ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగే మాం పాహి... అంటూ కీర్తన చేస్తూ... గంగ వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించారు. నీళ్ళబిందె తలమీద పెట్టుకుని ఆడుతుంటే ఎలా ఉంటుందో శివుడు తన జటాజూటంలో గంగను బంధించి తాండవం చేస్తుంటే ఆ దృశ్యం అలా ఉంటుందంటుంది రావణ కృత స్తోత్రం. భగీరథుడు ప్రార్థన చేస్తే వదిలిపెట్టాడు శివుడు గంగను.
శంకరుడి శిరస్సు నుండి పాదాల వరకు తగిలి కిందకు ప్రవహించింది. ఆ గంగను ...ఆ నీళ్ళను తలమీద చల్లుకుంటే.. దేవతాస్థానాలనుంచి పడిపోతున్న వాళ్లుకూడా మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని పొందుతారట.. అటువంటి శక్తి ఆ గంగమ్మది.
గంగే మాం పాహి గిరీశ శిరస్థితే/గంభీరకాయే గీత వాద్య ప్రియే/అంగజతాత ముదే అసి వరుణా మధ్యే....’’. అంటారు దీక్షితార్ వారు తమ కీర్తనలో. ఆమె ప్రవాహ తీరును గంభీర కాయే.. అన్నారు.. ఆమె శరీరం అలా ఉంటుందట.‘...శేషాహే రనుకారిణీ ...’ అంటారు శంకరులు. ఆది శేషుడు భూమి మీద పాకి వెడుతుంటే ఎలా ఉంటుందో గంగా ప్రవాహం అలా ఉంటుందంటారు ఆయన. శేషుడు ఉత్తర దిక్కున ఉంటాడు. ఆయనను స్మరిస్తే మనకున్న ఆపద లు తొలగుతాయని ఒక నమ్మకం. కాశీలో గంగకున్న విశేష లక్షణం ఏమిటంటే... అప్పటివరకు దక్షిణానికి ప్రవహించిన గంగానది అక్కడ ఉత్తర దిక్కుకు మళ్ళుతుంది. దానిని కాశీగంగ అంటారు. అక్కడ గంభీర శబ్దంతో ప్రవహించే గంగను సంగీత వాద్య ప్రియే ... అని కూడా అన్నారు. ఎందుకలా!!!
గంగమ్మకు గీతమన్నా, సంగీతమన్నా ఇష్టమట. గంగ ఒడ్డున కూర్చుని పాట పాడినా, వాద్యం మోగించినా, ఆలాపన చేసినా, నృత్యం చేసినా ఆమె సంతోష పడి పోతుందట. అంటే రాజోపచారాలన్నింటినీ అంత ప్రీతితో స్వీకరించగలిగిన భగవత్ స్వరూపం ఆమెది. అంటే నిజమయిన కళాకారుడు నిజజీవితంలో కోరుకోవలసింది ఏమిటంటే – ఒక్కసారయినా గంగ ఒడ్డున కూర్చుని తన ప్రదర్శన ఇచ్చి ఆమెను సంతోష పరచాలి, అని. కాశీలో ఇప్పటికీ ఒక ఏర్పాటు ఉంది. అక్కడ కొన్ని పడవలు అద్దెకిస్తారు. వాటితోపాటూ సంగీత విద్వాంసులు వస్తారు మనతో. వాద్యగోష్ఠి చేస్తారు. కొంతమంది తబలా, వయోలిన్, వీణ వాయిస్తే మరికొంతమంది పాడతారు.
సూర్యోదయానికి ముందు తెల్లవారు ఝామున ... అసి, వరుణ – ఈ రెండింటి మధ్యలో అలా సంగీతం వింటూ పడవమీద వెడుతూ ఉంటే గంగమ్మ ప్రసన్నరాలవుతుందని అక్కడి వారి నమ్మకం. గీత వాద్య ప్రియే... అంగజ తాత ముదే... అసి వరుణా మధ్యే...దీక్షితార్ వారి కీర్తనలో కూడా ఇదే వ్యక్తమవుతుంది. అంగజ తాత ముదే... గంగమ్మ ఎవరు? అంగజుడు అంటే మన్మథుని తండ్రి.. మహావిష్ణువు. గంగమ్మ ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుందట. తన స్పర్శను పొంది గంగ పునీతమయింది. తిరిగి గంగ ఆ ప్రభావంతో సర్వ జనుల పాపాలను నశింప చేసి ధర్మరక్షణకు కారణమవుతున్నందువల్ల విష్ణువుకు ప్రీతిపాత్రమవుతున్నది అన్నారు ముత్తుస్వామి దీక్షితార్.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment