
నేడు(జూన్ 18) అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. ఈ సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి..
ఆధునిక భారతీయ కవులలో హరివంశ్‌రాయ్ బచ్చన్ సుప్రసిద్ధుడు. హిందీ కవిత్వంలోని ‘నయీ కవితా’ ఉద్యమ సారథుల్లో ఆయన ఒకరు. ఆయన 135 రుబాయిలతో రాసిన ‘మధుశాల’ కావ్యం ఆధునిక హిందీ కవిత్వానికి తలమానికంగా నిలిచే కావ్యాలలో ఒకటి. హిందీ సాహిత్యరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా హరివంశ్‌రాయ్ బచ్చన్ ‘పద్మభూషణ్’ పొందారు.
హరివంశ్‌రాయ్ బచ్చన్ భార్య తేజీ బచ్చన్ కూడా కవయిత్రి. తల్లిదండ్రుల రంగంలో కాకుండా, భిన్నమైన రంగాన్ని ఎంచుకున్నప్పటికీ అమితాబ్ బచ్చన్‌పై తండ్రి ప్రభావం చాలానే ఉంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ తొలినాళ్లలో నానా ఇక్కట్లు, తిరస్కారాలు ఎదుర్కొన్నా, సూపర్‌స్టార్‌గా ఎదిగి, బాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకున్నాడు.
(చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? సనాతన ద్రోహినా?: రచయిత భావోద్వేగం)
కష్టాలు పడుతున్న కాలంలో అమితాబ్ ఒకనాడు పట్టరాని ఉక్రోషంతో తండ్రి గదిలోకి వెళ్లి ‘నాన్నా! నన్నెందుకు కన్నావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఏదో రాసుకుంటూ ఉన్న హరివంశ్‌రాయ్ బచ్చన్ కొడుకు అడిగిన ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు. సాలోచనగా అతన్ని ఒకసారి తేరిపార చూశారు. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కాసేపటికి అమితాబ్ ఆ గది నుంచి వెళ్లిపోయాడు. మర్నాటి ఉదయమే హరివంశ్‌రాయ్ తన కొడుకును నిద్రలేపి, చేతిలో ఒక కాగితం ఉంచారు. అందులో ఈ కవిత ఉంది:
‘నా కొడుకు నన్నడిగాడు– నన్నెందుకు కన్నావని
బదులు చెప్పడానికి నా వద్ద సమాధానమేదీ లేదు.
నన్ను కనడానికి ముందు నా తండ్రి నన్నడగలేదు.
నా తండ్రిని ఈ లోకంలోకి తెచ్చేటప్పుడు నా తాత కూడా అతణ్ణి అడగలేదు...
నువ్వెందుకు కొత్త ప్రారంభానికి, కొత్త ఆలోచనకు నాంది పలకరాదు?
నీ పిల్లలను కనే ముందు నువ్వు వాళ్లనడుగు’
అమితాబ్ ఆలోచనలో మార్పు తెచ్చిన కవిత ఇది. ఒక సందర్భంలో ఈ కవితను ప్రస్తావించాడాయన. తనను ప్రభావితం చేసిన తన తండ్రిని అమితాబ్ సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకుంటూనే ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment