రేపు ఫాదర్స్ డే
కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు. షాపులో కూచుంటాడు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో. ఖర్చెంతో జమ ఎంతో.
కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిర్నవ్వు... అప్పుడప్పుడూ కోపం ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకు
మనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది.
ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగూరి నుంచి తన ఊరికి నడుస్తున్నాడు. ఐదారు మైళ్ల దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు. రాళ్ల వంటి వడగండ్లు. గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు లేదు. తల దాచుకోవడానికి చిన్నపాటి నీడ లేదు. పరిగెత్తి ఎక్కడికీ పారిపోవడానికి లేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడి పోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు.
కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నాడు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టాడు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయాడు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. ఈ కథలోని తండ్రి అమితాబ్ బచ్చన్ ముత్తాత. ఈ ఉదంతాన్ని అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన ఆత్మకథలో రాశాడు.
మరో ఉదంతంలో ... తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువున్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు మొదలెట్టాడు. అతడు జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్టే నేర్చుకుని చెప్పగలడు. లెక్కలు, ఇంగ్లిషు, సైన్సు, ఎకనమిక్సు, కామర్సు.... నేర్చుకోవడం... పిల్లలకు చెప్పడం... ఆ వచ్చే జీతం ఇంటికి... తనపై ఆధారపడ్డ బంధువులకు... ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి.
ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు... చెప్పి చెప్పి చెప్పి... సరైన తిండి లేదు.. విశ్రాంతి లేదు... విహారం లేదు... వినోదం లేదు.... బాధ్యత... బాధ్యత బాధ్యత.... పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు... కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైనా ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి తన తండ్రి గురించి చెప్పిన కథ.
కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గద్ద. నాలుగు గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి.
నాన్న అతి నిరాడంబరుడు. రెండు జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక్కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు.
దేశంలో డబ్బు లేని రోజులవి. నిస్సహాయ రోజులు. నాన్న ఎంత కష్టపడేవాడో. ఒకోసారి ఎంత కోప్పడేవాడో. ఆ పైన ఎంత బాధ పడేవాడో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని, కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధ పడేవాడో. అరడజను అరటి పండ్లు తెచ్చి ఏడుగురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్లోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవాడు. ‘సినిమాకెళ్తాం నాన్నా’ అనంటే కేకలేసేవాడు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవాడు.
లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు. ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవాడు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్లేవాడు. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న.
ఆరోగ్యం పట్టించుకోడు. అప్పుకు వెరవడు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతాడు. తన జ్ఞానం, కామన్‌సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్లు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయ పడతాడు.
తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూచోబెట్టలేనంత దూరం ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా?
భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలూ... మీ నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా గుర్తించండి. మీ బాల్యంలో యవ్వనంలో మీ కోసం ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో గడుపుతూ ఆయన మనసు మాట వినండి.
ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదా కబుర్లు చెబుతాడు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి నాన్నకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment