
అనారోగ్యంతో నిండు గర్భిణి మృతి
తల్లికి ఏమైందో తెలియని స్థితిలో చిన్నారులు
శవం వద్ద తల్లడిల్లిన పసిహృదయాలు
నూకపల్లిలో విషాదం
మల్యాల: ‘మా అమ్మకు ఏమైంది.. అమ్మ.. లే అమ్మా..’ ఆ చిన్నారుల కంటతడి అక్కడున్నవారిని కంట తడి పెట్టించింది. తల్లి తన ఒడిలో ఆడిస్తూ.. అల్లరి చేస్తే అడిగింది ఇస్తూ.. ఏడిస్తే బుజ్జగించే అమ్మ లేదని, ఇక తిరిగి రాదని ఆ పిల్లలకు తెలియదు. అమ్మే లోకంగా.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే పిల్లల అమాయక చూపులు.. అమ్మ లేదని తెలియని ఆ పిల్లలకు ఎప్పుడొస్తుందని అడిగితే ఏం చెప్పాలో తెలియని ఆ తండ్రిని చూసి గ్రామస్తులు తల్లడిల్లిపోయారు.
అనారోగ్యంతో బాధపడుతూ ఓ నిండు గర్భిణి మృతిచెందగా.. ఆమె మృతదేహం వద్ద కనిపించిన ఈ హృదయ విదారకమైన ఘటన మల్యాల మండలం నూకపల్లిలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. నూకపల్లికి చెందిన చెవులమద్ది మహేశ్‌తో పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందిన స్రవంతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు నిహాంత్ (7), కూతురు నిక్షిత (3) ఉన్నారు. మహేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు.
స్రవంతి బీడీలు చేస్తూ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. స్రవంతి మూడోసారి గర్భం దాల్చినప్పటినుంచి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. కొద్దిరోజుల క్రితం ఆస్పత్రికి పరీక్షల కోసం వెళ్లగా.. కడుపులో బిడ్డ కదలడం లేదని, కరీంనగర్‌కు రెఫర్ చేశారు. అక్కడ కూడా కడుపులో బిడ్డ కదలడం లేదని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి పురుడుపోసినా.. అప్పటికే శిశువు మృతిచెందింది. కాసేపటికి పరిస్థితి విషమించి స్రవంతి కూడా చనిపోయింది.
నూకపల్లిలో విషాదం
స్రవంతి పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లి.. కడుపులో బిడ్డ, తల్లి కూడా మృతిచెందడంతో నూకపల్లిలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా ఆమె కుమారుడు, కూతురు బిక్కుబిక్కుమంటూ చూడడం స్థానికులను కంటతడి పెట్టింది. మా అమ్మకు ఏమైంది అని అక్కడున్నవారిని అమాయకంగా అడగడంతో ఏం చెప్పాలో.. వారిని ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. నూకపల్లిలో స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. వందలాదిమంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆమె అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబసభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment