ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.
దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.
అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్‌పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా
Comments
Please login to add a commentAdd a comment