ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు
కడియం: కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి. ఇంట్లో ఒకే గదిలో నిద్రిస్తున్న ఆరుగురిపై మేనల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. పెట్రోల్ పోసి నిప్పంటించాక, బయట తలుపునకు గొళ్లెం పెట్టేయడంతో ఒకే గదిలో ఉన్న వీరంతా బయటకు రాలేకపోయారు. తల్లి కోట్ని సత్యవతి (50), ఆమె కుమారుడు కోట్ని రాము (18), మనుమరాలు గంటా విజయలక్ష్మి (8) మృతి చెందారు. సత్యవతి కుమార్తె దుర్గాభవానీ, మనుమలు దుర్గామహేష్, ఏసుకుమార్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దుర్గాభవానీకి 90 శాతానికి పైగా కాలిన గాయాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మృతురాలు సత్యవతి భర్త అప్పారావు చెల్లెలి కొడుకు మాసాడ శ్రీను ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు భావిస్తున్నారు. మేనమామ కూతురినిచ్చి వివాహం చేస్తానని చెప్పి, అతడి వద్ద నుంచి ఆర్థిక సాయాన్ని పొందినట్టుగా చెబుతున్నారు. అయితే వివాహం చేయలేదు. మూడేళ్ల కిందట వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన డబ్బును తిరిగిచ్చేయాలని శ్రీను కొద్దిరోజులుగా మేనమామ కుటుంబంతో గొడవకు దిగుతున్నాడు. ఆరేళ్ల నుంచి ఈ ఘర్షణ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 17న పోలీసు కేసు కూడా నమోదైంది. కేసు విచారణలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, మంటల తీవ్రతకు వీరు అద్దెకు ఉంటున్న పెంకుటింటికి నిప్పంటుకుని కాలిపోయింది.
రాయవరంలో జరుగుతున్న తీర్థానికి వెళ్తున్న కొందరు యువకులు ఇల్లు కాలుతుండడాన్ని గమనించి తలుపు గొళ్లెం తొలగించి గదిలో ఉన్నవారిని, పక్కగదిలోనే ఉంటున్న ఇంటి యజమాని కానూరి రామాయమ్మను బయటకు తీసుకొచ్చారు. బాధితులను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో అప్పారావు ఇంట్లో లేరు. వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఆయన నైట్ డ్యూటీకి వెళ్లారు.