ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ.. ప్రపంచాన్ని మనకు చూపేది నాన్న... | International Fathers Day 2023 | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ.. ప్రపంచాన్ని మనకు చూపేది నాన్న...

Published Sun, Jun 18 2023 12:02 PM | Last Updated on Sun, Jun 18 2023 12:02 PM

International Fathers Day 2023 - Sakshi

ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ.. ప్రపంచాన్ని మనకు చూపేది నాన్న. అమ్మ జన్మనిస్తే.. నాన్న ఆ జన్మకు రూపమిస్తారు. తల్లి అంటే ఎంత ప్రేమో...తండ్రి అంటే కూడా అంతే ప్రేమ. నాన్న గంభీరంగా     ఉంటారు.. అందుకే పిల్లలు నాన్నకు భయపడతారు. కానీ.. నాన్నకు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం సెకను కూడా ఆగలేరు. అదే పిల్లలకు, నాన్నకు మధ్య ఉన్న అనుబంధం. తండ్రి పిల్లల కల నెరవేర్చడానికి     కష్టపడుతుంటారు. ఎన్నో త్యాగాలు చేసి పిల్లల మొహంలో     సంతోషాన్ని నింపాలనుకుంటారు. అదే నాన్న గొప్పతనం. నేడు ఫాదర్స్‌ డే.. ఈ సందర్భంగా నాన్నతో పలువురి బంధం.. అనుబంధం..  

కష్టజీవి..
సాక్షిప్రతినిధి కరీంనగర్‌/కరీంనగర్‌: మాది     వెల్గటూర్‌ మండలం పైడిపల్లి. వ్యవసాయక కుటు ంబం. నాన్న గంగుల మల్లయ్య పటేల్‌. వ్యవసాయం, కాంట్రాక్ట్‌ పనులు చేయించేది. నలు గురు అన్నదమ్ములమైన మమ్మల్ని ఉన్నతంగా చదివించాలని ఆరాటపడేవారు. గ్రామంలో ఎ వరికీ ఏ ఆపద వచ్చినా.. డబ్బులు సర్దుబాటు చేసేవారు. నాన్న ప్రోత్సాహంతో రాజకీయాల్లో చేరి 25ఏళ్లుగా కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మె ల్యే, మంత్రిగా ప్రజాసేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాన్న పేరు నిలబెట్టాననే ఆనందం ఉంది. 
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి

పుస్తక పఠనంపై ఆసక్తి
సాక్షిప్రతినిధి కరీంనగర్‌/కరీంనగర్‌: నాన్న జననేషన్‌ వీరరాఘవన్‌  కవి. ఉద్యోగ రీత్యా లైబ్రేరియన్‌ కావడంతో నాకు చిన్నçప్పటి నుంచి పుస్తక పఠనంపై ఆసక్తి. నాన్న రాసిన కథల నుంచి స్ఫూర్తి పొంది చదువుపై మమకారం పెరిగింది. నాన్న చూపిన చొరవ నన్ను సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావడానికి దోహదపడింది. – ఆర్వీ కర్ణన్, కరీంనగర్‌ కలెక్టర్‌

జీవిత గురువు
జగిత్యాల: నాన్న మాకునూరి హన్మంతరావు 63ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేశారు. ఆయనే నా తొలిగురువు. నాన్న ప్రోత్సాహంతోనే వైద్య, రాజకీయ రంగంలోకి వచ్చా. నాన్నకు వ్యవసాయమంటే మక్కువ. ఆయన ఆలోచనకు అనుగుణంగా మెడిసిన్‌ పూర్తి చేసి నేత్రవైద్యుడిగా ఇప్పటివరకు 30వేల మందికి పైగా ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశాను. ఎమ్మెల్యేగా ఎంతబిజీగా ఉన్నా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నా. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సాయంత్రం కాసేపు నాన్నతో మాట్లాడితే ఒక స్నేహితుడితో మాట్లాడిన ఫీలింగ్‌ ఉంటుంది. నాన్నే నాకు ఆత్మీయ మిత్రుడు.
– సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే

ప్రోత్సాహం మరువలేనిది 
సాక్షిప్రతినిధికరీంనగర్‌/కరీంనగర్‌: నాన్న సత్యనారాయణమూర్తి ఎస్‌బీఐలో ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యారు. కుటుంబ బాధ్యతలు అన్ని భుజాన వేసుకున్నారు. కష్టపడి అందరినీ ప్ర యోజకులను చేశారు. నన్ను డాక్టర్‌ కావాలని సూచించేవారు.  ఇంజినీరింగ్‌పై  ఆసక్తితో బీటె క్‌ పూర్తి చేసి.. గ్రూప్స్‌రాసి ఉద్యోగం సాధించాను. – ప్రియాంక, జెడ్పీ సీఈవో, కరీంనగర్‌ 

నాన్నే స్ఫూర్తి
సాక్షిప్రతినిధి కరీంనగర్‌/కరీంనగర్‌: నాన్న సుగుణాకర్‌రావు అలియాస్‌ రాజేశ్వరరావు వృత్తి రీత్యా కాంట్రాక్టర్‌. చిన్నప్పటి నుంచే నాన్నలోని ముక్కు సూటితనం, ధైర్యం సేవా గుణం ఆకట్టుకుంది. చదువుకుంటున్న సమయంలోనే నాకు  రాజకీయ లక్షణాలు వచ్చాయి. 20 ఏళ్లుగా రాజకీయ పదువులలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేసే విషయంలో నాన్నే స్ఫూర్తి. 
– వై.సునీల్‌రావు, మేయర్, కరీంనగర్‌  

బట్టలు కుట్టి..
పాలకుర్తి: నాన్న దర్జీ పని చేస్తూ చదివించారు. ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా.. ఆయన ఆలోచన విధానాలు మా వెంటే ఉన్నాయి. బసంత్‌నగర్‌లో నాన్న పరికిపండ్ల సత్యనారాయణ స్మారకార్థం ఉచిత కంటి ఆసుపత్రి నిర్మించి పేదలకు సేవ చేస్తున్నాం.                  – పరికిపండ్ల నరహరి,
 మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్‌ 

కొండంత అండ 
సాక్షి, పెద్దపల్లి: నాన్న కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ. రాజకీయాల్లో బిజీగా ఉన్నా నాకోసం రోజూ కొంత సమయం కేటాయించేవారు. బాల్యంలో చదువు నిర్లక్ష్యం చేయవద్దని కొంత కఠినంగా చెప్పినా, ఉన్నత చదువులు, వృత్తిని ఎంచుకునే సమయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నాన్న నాకు మంచి స్నేహితుడు, అంతకు మించి విమర్శకుడు. నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తరువాత మనం ఒకప్పుడు పేదవాళ్లమే.. సాయం కోసం నీ దగ్గరకు వచ్చే వారితో సొంత మనిషిలా వ్యవహరిస్తూ.. సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించాలని చెప్పారు. ఇప్పటికీ నాన్న ఇచ్చే సలహాలనే పాటిస్తా.
– డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, కలెక్టర్‌ పెద్దపల్లి

నాన్న నుంచే కష్టపడే తత్వం..
సిరిసిల్లక్రైం: నాన్న రాకేశ్‌కుమార్‌ గుప్తా. కిరాణం నడిపే వారు. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు షాపు నడపడం చూశా. సామాజిక సేవకు నాన్నే గురువు. తనతో సంతోషంగా గడిపిన రోజులు చాలా ఉన్నాయి. నేను ఐపీఎ‹స్‌కు ఎంపికయ్యాక నాన్నతో కలిసి దిగిన ఫొటో నేనెప్పుడూ మరిచిపోలేను. 
– అఖిల్‌ మహాజన్, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల 

నాన్న మాటలే దారి చూపాయి
సాక్షిప్రతినిధికరీంనగర్‌/కరీంనగర్‌: నాన్న లక్ష్మయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇంటినుంచి వెళ్లాలంటే కలెక్టర్‌ కార్యాల యం ముందు నుంచే వెళ్లేవా రు. కలెక్టర్‌ అంటే జిల్లాకు అధికారి అని ఏ పని అయిన చేయవచ్చనని నాన్న ఇతరులతో మాట్లాడే సందర్భాలు నన్ను కదిలించాయి. ప్రతీరోజు దినపత్రికలు చదివే  నాన్నను చూసి నేనూ పేపర్లు చదివేవాడిని. ఆయన స్ఫూర్తితోనే సివిల్స్‌లో 94వ ర్యాంకు సాధించాను.
– ఆవుల సాయికృష్ణ, సివిల్స్‌ ర్యాంకర్, కరీంనగర్‌

ఇంట్లోనూ పాఠాలే చెప్పారు 
కోరుట్ల: నాన్న అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వ్యవసాయం కూడా ఉండడంతో పొలం, స్కూల్‌ రెండూ చూసుకునేవారు. మేము చదువుపై దృష్టి పెట్టేలా శ్రద్ధ తీసుకునేవాడు. ప్రభుత్వ టీచర్‌ అయినా జీతం తక్కువే . అమ్మ పుష్పలత వ్యవసాయ పనులు చూçస్తూ్త ఉండటం.. వచ్చే డబ్బులతో నా చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. సివిల్స్‌ ఫలితాలు వచ్చిన రోజు నేను ఢిల్లీలోనే ఉన్న. నాన్నకు ఫోన్‌ చేసి 132వ ర్యాంకు వచ్చిందని చెప్పగానే ఉద్వేగంతో..‘కంగ్రాట్స్‌’అన్నారు. నాన్న కల నెరవేర్చానన్న తృప్తి మిగిలింది.
– ఏనుగు శివమారుతిరెడ్డి, సివిల్స్‌ ర్యాంకర్, కోరుట్ల

సజ్జలు అమ్మి చదివించారు
సిరిసిల్ల: మాది నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గాజినగర్‌. అమ్మ పార్వతి, నాన్న మాన్యానాయక్‌. నలుగురం అన్నదమ్ములం, ఐదుగురు అక్కలు. నేను చిన్నోడిని. నన్ను చెల్లెను మాత్రమే చదివించారు. నాన్న వ్యవసాయం చేసేవారు. నీటి వసతి లేని భూమి ఉండేది. మా ఊరి దగ్గర పెళ్లిపాకాల చెరువులో చేపలు పట్టేవారు. నేను దేవరకొండలో హాస్టల్‌లో ఉండి చదువుకున్న. ఇంటర్‌ బైపీసీలో సైన్స్‌బాక్స్‌ కొనేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లోని సజ్జలు అమ్మారు. నాకు వ్యవసాయ పనులు నేర్పించారు. డిగ్రీ కాగానే స్పెషల్‌ టీచర్‌గా పని చేశా. ఆర్టీసీ కండక్టర్‌గా, గోదాం మేనేజర్‌గా చేశా. 1995లో గ్రూప్‌–2 ద్వారా రెవెన్యూశాఖలో ఉద్యోగం వచ్చింది. నేను తహసీల్దార్‌గా ఉండగా.. 2007లో నాన్న  చనిపోయారు. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే నాన్న చలువే.           – నేనావత్‌ ఖీమ్యానాయక్, 
అదనపు కలెక్టర్, రాజన్న సిరిసిల్ల 

తండ్రి జ్ఞాపకంగా విగ్రహం
జమ్మికుంట: ఇప్పటివరకు రాజకీయనాయకులు.. ఉన్నతమైన వ్యక్తులకు మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేయడం చూశాం. కానీ.. ఓ తండ్రి చనిపోతే.. ఆయన జ్ఞాపకంగా విగ్రహం ఏర్పాటు చేశారు అతని పిల్లలు. అక్కడే ఏటా జయంతి, వర్ధంతి నిర్వహిస్తున్నారు. జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన పొట్లపల్లి జయరామారావు పట్వారి. పట్వారి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ తొలి ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. జమ్మికుంట జెడ్పీటీసీగా పనిచేశాడు. మూడేళ్లక్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఆయన కొడుకు పొట్లపల్లి శ్రీధర్‌బాబు, కూతురు కంకటి శ్రీదేవి వ్యవసాయక్షేత్రం జయరామారావు విగ్రహం ఏర్పాటు చేశారు. ఏటా జయంతి, వర్ధంతి నిర్వహిస్తున్నారు.

మా ఫాదర్‌ గ్రేట్‌
కోల్‌సిటీ(రామగుండం): మా నాన్న బుచ్చి రాజం. నాతో ఫ్రెండ్‌లా ఉంటారు. హిందీ టీచర్‌గా పని చేసి రిటైర్‌ అ య్యారు. ఇప్పు డు 82 ఏళ్లు. నాన్న నన్ను డాక్టర్‌ చేయాలనుకున్నారు. కానీ బీటెక్‌ చేసి, మున్సిపల్‌ కమిషనర్‌ అయ్యా. ప్రయోజకుడివయ్యావని అభినందించారు. ఇంత వయసొచ్చినా నాన్నకు ఇంకా నేను పిల్లాడినే. 1991లో హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో బీటెక్‌ చదువుతున్న సమయంలో ఒకరోజు జగిత్యాలలోని మా ఇంట్లో భోజనం తయారు చేసి బస్సులో పట్టుకొచ్చాడు. కాసేపు మాట్లాడితే సంతృప్తిగా ఉంటుంది. మా ఫాదర్‌ గ్రేట్‌.            – బి.సుమన్‌రావు, కమిషనర్, 
రామగుండంనగరపాలక సంస్థ

కిడ్నీ ఇచ్చి బతికించారు
కోల్‌సిటీ(రామగుండం): మాది గోదావరిఖనిలోని రమేశ్‌నగర్‌. ప్రస్తుతం కర్నాటకలో బళ్లారిలోని ఓ స్టీల్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న. నాన్న కిష్టయ్య సింగరేణిలో పని చేసి రిటైర్ట్‌ అయ్యారు. నాకు 2004లో కిడ్నీలు చెడిపోయాయి. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే తప్ప బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. దీంతో నాన్న, అమ్మ సుశీల ఆర్థికంగా, మానసింగా చాలా కష్టపడ్డారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై ఉన్న నాకు కిడ్నీదానం చేయడానికి నాన్న ముందుకు వచ్చారు. చాలా మంది వద్దని వారించారు. కానీ నా కొడుకు బతుకు ముఖ్యమంటూ కిడ్నీఇచ్చి నన్ను బతికించుకున్నాడు.
– పోతర్ల జయాకర్‌ రాజు, సీనియర్‌ మేనేజర్, బళ్లారి, కర్నాటక 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement