నెరుస్తున్న బంధాలు | Reasons Behind the Gray Divorce, special story | Sakshi
Sakshi News home page

నెరుస్తున్న బంధాలు

Published Sun, Nov 24 2024 12:41 AM | Last Updated on Sun, Nov 24 2024 12:41 AM

Reasons Behind the Gray Divorce, special story

పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...
పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.

కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?
వీటిని ‘గ్రే డివోర్స్‌’లని ‘సిల్వర్‌ స్పిల్టింగ్‌’ అంటున్నారు.

నటుడు ఆశీష్‌ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే 
ఇప్పుడు రెహమాన్‌ జంట కేసు కూడా గ్రే డివోర్స్‌ను చర్చాంశం చేసింది. 
సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆశీష్‌ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్‌ సెరిమనీకి ఆశీష్‌ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్‌లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?

హృదయాలు ఎందుకు పగలాలి?
ఏ.ఆర్‌.రెహమాన్‌ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.

జాగ్రత్త పడాల్సింది ఇప్పుడే
అమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్‌ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్‌ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. 

పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?

గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ
→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. 

→ మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్‌ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్‌మెంట్‌ తర్వాత భర్త తరచూ క్లబ్‌లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్‌ ఫ్రెండ్సే, కామన్‌ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.

→ రూపాయి  తగాదా:  డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను 
పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్‌ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. 

→ అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు.    

కలిసి ఉంటే కలదు సుఖము
పెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement