ఆమె కారణంగానే రెహమాన్‌ విడాకులు.. స్పందించిన మోహినిదే | Mohini Dey Reacts On Rumours Over Linking Her To AR Rahman Divorce With Saira Banu, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఆమె కారణంగానే రెహమాన్‌ విడాకులు.. స్పందించిన మోహినిదే

Nov 23 2024 12:17 PM | Updated on Nov 23 2024 12:58 PM

Mohini Dey Reacts On Rumours Linking Her To AR Rahman Divorce

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌-సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పర్పస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు న్యాయవాది వందనా షా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు రెహమాన్‌ విడాకుల విషయం బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్‌ విడాకులకు మోహినిదే కారణమంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు రెహమాన్‌-మోహినిదే మధ్య ఏదో సంబంధం ఉందన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై మోహినిదే సోషల్‌ మీడియా వేదికగా స్పదించారు. తనపై వస్తున్న రూమర్స్‌ని తీవ్రంగా ఖండించారు.

‘నా విడాకుల ప్రకటన వెల్లడించిన తర్వాత వరుసగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారో నాకు తెలుసు. వారి అభ్యర్థనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి’అని మోహినిదే తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

కాగా, ఇదే ఇష్యూపై రెహమాన్‌ కొడుకు అమీన్‌ సోషల్‌ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించాడు. ‘మా నాన్న ఓ లెజెండ్‌. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement