Interesting Facts About Indian Film Director B. Narsing Rao - Sakshi
Sakshi News home page

B Narasimha Rao: దొరికితే కాల్చేస్తారు..రెండేళ్లు అండర్‌గ్రౌండ్‌.. కట్‌ చేస్తే.. దేశం గర్వించే గొప్ప దర్శకుడు

Published Sun, Aug 6 2023 10:21 AM | Last Updated on Sun, Aug 6 2023 12:36 PM

Interesting Facts About Indian Film Director B Narasimha Rao - Sakshi

తెలుగు సినిమా ఇప్పుడు సెకండ్‌ హాఫ్‌కు వచ్చింది. ఈ సెకండ్‌ హాఫ్‌ తెలంగాణ సినిమాది. తెలంగాణ హీరో, తెలంగాణ హీరోయిన్, తెలంగాణ పల్లె, తెలంగాణ పలుకుబడి.. తెలంగాణ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అయ్యింది. ఇకపై తెలంగాణ లేకుండా తెలుగు సినిమా మనజాలదు. ఈ కొమ్మరెమ్మల పూలు ఫలాలకు ఒకప్పుడు పాదు కట్టినది బి.నరసింగరావు.‘ఈ మట్టికి ఒక చరిత్ర ఉంది. ఈ మాటకు ఒక మిఠాస్‌ ఉంది. ఇక్కడి పేదకు ఒక గాథ ఉంది. ఇక్కడి ఆగ్రహానికి ఒక ఆయుధం ఉంది’ అని  తెలుగు సినిమాలోకి తెలంగాణ జీవనాన్ని మొదటగా తీసుకువచ్చిన దర్శక నిర్మాత బి.నరసింగరావు. న్యూ సినిమా, ఆర్ట్‌ సినిమా, నియో రియలిస్టిక్‌ సినిమా, పారలెల్‌ సినిమా, ఆఫ్‌బీట్‌ సినిమా.. ఇలా రకరకాల పేర్లతో నవ సినిమా ఉద్యమం ప్రపంచమంతా వికసిస్తున్నప్పుడు ఆ ప్రభాతం వైపు చూపుడువేలు తిప్పి అటుగా దృష్టి ఇచ్చిన దార్శనికుడు బి.నరసింగరావు. ఆయన వల్ల తెలుగు సినిమా తల ఎత్తుకు తిరిగింది. ఆయనకి తెలంగాణ సినిమా తల వొంచి నమస్కరిస్తుంది.

ప్రజలు వెలుతురులో ఉండాలనుకునేవాడు ఒక్కోసారి చీకటిలో దాక్కోక తప్పదు.బి. నరసింగరావు పరిస్థితి అలాగే ఉంది– 1975లో.

 ‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది’ అనుకునేవారు అడవుల్లోకి మళ్లారు. ‘కుంచెతో కలంతో కూడా ప్రజలను రాజ్యాధికారం వైపు నడిపించవచ్చు’ అని మరికొందరు జనం మధ్య ఉండిపోయారు. కళ అంటే ప్రజాకళ.. కళాకారుడికి ఉండవలసిన దృక్పథం అభ్యుదయ దృక్పథం.. రచన కూడా ఉద్యమమే.. నాలుగు వాక్యాల కవిత కూడా డైనమైటే.. అనుకునే కళాకారులు తయారవుతున్న సమయం అది. దీని కంటే ముందు ‘ఆర్ట్‌ లవర్స్‌’ పేరుతో ఒక సమూహాన్ని సిద్ధం చేసి సామన్యుల వద్దకు నాటకాన్ని విస్తృతంగా తీసుకెళుతున్న బి.నరసింగరావు 1974 నాటికి ప్రభుత్వానికి ‘వాంటెడ్‌’ అయ్యారు. ‘దొరికితే కాల్చేస్తారు. లేదా జైల్లో వేస్తారు’ అని తెలిసిపోయింది.

బి.నరసింగరావు చేసిన నేరం? ప్రజల్ని చైతన్యపరచడం. ప్రజలు చైతన్యం కావడం పాలకులకు నచ్చదు. ‘పొత్తుల వ్యవసాయం’, ‘సమాధి’, ‘బీదలపాట్లు’, ‘కొత్తమనిషి’ వంటి నాటకాలు స్వయంగా రాసి, నటిస్తూ, ‘మీ పరిస్థితి ఇలా ఉంది.. మీరిలా చేయాలి’ అని ‘నూరి పోస్తున్న’ బి.నరసింగరావు కనుకనే ప్రభుత్వానికి ‘వాంటెడ్‌’ అయ్యారు.

1974–75. రెండేళ్లు. ‘అండర్‌గ్రౌండ్‌’.  హైదరాబాద్‌లోనే అజ్ఞాత జీవితం. ఉదయం ఐదున్నరలోపు ఎవరినైనా కలిస్తే కలవాలి. రాత్రి తొమ్మిది తర్వాత మళ్లీ. సూర్యుడు తిరుగాడే సమయంలో తిరుగాడ్డానికి వీల్లేదు. పగలంతా గదిలో బందిఖానా అయి ఉన్న నరసింగరావులో ఎన్నో ఆలోచనలు. ‘నేను కళాకారుణ్ణి.. నా కళ జనం చూడాలి.. దానికి స్పందన నేను చూడాలి.. అడవిలోకో అండర్‌గ్రౌండ్‌లోకో వెళ్లేలా నా కళా జీవితం ఉండకూడదు.. నా కళ వెలుతురులో ఉండాలి’.. అనే నిర్ణయానికి వచ్చారు. 1976లో అండర్‌గ్రౌండ్‌ నుంచి బయటకొచ్చాక ఆయన పెట్టుకున్న మూడు ఆప్షన్లు.. భగత్‌ సింగ్‌ గురించి ఒపెరా మాదిరిగా రవీంద్ర భారతిలో ఆరు నెలలు వరుసగా నాటకం ఆడటం లేదా ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ లాంటి మేగజీన్‌ను నడపడం లేదా సినిమా తీయడం.

అసలు దొరల కుటుంబంలో బంగారు చెమ్చాతో పుట్టిన బి.నరసింగరావు సినిమాల్లో చూపినట్టుగా గుర్రం ఎక్కి తిరుగుతూ అమాయకులను భయభ్రాంతం చేస్తుండాలి గాని ఈ నాటకాలు, పాటలు, పదుగురితో కలసి చాయ్‌ సిగరెట్ల మధ్య సాహిత్యాన్ని చర్చించడాలు.. ఏమిటిలా.. ఎందుకిలా?
∙∙ 
‘లెక్కలు వచ్చేవి కావు. ఎక్కాలు చెప్పలేకపోయేవాణ్ణి. మా నాన్న ఎంత పెద్ద పట్వారీ అయినా లెక్కల పంతులు ఎండలో ఒంటికాలి మీద నిలబెట్టేవాడు. పదో క్లాసు పాస్‌ అవడం కూడా కష్టమైంది. అందరూ చదివే చదువు వల్ల కాదనిపించింది. అందుకే ఆ తర్వాత ఫైన్‌ ఆర్ట్స్‌లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ చదివాను’ అంటారు బి.నరసింగరావు. గజ్వేల్‌ (మెదక్‌)కు దగ్గరగా ఉన్న ప్రజ్ఞాపూర్‌ బి.నరసింగరావుది. కాని ఆ తర్వాతి జీవితం అంతా హైదరాబాద్‌లో ‘అల్వాల్‌’లో గడిచింది. ‘హైదరాబాద్‌లోని రీగల్‌ థియేటర్‌లో నా చిన్నప్పుడు చూసిన తొలి సినిమా ‘మేనరికం’ (1953). ఆ తర్వాత హిందీ ‘సువర్ణసుందరి’ చూశాను. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కాలేజ్‌కి వెళ్లనే లేదు. దాని పక్కనే ఉండే థియేటర్లలో ఉండేవాణ్ణి’ అంటారాయన.

పుస్తకాల పిచ్చి కూడా అలాగే పట్టింది. ‘మా నాన్నగారి గదిలో చాలా పుస్తకాలు ఉండేవి. ఒకసారి వాటిని చదవడం మొదలెట్టి 40 రోజుల్లో 60 పుస్తకాలు చదివాను. ఆ తర్వాత కోఠి లైబ్రరీలో మకాం వేశాను. టెక్ట్స్‌బుక్స్‌ కన్నా ఈ పుస్తకాలు నాకు నచ్చాయి. అధికారం, దర్పం కన్నా గోడ మీద పడే ఉదయపు ఎండ నన్ను ఎక్కువ సంతోషపెట్టేది’ అని గుర్తు చేసుకున్నారాయన.సాహిత్యం, సినిమాలు, నాటకాలు, చిత్రలేఖనం.. ఇవన్నీ బి.నరసింగరావును చేర్చవలసిన చోటుకే చేర్చాయి– సినిమాకు– తన భూమికి– మాభూమికి.


∙∙ 
సందర్భవశాన మన దేశ దాదాపు తొలి నియో రియలిస్టిక్‌ సినిమా ‘దో బిఘా జమీన్‌’ (1953) భూమి సమస్యనే చర్చించింది. పేదవాడికి దక్కని భూమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూవేవ్‌ సినిమా, న్యూ సినిమా మొదలయ్యిందే పేదల గురించి పీడకుల గురించి మాట్లాడటానికి. నిర్మాతల, నటీనటుల గుప్పిట్లో ఉండే కాలక్షేప సినిమాను దర్శకుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తెలియని ముఖాలతో, మామూలు మనుషులనే నటులుగా చేసి తక్కువ ఖర్చు, తక్కువ వనరులతో ప్రయోజన్మాతక సినిమాను చెప్పడమే న్యూ సినిమా.

సత్యజిత్‌ రే వచ్చి ‘పథేర్‌ పాంచాలి’ (1955) తీసి ఆర్ట్‌ సినిమా అనే మాటను దేశానికి పరిచయం చేశాడు. అయితే ఒక ధోరణిగా ఆర్డ్‌/పారలెల్‌ ఫిల్మ్స్‌ రావాలంటే 1970లు రావాల్సి వచ్చింది. హిందీలో ఎం.ఎస్‌.సత్యు ‘గరం హవా’ (1973), శ్యాం బెనగళ్‌ ‘అంకుర్‌’ (1974) పారలెల్‌ సినిమాను తీసుకొచ్చాయి. మరోవైపు మలయాళంలో ఆదూర్‌ గోపాల్‌కృష్ణన్‌ వచ్చి ‘స్వయంవరం’ (1972) తీశాడు. కన్నడంలో మన తెలుగు పఠాభి ‘సంస్కార’ (1970) తీశాడు. కాని గమనించవలసిన విషయం ఏమిటంటే తెలుగులో పారలెల్‌ సినిమా ముగ్గురు బయటి దర్శకుల వల్ల వచ్చింది. మృణాల్‌సేన్‌ ‘ఒక ఊరి కథ’ (1977), శ్యామ్‌ బెనగళ్‌ ‘అనుగ్రహం’ (1977), గౌతమ్‌ ఘౌష్‌ ‘మాభూమి’ (1979). ఈ ‘మాభూమి’ బి. నరసింగరావు చెమటా, నెత్తురు, తెలంగాణ సినిమాకు ఆయన తెరవాలనుకున్న తొలివాకిలి.
∙∙ 
‘నవయుగ డిస్ట్రిబ్యూటర్స్‌ ప్రసాదరావు గారి అబ్బాయి రవీంద్రనాథ్‌ నా క్లాస్‌మేట్‌. వాడు కూడా ఎమర్జన్సీ టైమ్‌లో కోల్‌కతా వెళ్లి అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. తిరిగి వచ్చాక వాణ్ణి ప్రొడక్షన్‌లో పెట్టారు. మృణాల్‌సేన్‌ ‘ఒక ఊరి కథ’కు వాడు పని చేస్తుంటే నేను వెళ్లేవాణ్ణి. అప్పటికే నాకు సినిమా తీయాలని ఉంది. దర్శకత్వం చేయాలని ఉంది. కాని ఎలా తీయాలో తెలియదు. ఒక లక్ష రూపాయల్లో సినిమా తీయమని మృణాల్‌సేన్‌ను అడిగితే అంత తక్కువలో నేను చేయలేను.. కొత్త కుర్రాడొకడున్నాడు..అతన్ని ఉపయోగించుకో అని గౌతమ్‌ ఘోష్‌ను పంపారు.

తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం నేపథ్యం ఉన్న కిషన్‌ చందర్‌ నవల ‘జబ్‌ ధర్తీ జాగే’ను తీసుకున్నాం. గౌతమ్‌ ఘోష్‌ దానికి రాసుకొచ్చిన స్క్రీన్‌ప్లే నాకు నచ్చలేదు. మళ్లీ కూచుని అందరం రాశాం. దర్శకత్వం ఎలా చేయాలో తెలుసుకుందామంటే గౌతం ఘోష్‌ నేర్పే మనిషి కాదు. అందుకని అతని వెంటే తిరుగుతూ అబ్సర్వ్‌ చేస్తూ సినిమా తీయడం తెలుసుకున్నాను’ అంటారు బి. నరసింగరావు.

1980లో తెలుగులో రిలీజైన రెండు సినిమాలు ‘శంకరాభరణం’, ‘మాభూమి’ సంచలనం సృష్టించాయి.  కె. విశ్వనాథ్‌తో ప్రయోగం అంతో ఇంతో సేఫ్‌. కాని తెలంగాణ సినిమా కొత్తవాళ్లతో తీసి విడుదల చేయడం చాలా రిస్క్‌. ‘లక్ష అనుకున్న బడ్జెట్‌ ఐదున్నర లక్షలు అయ్యింది. ఆస్తి అమ్మాల్సి వచ్చింది. మొత్తం ఔట్‌డోర్‌లో తీయడం వల్ల ఎన్నో సమస్యలు. అందరూ పడి దెబ్బలు తగిలించుకునేవారే. రోజుకు ఒక అయొడిన్‌ సీసా అయిపోయేది’ అన్నారు బి.నరసింగరావు. కాని ఆ శ్రమ వృథా పోలేదు. ‘మాభూమి’ తెలంగాణ కథకు, సినిమాకు అరుగు కట్టింది. దాని మీద బంగారు నందిని కూచోబెట్టింది. హైదరాబాద్‌లో వంద రోజులు ఆడి అందరినీ చకితులను చేసింది. ఇదే సినిమాతో గద్దర్‌ని బి. నరసింగరావు యుద్ధనౌకను చేసి జనంలోకి వదిలారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పెద్ద హిట్‌.


∙∙ 
‘రంగుల కల.. దర్శకుడిగా నా మొదటి సినిమా. మన దేశంలో మోడర్న్‌ పెయింటర్‌ మీద అప్పటికి ఒక్క సినిమా లేదు. జీవితంలో, కళలో ఒకేసారి దారి తెన్నూ వెతుక్కునే చిత్రకారుల కథ అది. కళ ప్రజల పక్షం ఉండాలి సరే. కళాకారుడు ఏ విధంగా బతకాలి. అతణ్ణి ఎక్స్‌ప్లాయిట్‌ చేసే వర్గాల కళారాధనలో బోలుతనం ఎంత.. ఇవన్నీ చర్చించాను. పస్తుల చిత్రకారుల 1980ల స్థితికి దర్పణం ఆ సినిమా’ అన్నారు బి. నరసింగరావు. ‘రంగుల కల’ (1983)లో బి. నరసింగరావు హీరో. హైదరాబాద్‌ నగరం ఇందులో ఒక పాత్రధారి. ఒక స్లమ్‌లో నివసించే చిత్రకారుడిగా ఆయన నటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రూప హీరోయిన్‌. గద్దర్‌ పాడిన ‘భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న’ పాట రేడియోలో నిత్యం మోగిపోయింది. 
∙∙ 
‘సీనియర్‌ జర్నలిస్ట్‌ జి.కృష్ణగారు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. అప్పుడాయనొక మాట చెప్పారు– నరసింగరావు.. 1940ల్లో నేనొక దొరల గడీకి వెళ్లాను. అక్కడ ఒక దాసి నా కాళ్ల మీద నీళ్లు పోసి కడగడానికి వచ్చింది. నా కాళ్లు నేను కడుక్కోలేనా అన్నాను. ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో కడిగించుకుంటారు మీరు కాళ్లకే ఇబ్బంది పడితే ఎలా అంది. అలా కడిగించుకునే మనుషులు ఎలాంటి వాళ్లు– అన్నారు. ఆ మాట నా మనసులో పడింది. మా నాన్న హయాంకు మా ఇంట్లో దాసీలు లేరు. నేను చూళ్లేదు. నేను నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్లి మనింట్లో దాసీలు ఉండేవారా అనంటే నిన్ను చిన్నప్పుడు చూసుకున్న లచ్చవ్వ దాసీయే కదా అంది. లచ్చవ్వ నా చిన్నప్పటికి ముసలిదైపోయింది. అంటే మా తాతల కాలంలో ఉండేవారన్న మాట. అక్కడి నుంచే దాసి సినిమా కథ పుట్టింది’ అన్నారు బి. నరసింగరావు.

1988లో వచ్చిన ‘దాసి’ తెలంగాణ సినిమా కీర్తిని, తద్వారా బి. నరసింగరావు కీర్తిని ప్రపంచానికి చాటింది. ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోని అనేక సినిమా స్కూళ్లలో ఆ సినిమా సిలబస్‌. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆ సినిమా చూసి కదిలిపోయి బి. నరసింగరావుకు ఫ్యాన్‌గా మారారు. తనకు ఆత్మీయులను చేసుకున్నారు. ఏమిటి ‘దాసి’ గొప్పతనం? అది వేదనను సహజంగా చెప్పింది. మనుషులు క్రూరత్వాన్ని సాధారణ విషయంగా భావించేలా జీవిస్తుంటారు.

ఎదుటివారిని హింసించడం వారి ఖర్మ వల్లే అనుకుంటారు. పశ్చాత్తాపం ఎరగని ఇలాంటి మనుషులు ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూనే ఉన్నారు. నటి అర్చన ఈ సినిమా మొత్తం ఒకటి రెండు చీరల్లో కనిపిస్తుంది. ఆమెతో దొర గడిపినా ఆమె హోదా ఏమీ మారదు. వంట గదిలో చాలా ఘోరమైన బొచ్చెలో తిండి పెడతారు. ఆమెకు కడుపు వస్తే అది వెలి కడుపు. దొరసానికి కడుపు రాకపోయినా పర్లేదు కాని దాసిదానికి రాకూడదు. ‘కడుపు తీయించు’ అని దొరసాని హుకుం జారీ చేస్తే గడిలోని ముసలి దాసి పచ్చి బొప్పాయి కాయని కత్తి పీట మీద రెండుగా కోస్తుంది. ప్రేక్షకులకు గుండె ఝల్లుమంటుంది. తీవ్రమైన హింస అతి మామూలుగా ఉంటుందని బి. నరసింగరావు చూపుతారు. నేటికీ ‘దాసి’ చూడకపోతే తెలుగువారు ఒక కాలాన్ని ఒక జీవన వేదనని తెలుసుకోనట్టే. అందుకే ముసోరి ట్రైనింగ్‌లో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్‌లకు ఈ సినిమా చూపిస్తారు.
∙∙ 
బి. నరసింగరావుకు సినిమా ఆదాయ మార్గం కాదు. కాంబినేషన్‌ సెట్‌ చేసి అడ్వాన్సులు తీసుకోవడం కాదు. ఏరియా వారి కలెక్షన్లు కాదు. సినిమా అనేది బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ‘నా సినిమాలు చూశాక అవి చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి’ అంటారాయన. బి. నరసింగరావు తీసిన ‘మట్టి మనుషులు’ భవన నిర్మాణ కూలీల వ్యథాత్మక జీవితాన్ని చూపిస్తుంది. ఆ సినిమాలో కూలీల పై సాగే భౌతిక దోపిడి ఒక ఎత్తయితే వారిలో స్త్రీల పై సాగే లైంగిక దోపిడి మరో ఎత్తు. ‘మట్టి మనుషులు’ చూస్తే భవన నిర్మాణ కూలీల పట్ల సగటు మనిషి వైఖరి మారుతుంది. ఇదే కాదు హైదరాబాద్‌ నగరం మీద ‘ది సిటీ’, ఊరి జీవనం మీద ‘మా ఊరు’ డాక్యుమెంటరీలు తీసినా గాఢంగా ముద్రవేసే జీవన దృశ్యాలు. ‘మా ఊరు’ అయితే భావి తరాల కోసం దాచి పెట్టిన తాళపత్రగ్రంథం.

∙∙ 
బి. నరసింగరావు ఇప్పుడు డెబ్బయిల వయసు దాటారు. కాని నిత్యం సినిమా గురించో చిత్రకళ గురించో ఏదైనా కవిత్వం గురించో కథ గురించో పని చేస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్‌తో వేలకొలది ఫొటోలు తీస్తూ ప్రతి కొత్త సాంకేతిక పరికరం సాంస్కృతికంగా ఎలా ఉపయోగపడుతుందో చూస్తుంటారు. ఆయన తెలంగాణ సినిమాకు భూమిక ఏర్పరచకపోతే ఇవాళ ఊరూరా ప్రదర్శించిన ‘బలగం’ లాంటి సినిమాలు ఇప్పటికీ సాధ్యమయ్యేవి కావు. ‘తెలంగాణ ఏర్పడ్డాక సాంస్కృతికంగా చేయవలసింది చాలా ఉంది’ అంటారాయన. ‘అందుకై ప్రత్యేకంగా ఎవరితోనూ తలపడాలని నేను అనుకోను. కాని తలపడే సందర్భం వస్తే సిద్ధంగా ఉంటాను’ అన్నారాయన.

ఆరగడుగుల పై చిలుకు ఎత్తుతో తన నివాసంలో ఆయన తెలంగాణ సినిమా భీష్మాచార్యుడిలా కనిపించారు. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత యు.ఆర్‌.అనంతమూర్తి ‘దాసి’ చూసి పొంగిపోతూ ‘మై కంట్రీ ఈజ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ’ అన్నారట. నిజమే. ఈ గొప్ప దర్శకుణ్ణి చూసి దేశం గర్విస్తూనే ఉంటుంది.

 ‘మట్టి మనుషులు’లో మొదటిసారి నీనా గుప్తాను పరిచయం చేశారు బి.నరసింగ రావు. ఆ సినిమాలో ఆమె భవన నిర్మాణ కూలీగా నటించింది. అందుకోసం రెండువారాలు హైదరాబాద్‌లో ఉండి తెలుగు కొద్దిగా నేర్చుకుంది. సినిమాలో ఆమె పాడే బిట్‌సాంగ్‌ ఉంది. అది ఆమే పాడింది.

► ‘దాసి’ కోసం నటి అర్చన స్నానం చేసే సీన్‌ తీయాల్సి ఉంది. ఒప్పుకోదేమో అనుకున్నారు. కాని అప్పటికే షూట్‌ జరుగుతున్న విధంలోని సీరియస్‌నెస్‌ను గమనించిన అర్చన ఆ సీన్‌ తీయడానికి అంగీకరించింది. కేవలం కెమెరామేన్‌ ఎ.కె.బీర్, తాను మాత్రమే లొకేషన్‌లో ఉండి మిగిలిన వారిని బయటకు పంపించి ఆ సీన్‌ తీశారు.

► దాసి’లో దొర వేషం వేసిన భూపాల్‌ నిజ జీవితంలో శాంత స్వభావి. కాని దొర మనస్తత్వం ఏర్పడటానికి ఇంట్లో కూడా కటువుగా వ్యవహరించమని భూపాల్‌కు నరసింగరావు సూచించారు.  షూటింగ్‌ మొదలయ్యాక భూపాల్‌ ఇంట్లో కూడా భార్యతో కఠినంగా వ్యవహరిస్తుండేసరికి ఆమె బెదిరిపోయి ఏం జరిగిందో తెలుసుకోవడానికి  బి. నరసింగరావు దగ్గరకు వచ్చింది. అలా ఉండమని చెప్పింది తనే కనుక ఏం జవాబు చెప్పాలో తెలియక ఏదో సర్దిచెప్పి పంపించారు. 

► బి.నరసింగరావు తెలుగు సినిమాకు పరిచయం చేసినవారిలో దర్శకుడు గౌతమ్‌ ఘోష్, నటుడు భూపాల్, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, కవి దేవిప్రియ, నటుడు సాయి చంద్, గద్దర్, చిత్రకారుడు చంద్ర తదితరులు ఉన్నారు. తోట వైకుంఠం ‘రంగుల కల’ సినిమాలో కనిపిస్తారు. ‘రంగుల కల’లో గద్దర్‌ ‘భద్రం కొడుకో’ పాడుతుంటే కోరస్‌ సింగర్స్‌లో వంగపండు ఒకరిగా కనపడతారు.

► బి.నరసింగరావుకు సంగీతంలో గొప్ప ప్రవేశం ఉంది. ‘దాసి’కి ఆయన కూర్చిన నేపథ్య సంగీతం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతాన్ని తెలుగు సినిమాల్లో నేపథ్య సంగీతంగా బి.నరసింగరావు సమర్థంగా ఉపయోగించారు. ‘ది సిటీ’ డాక్యుమెంటరీ అందుకు ఉదాహరణ.

► ‘రంగుల కల’లో క్రేన్‌ ఉపయోగించి ఒక షాట్‌ తీయాల్సి వచ్చింది. కాని క్రేన్‌కు అద్దె ఎక్కువ. తక్కువ బడ్జెట్‌లో తీస్తున్న సినిమా కనుక  కార్పొరేషన్‌ వారు వీధి దీపాలు మార్చడానికి ఉపయోగించే నిచ్చెన వాడి ఆ షాట్‌ తీశారు.

► బి.నరసింగరావు మంచి నటులు. ‘మా భూమి’లో ముఖ్యపాత్ర పోషించారు. రజాకార్లు తల మీద వాత పెట్టగా ఆ బాధ పట్టక జనం కోసం మాట్లాడే పాత్ర అది. ‘రంగుల కల’లో బి.నరసింగరావు హీరో. రూప హీరోయిన్‌. ఆ సినిమాలో ‘కౌగిలించుకోని’ హీరో హీరోయిన్లను చూపించడం ఒక వింత. ఎందుకంటే అప్పటికి హీరో హీరోయిన్ల గెంతులు శ్రుతి మించి ఉన్నాయి. 

- ఖదీర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement