవచ్చు. సొంతిల్లు అయితే వ్యక్తిగత కష్టాలతో సంబంధం లేకుండా ఈఎంఐ కట్టాల్సిందే.
→ అద్దె ఇల్లు అయితే ఇంటి నిర్వహణ భారం తమ మీద పడదు. వాటర్ ట్యాంక్‌లు, నీటి మోటార్‌ల నిర్వహణ, రిపేర్లు, పెయింట్స్ తదితర బాదర బం«దీలు ఉండవు. వీటి రూపంలో ఆర్థిక భారం పడదు. ఇంటి పన్నుల బాధా ఉండదు.
→ రుణంపై ఇల్లు కొనుగోలు చేయాలంటే.. మొత్తం విలువలో 20 శాతం డౌన్ పేమెంట్ కింద సమకూర్చుకోవాలి. అదే అద్దె ఇంటి విషయంలో ఈ అవసరం ఉండదు. కొద్ది నెలల అద్దెకు సరిపడా రిఫండబుల్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.
వేతన జీవులకు రియల్టీ ఆస్తి
వేతన జీవులకు రియల్ ఎస్టేట్ ఒక ఆస్తిగా మారుతుంది. నీవు ప్రతి నెలా అద్దె కింద రూ.లక్ష చెల్లిస్తుంటే, దానికి అదనంగా రూ.50,000–60,000 చెల్లించేట్టు అయితే సొంతిల్లు దక్కుతుంది. పదేళ్ల పాటు ఇదే అద్దెను చెల్లించడం వల్ల ఎలాంటి ఆస్తి సమకూరదు. కనుక ఈఎంఐతో ఒక ఆస్తిని సమకూర్చుకోవచ్చు.
– అజితేష్ కొరుపూలు, అశోక బిల్డర్స్ (రియల్ ఎస్టేట్ కంపెనీ) సీఈవో
తెలివైన నిర్ణయం కాదు!
గురుగ్రామ్‌లో నేను ఉండే ఇంటికి ప్రతి నెలా రూ.1.5 లక్షలు అద్దె, మెయింటెనెన్స్‌తో కలిపి రూ.1.65 లక్షలు చెల్లిస్తున్నా. అది గోల్ఫ్‌కోర్స్‌తో కూడిన ఖరీదైన ప్రాంతం. నేను ప్రస్తుతం అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్ ఖరీదు రూ.7.5–8 కోట్లు. దీన్ని కొనుగోలు చేయాలంటే 70 శాతం మేర రూ.6 కోట్లు రుణం తీసుకోవాలి. దీనికి ప్రతి నెలా రూ.6–7 లక్షల ఈఎంఐ చెల్లించాలి. అంటే నేను ప్రస్తుత ఇంటికి చెల్లిస్తున్న అద్దెకంటే ఈఎంఐ నాలుగు రెట్లు అధికం. కనుక ఇల్లు కొనుగోలు చేయడం నాకు తెలివైన నిర్ణయం కాబోదు. ఇల్లు అనేది లిక్విడిటీ (కోరుకున్న వెంటనే సొమ్ము చేసుకోగల) ఉన్న ఆస్తి కాదు. కనుక నేను అదే రూ.6 లక్షలను పబ్లిక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తాను. పైగా అద్దె ఇల్లు తీసుకోవడంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది. 15 రోజుల్లోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఇంటికి మారొచ్చు. నేను నా పిల్లలు, తల్లిదండ్రులతో కలసి ఉంటే తప్ప ఇంటి విషయంలో నా ఆలోచన ఇదే.
– శంతను దేశ్‌పాండే, బోంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్
హాస్యాస్పదం
ప్రస్తుత వేల్యూషన్ల వల్లే నేను రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేయలేదు. నా వరకు ఈ వేల్యూషన్లు నిజంగా హాస్యాస్పదం. వడ్డీ రేట్ల కంటే ఇంటిపై రాబడులు తక్కువ. ఇళ్లు, ఆఫీస్‌ల ధరలు పెరుగుతాయని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అనిపించడంలేదు. పెట్టుబడులపై 10–12 శాతం రాబడులు సంపాదించుకోలిగినప్పుడు, 3 శాతానికే (ప్రాపర్టీ విలువలో) వచ్చే అద్దె ఇల్లు తీసుకోవడమే మంచిది. పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. నా తల్లిదండ్రులు నివసించిన ఇల్లు ఒక్కటే నాకు ఉంది. దానికి కూడా భావోద్వేగ పరమైన కారణాలున్నాయి.
– నిఖిల్ కామత్, జెరోదా కో–ఫౌండర్
ఆఫీసుకు దగ్గరుంటే..
తమ కార్యాలయాలకు దగ్గరగా లేదా వ్యాపార సంస్థలకు సమీపంలో ఉండాలనుకుంటే ఇంటిని అద్దెకు తీసుకోవడమే లాభం. అలాంటి చోట సొంతిల్లు సమకూర్చుకోవడానికి భారీ పెట్టుబడి కావాలి. దాంతో పోలిస్తే చాలా తక్కువకే అద్దె ఇల్లు వచ్చేస్తుంది. పైగా రోజూ ఇంటి నుంచి వెళ్లి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఇంధన వ్యయాల భారం ఉండదు. విలువైన సమయం, వనరుల ఆదా అవుతాయి.
సెలబ్రిటీలు ఇలా..
సెలబ్రిటీలు మాధురి దీక్షిత్, కృతి సనన్ సొంతింటికి బదులు అదంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ ముంబైలో ఒకే ప్రాజెక్టులో 6 అపార్ట్‌మెంట్లు కొన్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment