International Fathers Day
-
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
Fathers Day 2024: ఓ నాన్నా... నీ మనసే వెన్న...
కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు. షాపులో కూచుంటాడు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో. ఖర్చెంతో జమ ఎంతో.కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిర్నవ్వు... అప్పుడప్పుడూ కోపం ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకుమనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది.ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగూరి నుంచి తన ఊరికి నడుస్తున్నాడు. ఐదారు మైళ్ల దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు. రాళ్ల వంటి వడగండ్లు. గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు లేదు. తల దాచుకోవడానికి చిన్నపాటి నీడ లేదు. పరిగెత్తి ఎక్కడికీ పారిపోవడానికి లేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడి పోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు. కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నాడు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టాడు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయాడు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. ఈ కథలోని తండ్రి అమితాబ్ బచ్చన్ ముత్తాత. ఈ ఉదంతాన్ని అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన ఆత్మకథలో రాశాడు.మరో ఉదంతంలో ... తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువున్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు మొదలెట్టాడు. అతడు జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్టే నేర్చుకుని చెప్పగలడు. లెక్కలు, ఇంగ్లిషు, సైన్సు, ఎకనమిక్సు, కామర్సు.... నేర్చుకోవడం... పిల్లలకు చెప్పడం... ఆ వచ్చే జీతం ఇంటికి... తనపై ఆధారపడ్డ బంధువులకు... ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి. ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు... చెప్పి చెప్పి చెప్పి... సరైన తిండి లేదు.. విశ్రాంతి లేదు... విహారం లేదు... వినోదం లేదు.... బాధ్యత... బాధ్యత బాధ్యత.... పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు... కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైనా ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి తన తండ్రి గురించి చెప్పిన కథ.కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గద్ద. నాలుగు గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి.నాన్న అతి నిరాడంబరుడు. రెండు జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక్కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు.దేశంలో డబ్బు లేని రోజులవి. నిస్సహాయ రోజులు. నాన్న ఎంత కష్టపడేవాడో. ఒకోసారి ఎంత కోప్పడేవాడో. ఆ పైన ఎంత బాధ పడేవాడో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని, కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధ పడేవాడో. అరడజను అరటి పండ్లు తెచ్చి ఏడుగురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్లోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవాడు. ‘సినిమాకెళ్తాం నాన్నా’ అనంటే కేకలేసేవాడు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవాడు.లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు. ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవాడు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్లేవాడు. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న.ఆరోగ్యం పట్టించుకోడు. అప్పుకు వెరవడు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతాడు. తన జ్ఞానం, కామన్సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్లు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయ పడతాడు.తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూచోబెట్టలేనంత దూరం ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా?భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలూ... మీ నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా గుర్తించండి. మీ బాల్యంలో యవ్వనంలో మీ కోసం ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో గడుపుతూ ఆయన మనసు మాట వినండి.ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదా కబుర్లు చెబుతాడు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి నాన్నకు ఉంటుంది. -
నాన్నా! నన్నెందుకు కన్నావు? అని అమితాబ్ అడిగితే..
నేడు(జూన్ 18) అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. ఈ సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి.. ఆధునిక భారతీయ కవులలో హరివంశ్రాయ్ బచ్చన్ సుప్రసిద్ధుడు. హిందీ కవిత్వంలోని ‘నయీ కవితా’ ఉద్యమ సారథుల్లో ఆయన ఒకరు. ఆయన 135 రుబాయిలతో రాసిన ‘మధుశాల’ కావ్యం ఆధునిక హిందీ కవిత్వానికి తలమానికంగా నిలిచే కావ్యాలలో ఒకటి. హిందీ సాహిత్యరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా హరివంశ్రాయ్ బచ్చన్ ‘పద్మభూషణ్’ పొందారు. హరివంశ్రాయ్ బచ్చన్ భార్య తేజీ బచ్చన్ కూడా కవయిత్రి. తల్లిదండ్రుల రంగంలో కాకుండా, భిన్నమైన రంగాన్ని ఎంచుకున్నప్పటికీ అమితాబ్ బచ్చన్‌పై తండ్రి ప్రభావం చాలానే ఉంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ తొలినాళ్లలో నానా ఇక్కట్లు, తిరస్కారాలు ఎదుర్కొన్నా, సూపర్‌స్టార్‌గా ఎదిగి, బాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకున్నాడు. (చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? సనాతన ద్రోహినా?: రచయిత భావోద్వేగం) కష్టాలు పడుతున్న కాలంలో అమితాబ్ ఒకనాడు పట్టరాని ఉక్రోషంతో తండ్రి గదిలోకి వెళ్లి ‘నాన్నా! నన్నెందుకు కన్నావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఏదో రాసుకుంటూ ఉన్న హరివంశ్రాయ్ బచ్చన్ కొడుకు అడిగిన ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు. సాలోచనగా అతన్ని ఒకసారి తేరిపార చూశారు. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కాసేపటికి అమితాబ్ ఆ గది నుంచి వెళ్లిపోయాడు. మర్నాటి ఉదయమే హరివంశ్రాయ్ తన కొడుకును నిద్రలేపి, చేతిలో ఒక కాగితం ఉంచారు. అందులో ఈ కవిత ఉంది: ‘నా కొడుకు నన్నడిగాడు– నన్నెందుకు కన్నావని బదులు చెప్పడానికి నా వద్ద సమాధానమేదీ లేదు. నన్ను కనడానికి ముందు నా తండ్రి నన్నడగలేదు. నా తండ్రిని ఈ లోకంలోకి తెచ్చేటప్పుడు నా తాత కూడా అతణ్ణి అడగలేదు... నువ్వెందుకు కొత్త ప్రారంభానికి, కొత్త ఆలోచనకు నాంది పలకరాదు? నీ పిల్లలను కనే ముందు నువ్వు వాళ్లనడుగు’ అమితాబ్ ఆలోచనలో మార్పు తెచ్చిన కవిత ఇది. ఒక సందర్భంలో ఈ కవితను ప్రస్తావించాడాయన. తనను ప్రభావితం చేసిన తన తండ్రిని అమితాబ్ సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకుంటూనే ఉంటాడు. -
ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ.. ప్రపంచాన్ని మనకు చూపేది నాన్న...
ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ.. ప్రపంచాన్ని మనకు చూపేది నాన్న. అమ్మ జన్మనిస్తే.. నాన్న ఆ జన్మకు రూపమిస్తారు. తల్లి అంటే ఎంత ప్రేమో...తండ్రి అంటే కూడా అంతే ప్రేమ. నాన్న గంభీరంగా ఉంటారు.. అందుకే పిల్లలు నాన్నకు భయపడతారు. కానీ.. నాన్నకు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం సెకను కూడా ఆగలేరు. అదే పిల్లలకు, నాన్నకు మధ్య ఉన్న అనుబంధం. తండ్రి పిల్లల కల నెరవేర్చడానికి కష్టపడుతుంటారు. ఎన్నో త్యాగాలు చేసి పిల్లల మొహంలో సంతోషాన్ని నింపాలనుకుంటారు. అదే నాన్న గొప్పతనం. నేడు ఫాదర్స్ డే.. ఈ సందర్భంగా నాన్నతో పలువురి బంధం.. అనుబంధం.. కష్టజీవి.. సాక్షిప్రతినిధి కరీంనగర్/కరీంనగర్: మాది వెల్గటూర్ మండలం పైడిపల్లి. వ్యవసాయక కుటు ంబం. నాన్న గంగుల మల్లయ్య పటేల్. వ్యవసాయం, కాంట్రాక్ట్ పనులు చేయించేది. నలు గురు అన్నదమ్ములమైన మమ్మల్ని ఉన్నతంగా చదివించాలని ఆరాటపడేవారు. గ్రామంలో ఎ వరికీ ఏ ఆపద వచ్చినా.. డబ్బులు సర్దుబాటు చేసేవారు. నాన్న ప్రోత్సాహంతో రాజకీయాల్లో చేరి 25ఏళ్లుగా కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మె ల్యే, మంత్రిగా ప్రజాసేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాన్న పేరు నిలబెట్టాననే ఆనందం ఉంది. – గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి పుస్తక పఠనంపై ఆసక్తి సాక్షిప్రతినిధి కరీంనగర్/కరీంనగర్: నాన్న జననేషన్ వీరరాఘవన్ కవి. ఉద్యోగ రీత్యా లైబ్రేరియన్ కావడంతో నాకు చిన్నçప్పటి నుంచి పుస్తక పఠనంపై ఆసక్తి. నాన్న రాసిన కథల నుంచి స్ఫూర్తి పొంది చదువుపై మమకారం పెరిగింది. నాన్న చూపిన చొరవ నన్ను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడానికి దోహదపడింది. – ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్ జీవిత గురువు జగిత్యాల: నాన్న మాకునూరి హన్మంతరావు 63ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేశారు. ఆయనే నా తొలిగురువు. నాన్న ప్రోత్సాహంతోనే వైద్య, రాజకీయ రంగంలోకి వచ్చా. నాన్నకు వ్యవసాయమంటే మక్కువ. ఆయన ఆలోచనకు అనుగుణంగా మెడిసిన్ పూర్తి చేసి నేత్రవైద్యుడిగా ఇప్పటివరకు 30వేల మందికి పైగా ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశాను. ఎమ్మెల్యేగా ఎంతబిజీగా ఉన్నా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నా. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సాయంత్రం కాసేపు నాన్నతో మాట్లాడితే ఒక స్నేహితుడితో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది. నాన్నే నాకు ఆత్మీయ మిత్రుడు. – సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే ప్రోత్సాహం మరువలేనిది సాక్షిప్రతినిధికరీంనగర్/కరీంనగర్: నాన్న సత్యనారాయణమూర్తి ఎస్బీఐలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. కుటుంబ బాధ్యతలు అన్ని భుజాన వేసుకున్నారు. కష్టపడి అందరినీ ప్ర యోజకులను చేశారు. నన్ను డాక్టర్ కావాలని సూచించేవారు. ఇంజినీరింగ్‌పై ఆసక్తితో బీటె క్ పూర్తి చేసి.. గ్రూప్స్రాసి ఉద్యోగం సాధించాను. – ప్రియాంక, జెడ్పీ సీఈవో, కరీంనగర్ నాన్నే స్ఫూర్తి సాక్షిప్రతినిధి కరీంనగర్/కరీంనగర్: నాన్న సుగుణాకర్‌రావు అలియాస్ రాజేశ్వరరావు వృత్తి రీత్యా కాంట్రాక్టర్. చిన్నప్పటి నుంచే నాన్నలోని ముక్కు సూటితనం, ధైర్యం సేవా గుణం ఆకట్టుకుంది. చదువుకుంటున్న సమయంలోనే నాకు రాజకీయ లక్షణాలు వచ్చాయి. 20 ఏళ్లుగా రాజకీయ పదువులలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేసే విషయంలో నాన్నే స్ఫూర్తి. – వై.సునీల్‌రావు, మేయర్, కరీంనగర్ బట్టలు కుట్టి.. పాలకుర్తి: నాన్న దర్జీ పని చేస్తూ చదివించారు. ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా.. ఆయన ఆలోచన విధానాలు మా వెంటే ఉన్నాయి. బసంత్‌నగర్‌లో నాన్న పరికిపండ్ల సత్యనారాయణ స్మారకార్థం ఉచిత కంటి ఆసుపత్రి నిర్మించి పేదలకు సేవ చేస్తున్నాం. – పరికిపండ్ల నరహరి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఐఅండ్ పీఆర్ కమిషనర్ కొండంత అండ సాక్షి, పెద్దపల్లి: నాన్న కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ. రాజకీయాల్లో బిజీగా ఉన్నా నాకోసం రోజూ కొంత సమయం కేటాయించేవారు. బాల్యంలో చదువు నిర్లక్ష్యం చేయవద్దని కొంత కఠినంగా చెప్పినా, ఉన్నత చదువులు, వృత్తిని ఎంచుకునే సమయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నాన్న నాకు మంచి స్నేహితుడు, అంతకు మించి విమర్శకుడు. నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తరువాత మనం ఒకప్పుడు పేదవాళ్లమే.. సాయం కోసం నీ దగ్గరకు వచ్చే వారితో సొంత మనిషిలా వ్యవహరిస్తూ.. సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించాలని చెప్పారు. ఇప్పటికీ నాన్న ఇచ్చే సలహాలనే పాటిస్తా. – డాక్టర్ సంగీత సత్యనారాయణ, కలెక్టర్ పెద్దపల్లి నాన్న నుంచే కష్టపడే తత్వం.. సిరిసిల్లక్రైం: నాన్న రాకేశ్‌కుమార్ గుప్తా. కిరాణం నడిపే వారు. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు షాపు నడపడం చూశా. సామాజిక సేవకు నాన్నే గురువు. తనతో సంతోషంగా గడిపిన రోజులు చాలా ఉన్నాయి. నేను ఐపీఎ‹స్కు ఎంపికయ్యాక నాన్నతో కలిసి దిగిన ఫొటో నేనెప్పుడూ మరిచిపోలేను. – అఖిల్ మహాజన్, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల నాన్న మాటలే దారి చూపాయి సాక్షిప్రతినిధికరీంనగర్/కరీంనగర్: నాన్న లక్ష్మయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇంటినుంచి వెళ్లాలంటే కలెక్టర్ కార్యాల యం ముందు నుంచే వెళ్లేవా రు. కలెక్టర్ అంటే జిల్లాకు అధికారి అని ఏ పని అయిన చేయవచ్చనని నాన్న ఇతరులతో మాట్లాడే సందర్భాలు నన్ను కదిలించాయి. ప్రతీరోజు దినపత్రికలు చదివే నాన్నను చూసి నేనూ పేపర్లు చదివేవాడిని. ఆయన స్ఫూర్తితోనే సివిల్స్‌లో 94వ ర్యాంకు సాధించాను. – ఆవుల సాయికృష్ణ, సివిల్స్ ర్యాంకర్, కరీంనగర్ ఇంట్లోనూ పాఠాలే చెప్పారు కోరుట్ల: నాన్న అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వ్యవసాయం కూడా ఉండడంతో పొలం, స్కూల్ రెండూ చూసుకునేవారు. మేము చదువుపై దృష్టి పెట్టేలా శ్రద్ధ తీసుకునేవాడు. ప్రభుత్వ టీచర్ అయినా జీతం తక్కువే . అమ్మ పుష్పలత వ్యవసాయ పనులు చూçస్తూ్త ఉండటం.. వచ్చే డబ్బులతో నా చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. సివిల్స్ ఫలితాలు వచ్చిన రోజు నేను ఢిల్లీలోనే ఉన్న. నాన్నకు ఫోన్ చేసి 132వ ర్యాంకు వచ్చిందని చెప్పగానే ఉద్వేగంతో..‘కంగ్రాట్స్’అన్నారు. నాన్న కల నెరవేర్చానన్న తృప్తి మిగిలింది. – ఏనుగు శివమారుతిరెడ్డి, సివిల్స్ ర్యాంకర్, కోరుట్ల సజ్జలు అమ్మి చదివించారు సిరిసిల్ల: మాది నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గాజినగర్. అమ్మ పార్వతి, నాన్న మాన్యానాయక్. నలుగురం అన్నదమ్ములం, ఐదుగురు అక్కలు. నేను చిన్నోడిని. నన్ను చెల్లెను మాత్రమే చదివించారు. నాన్న వ్యవసాయం చేసేవారు. నీటి వసతి లేని భూమి ఉండేది. మా ఊరి దగ్గర పెళ్లిపాకాల చెరువులో చేపలు పట్టేవారు. నేను దేవరకొండలో హాస్టల్లో ఉండి చదువుకున్న. ఇంటర్ బైపీసీలో సైన్స్బాక్స్ కొనేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లోని సజ్జలు అమ్మారు. నాకు వ్యవసాయ పనులు నేర్పించారు. డిగ్రీ కాగానే స్పెషల్ టీచర్‌గా పని చేశా. ఆర్టీసీ కండక్టర్‌గా, గోదాం మేనేజర్‌గా చేశా. 1995లో గ్రూప్–2 ద్వారా రెవెన్యూశాఖలో ఉద్యోగం వచ్చింది. నేను తహసీల్దార్‌గా ఉండగా.. 2007లో నాన్న చనిపోయారు. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే నాన్న చలువే. – నేనావత్ ఖీమ్యానాయక్, అదనపు కలెక్టర్, రాజన్న సిరిసిల్ల తండ్రి జ్ఞాపకంగా విగ్రహం జమ్మికుంట: ఇప్పటివరకు రాజకీయనాయకులు.. ఉన్నతమైన వ్యక్తులకు మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేయడం చూశాం. కానీ.. ఓ తండ్రి చనిపోతే.. ఆయన జ్ఞాపకంగా విగ్రహం ఏర్పాటు చేశారు అతని పిల్లలు. అక్కడే ఏటా జయంతి, వర్ధంతి నిర్వహిస్తున్నారు. జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన పొట్లపల్లి జయరామారావు పట్వారి. పట్వారి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ తొలి ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. జమ్మికుంట జెడ్పీటీసీగా పనిచేశాడు. మూడేళ్లక్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఆయన కొడుకు పొట్లపల్లి శ్రీధర్‌బాబు, కూతురు కంకటి శ్రీదేవి వ్యవసాయక్షేత్రం జయరామారావు విగ్రహం ఏర్పాటు చేశారు. ఏటా జయంతి, వర్ధంతి నిర్వహిస్తున్నారు. మా ఫాదర్ గ్రేట్ కోల్‌సిటీ(రామగుండం): మా నాన్న బుచ్చి రాజం. నాతో ఫ్రెండ్‌లా ఉంటారు. హిందీ టీచర్‌గా పని చేసి రిటైర్ అ య్యారు. ఇప్పు డు 82 ఏళ్లు. నాన్న నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ బీటెక్ చేసి, మున్సిపల్ కమిషనర్ అయ్యా. ప్రయోజకుడివయ్యావని అభినందించారు. ఇంత వయసొచ్చినా నాన్నకు ఇంకా నేను పిల్లాడినే. 1991లో హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ చదువుతున్న సమయంలో ఒకరోజు జగిత్యాలలోని మా ఇంట్లో భోజనం తయారు చేసి బస్సులో పట్టుకొచ్చాడు. కాసేపు మాట్లాడితే సంతృప్తిగా ఉంటుంది. మా ఫాదర్ గ్రేట్. – బి.సుమన్‌రావు, కమిషనర్, రామగుండంనగరపాలక సంస్థ కిడ్నీ ఇచ్చి బతికించారు కోల్‌సిటీ(రామగుండం): మాది గోదావరిఖనిలోని రమేశ్‌నగర్. ప్రస్తుతం కర్నాటకలో బళ్లారిలోని ఓ స్టీల్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న. నాన్న కిష్టయ్య సింగరేణిలో పని చేసి రిటైర్ట్ అయ్యారు. నాకు 2004లో కిడ్నీలు చెడిపోయాయి. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే తప్ప బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. దీంతో నాన్న, అమ్మ సుశీల ఆర్థికంగా, మానసింగా చాలా కష్టపడ్డారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై ఉన్న నాకు కిడ్నీదానం చేయడానికి నాన్న ముందుకు వచ్చారు. చాలా మంది వద్దని వారించారు. కానీ నా కొడుకు బతుకు ముఖ్యమంటూ కిడ్నీఇచ్చి నన్ను బతికించుకున్నాడు. – పోతర్ల జయాకర్ రాజు, సీనియర్ మేనేజర్, బళ్లారి, కర్నాటక -
నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే: పాయల్ రాజ్‌పుత్
‘తండ్రీకూతుళ్ల అనుబంధం అపురూపమైనది.. మాటల్లో వర్ణించలేనిది. నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే. అర్ధరాత్రివరకూ సాగే కబుర్లు, సరదా ఆటలు, చిన్నపాటి సాహసాలు వంటివి తండ్రీకూతుళ్ల అనుబంధాలను చాలా స్పెషల్‌గా మార్చుతాయి. మా లైఫ్‌లో అలాంటి ప్రత్యేక సమయాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారే నా బలం. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆయనే’ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి విమల్‌కుమార్ రాజ్‌పుత్ గురించి పాయల్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ► జీవితం అంటే ఏంటో మా నాన్న నాకు నేర్పించారు. అలాగే మనతో మనం నిజాయతీగా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కో డైరెక్షన్లో వెళుతుంది. తండ్రీ కూతురి జీవితం కూడా అంతే. మా లైఫ్ వెళ్లే డైరెక్షన్ ఏదైనా మా బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. అది ‘అన్బ్రేకబుల్’. ► చాలా విషయాల్లో మా నాన్న నాకు స్ఫూర్తిగా ఉంటారు. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులను ధైర్యంగా, సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి? వాటి నుంచి తిరిగి ఎలా పుంజుకోవాలి? అనే విషయాలు మాత్రం నాన్న నుంచే నేర్చుకున్నాను. అలాగే తోటివారితో ఎలా మసులుకోవాలో కూడా ఆయన్ను చూసే తెలుసుకున్నాను. హార్డ్‌వర్క్ చేసేవారికి ఉండే విలువ ఏంటో నాన్న నాకు చెప్పారు. అలాగే మనం నమ్మిన విషయానికి కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. నా కలల విషయంలో రాజీ పడకుండా నన్ను నేను ఓ బెటర్ పర్సన్‌గా తీర్చిదిద్దుకోవడానికి మా నాన్నగారి మాటలు, ఆచరణ విధానాలే నాకు దోహదపడ్డాయి. ► మా నాన్న చాలా ట్రెడిషనల్. నేను యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నా.. నటనపై నాకు ఉన్న ప్యాషన్‌ను, సినిమా ఇండస్ట్రీ పంథాను అర్థం చేసుకున్నాక నన్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వృత్తిపరంగా నిరూపించుకునే విషయంలో అసలు ఏ మాత్రం తగ్గొద్దు అని అంటుంటారు. అంతేకాదు..కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. నిజానికి మా నాన్న ఒకప్పుడు యాక్టర్ కావాలనుకున్నారు. అయితే కుదరలేదు. ఇప్పుడు ఆయన కలను నేను నిజం చేసినందుకు గర్వంగా ఉంది. ► ఓ నటిగా నా కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మా నాన్న నాతో మరింత ఆప్యాయంగా మాట్లాడతారు. ‘నీ ప్రయాణంలో జయాపజయాలు ఓ భాగం మాత్రమే. వైఫల్యాలు ఎదురైతే వాటిని మైండ్‌కు ఎక్కించుకోకు. ఏదైనా తాత్కాలికమే. ఏదీ శాశ్వతం కాదు. సో.. జీవితం ఎలా వస్తే అలా ఉండు.. హ్యాపీగా ఉండు’ అంటారు. -
నాన్న పాటలు మాటలు
అంతర్జాల ప్రపంచంలో ‘ఫాదర్స్ డే’ సందడి మూడు నాలుగు రోజుల క్రితమే మొదలైంది. ‘ఫాదర్స్ డే రోజు వినాల్సిన బాలీవుడ్ ఫేమస్ పాటలు’ ‘తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న కథానాయికలు’ ‘ఫాదర్స్ డే రోజు తండ్రితో కలిసి చూడాల్సిన సినిమాలు’... ఇలా ఎన్నో విషయాలపై నెటిజనుల పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని... ‘ఫాదర్స్ డే’ రోజు వినాల్సిన పాటల విషయానికి వస్తే... అమీర్‌ఖాన్ సినిమా ‘ఖయామత్ సే ఖయామత్’లోని ‘పప్పా కెహ్తహై’... అక్షయ్ కుమార్ ‘బాస్’ సినిమాలోని ‘పితా సే హై నామ్ తేరా’ ‘యారా దిల్ దారా’ సినిమాలోని ‘హమారా పప్పా ఔర్ హమ్’... ఆలియాభట్ ‘రాజీ’ సినిమాలోని ‘దిల్బరో’... ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. ఇక తెలుగు పాటల విషయానికి వస్తే ‘నాన్నా నీ మనసే వెన్నా’ ఆల్‌టైమ్ ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో...’ పాట, చిరంజీవి ‘డాడీ’ సినిమాలోని ‘గుమ్మాడి గుమ్మాడీ’, విక్రమ్ ‘నాన్న’ సినిమాలో ‘పప్పా పప్పా’ కమల్‌హాసన్ ‘ఇంద్రుడు–చంద్రుడు’లో ‘లాలిజో లాలీజో చెప్పవే పాపాయి’... మొదలైన పాటలు ‘ఫాదర్స్ డే’ రోజు వినిపించే పాటలు. తండ్రీ కూతుళ్లు బంధాన్ని ప్రతిబింబించే ‘దంగల్’ ‘అంగ్రేజీ మీడియం’ ‘పికు’ ‘తప్పడ్’... మొదలైన బాలీవుడ్ సినిమాల గురించి కొందరు పోస్ట్‌లు పెట్టారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న అందాల కథానాయికలు శ్రద్ధా కపూర్, అనన్య పాండే, కరీనా కపూర్, ఆలియాభట్, సోనాక్షి సిన్హా, సోనాల్ కపూర్... మొదలైన వారి గురించి ప్రశంసాపూర్వకంగా రాశారు. నాన్న నాకు ప్రపంచంలోని అత్యంత విలువైన కానుక ఇచ్చాడు. ఆ కానుక పేరు... ప్రేమ. – సోనాల్ కపూర్ నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఏర్పర్చుకున్న అభిప్రాయం సరిౖయెనది అనిపిస్తే ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు... అని నాన్న చెప్పే మాట నాకు చాలా ఇష్టం. – సోనాక్షి సిన్హా స్కూల్లో డ్రాప్ చేసిన, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మెచ్చుకున్న, సరదాగా నాతో ఆడుకున్న నాన్నతో నా ప్రతీ జ్ఞాపకం అపురూపం. – సుహానా ఖాన్ బాగా కష్టడాలి. మంచి ఫలితాన్ని ఆశించాలి. ఓటమికి చేరువ అవుతున్నాను... అనే భయంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు... అని నాన్న తరచు చెప్పేవారు. – అనన్య పాండే నాకు నచ్చిన ఇద్దరు పిల్లలు... మా నాన్న రణŠ ధీర్కపూర్, మా అబ్బాయి జె అలీఖాన్! – కరీనా కపూర్ మా నాన్న చాలా భిన్నంగా ఆలోచిస్తారు. వాటిని అర్థం చేసుకుంటే జీవితం లోతుపాతులు అర్థం అవుతాయి. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది తెలుస్తుంది. పిల్లలను సినిమాలు, పార్క్‌లకు తీసుకెళ్లడమే తండ్రి బాధ్యత అని ఆయన అనుకోలేదు. చిన్న చిన్న మాటలతోనే గొప్ప విషయాలు చెప్పడం ఆయన ప్రత్యేకత. ‘యూ మస్ట్ ఫెయిల్’ అని ఏ తండ్రి అయినా అంటాడా? మా నాన్న అనేవాడు! ఒక్క ఫెయిల్యూర్ ఎన్ని పాఠాలు నేర్పుతుంది!! – ఆలియా భట్ -
మా నాన్న నా బెస్ట్ హ్యూమన్: శ్రుతీహాసన్
‘మా నాన్న నా బెస్ట్ హ్యూమన్’ అన్నారు శ్రుతీహాసన్. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తండ్రి కమల్‌హాసన్ గురించి శ్రుతి చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► మా చైల్డ్‌హుల్డ్ చాలా కంఫర్టబుల్. నాన్నగారు నన్ను, చెల్లి (అక్షరా హాసన్)ని చెన్నైలో మంచి ప్రైవేట్ స్కూల్లో చదివించారు. ఆ తర్వాత అమెరికాలో బెస్ట్ కాలేజీలో చేర్చారు. మంచి ఫుడ్, మంచి బట్టలు, ఖరీదు గల కార్లు, మంచి ఇల్లు... ది బెస్ట్ ఇచ్చారు. 21ఏళ్లకే నేను హీరోయిన్ అయి, సంపాదించడం మొదలుపెట్టాను. నిజానికి నాన్న చాలా స్వేచ్ఛ ఇస్తారు. ఆయనతో ఏ విషయాన్నయినా చెప్పుకునేంత స్వేచ్ఛ మాకుంది. తండ్రి మీద ప్రేమతో పాటు చాలా గౌరవం కూడా ఉంటుంది కాబట్టి... ఆ గౌరవంతో మాకు మేముగా కొన్ని హద్దులు పెట్టుకుంటాం. మన నాన్న మనకు బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు ఆ కూతురికి అంతకన్నా కావాల్సినది ఏముంటుంది? ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు.. నా ఫేవరెట్ హ్యూమన్ కూడా. ► ఎవరి దగ్గరైతే జీవితం గురించి చాలా విషయాలు నేర్చుకుంటామో, ఎవరైతే మనల్ని బాగా నవ్విస్తారో ఆ వ్యక్తే మన తండ్రి అయితే ఇక అదే పెద్ద ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం దక్కి నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎప్పటికీ నాకు ‘డియరస్ట్ డాడ్’గా ఉంటున్నందుకు మా నాన్నకి థ్యాంక్స్. ‘హ్యాపీ ఫాదర్స్ డే’. ► బర్త్ డే, ఫాదర్స్ డే.. అంటూ ముందుగా ప్లాన్ చేసుకుని మా ఇంట్లో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయం. సో.. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మా నాన్నకు శుభాకాంక్షలు చెబుతాను. మా నాన్నగారు సాధించిన విజయాలకు నేనెప్పటికీ గర్వపడుతుంటాను. ఇప్పటికీ ఆయన అదే ఎనర్జీతో కొనసాగుతున్నారు. ప్రొఫెషన్ అంటే అదే ప్యాషన్. ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. మా నాన్న పరంగా నేను గర్వించే విషయాల్లో ఇవి. జీవితం పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్ నాకే కాదు... నాలాంటివారికెందరికో స్ఫూర్తి. మా నాన్నలా తమ ఇళ్లలో సమానత్వాన్ని పాటిస్తూ, ప్రోత్సహిస్తున్న గుడ్ ఫాదర్స్ అందరికీ ఈ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. -
అరకే ఊయల
ఆదిలాబాద్ మండలంలోని లాండసాంగ్రి గ్రామంలో తన పొలంలో అరక దున్నుతూ... అదే అరకకు ఊయల కట్టి అందులో బిడ్డను పడుకోబెట్టి లాలిపాట పాడుతూ కలుపు తొలగిస్తున్న తండ్రి పరమేశ్వర్. - ఆదిలాబాద్ నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం